కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో పరిహారం మంజూరు చేయాలని అధికారులను నిలదీస్తున్న ప్రజలు
ఐదేళ్లుగా పెడుతున్న అర్జీలకు అతీగతి లేదన్న ఆవేదన.. పేరుకుపోయిన సమస్యలు పరిష్కారం కాలేదన్న ఆక్రోశం.. కష్టాలు తీర్చని సభలు ఎందుకన్న ప్రశ్నలు.. చుట్టపు
చూపుగా వచ్చేందుకా మిమ్మల్ని ఎన్నుకున్నది అని అధికార పార్టీ ప్రతినిధులకు నిలదీతలు.. సమాధానం చెప్పలేక నీళ్లు నమిలిన ఎమ్మెల్యేలు, అధికారులు.. మరో వైపు సమస్యలు
పక్కనబెట్టి ఆటల పాటలతో కాలక్షేపం.. ఇవి తొలి రోజు జిల్లాలో నిర్వహించిన ‘జన్మభూమి–మాఊరు’ కార్యక్రమంలోకనిపించిన దృశ్యాలు.
సాక్షి, మచిలీపట్నం: ప్రజా సమస్యల పరిష్కారమే ధేయ్యంగా ప్రభుత్వం బుధవారం నుంచి 11వ తేదీ వరకు జన్మభూమి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా తొలి రోజు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా సభలు ఏర్పాటు చేసింది. అయితే కొన్ని చోట్ల సభలు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లో ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. తమ సమస్యలు ఎప్పటికి పరిష్కారం అవుతాయనిఎమ్మెల్యేలు, అధికారులను ప్రజలు నిలదీశారు.
♦ నూజివీడు 2వ వార్డులో మహిళలు మున్సిపల్ అధికారులను నిలదీశారు. ఐదేళ్లుగా నిర్వహిస్తున్న జన్మభూమి కార్యక్రమంలో అర్జీలు ఇస్తున్నా ఇళ్ల స్థలాలు ఇవ్వడం లేదని, అసలు తాము ఇస్తున్న అర్జీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.
♦ పెనుగంచిప్రోలులో ఉదయం 11 గంటలకు కూడా గ్రామసభ ప్రారంభం కాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. గుమ్మడిదూరులో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని, అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్యను ప్రజలు ప్రశ్నించారు.
♦ జి.కొండూరు మండలం చెవుటూరు కార్యక్రమం రసాభాసగా మారింది. టీడీపీ పార్టీకి చెందిన వారమైనా.. తమ ఇళ్ల స్థలాలు కబ్జాకు గురయ్యాయని అర్జీలు పెట్టుకున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యాడని, ఇలాంటి సభలతో ప్రయోజనం ఎంటని ప్రశ్నించారు. కబ్జా దారులు స్థలాలు ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని మహిళలు అధికారులను నిలదీశారు.
♦ కంచికచర్ల మండలం గొట్టుముక్కలలో జరిగిన కార్యక్రమంలో సుబాబుల్ కర్రను రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యను రైతులు నిలదీశారు.
♦ ఇబ్రహీంపట్నం మండలం దామలూరులో జరిగిన కార్యక్రమంలో ఇళ్ల స్థలాలు, పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయాలని దరఖాస్తులు వెల్లువెత్తాయి.
♦ తిరువూరు ఒకటో వార్డులో కొలికపోగు నారాయణ మృతి చెంది 4 నెలలైనా ఇంతవరకు చంద్రన్న బీమా సొమ్ము రాలేదని అతని కుటుంబసభ్యులు జన్మభూమి గ్రామసభలో ఆందోళన వ్యక్తం చేశారు.
♦ కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో కార్యక్రమాన్ని స్థానికులు కనీసం సీఎం సందేశం కూడా చదవనివ్వకుండా అడ్డుకున్నారు. పెథాయ్ తుపాను నష్టపరిహారం మంజూరు చేయకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరికి ఆర్డీఓ, ఎమ్మెల్యే కాగిత ఫోన్‌లో మాట్లాడినా వినలేదు. దీంతో చేసేది లేక అధికారులు సభ జరపకుండానే వెనుదిరిగారు.
సమస్యలు పక్కనబెట్టి.. స్టెప్పులేయించి..
ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్దేశించిన జన్మభూమి కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు కాలక్షేపానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థులతో స్టెప్పులేయించి ఎంజాయ్ చేశారు. పెడన 2వ వార్డు, మొవ్వ మండలంలో సైతం ఇదే పరిస్థితి నెలకొంది. చిన్నారులతో డ్యాన్స్ చేయించి కాలక్షేపం చేశారు.
కౌలు రైతు ఆత్మహత్యాయత్నం
చల్లపల్లి మండలం నడకుదురు జరిగిన జన్మభూమి కార్యక్రమంలో రాయుడుపాలెంకు చెందిన కౌలు రైతు బడుగు వెంకటేశ్వరరావు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తాను ఎకరం పొలం కౌలుకు తీసుకుని సాగు చేశానని, ఇటీవల సంభవించిన పెథాయ్ తుపాను ప్రభావానికి పనలపై ఉన్న పంట తడిసిపోయిందన్నారు. ఈ విషయమై జన్మభూమి సభలో పంటనష్టంపై ప్రస్తావించారు. అధికారులు నష్టపరిహారంపై స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగేందుకు ప్రయత్నించారు. వెంటనే పోలీసులు అడ్డుకుని ఆయనకు నచ్చజెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment