సాక్షి,కృష్ణాజిల్లా, మచిలీపట్నం: జన్మభూమి కార్యక్రమం ‘రణ’ భూమిగా మారుతోంది. సమస్యలను ప్రస్తావించకుండా టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. తాము చెప్పిందే వినాలి.. తిరిగి ప్రశ్నించకూడదన్న ధోరణి అవలంబిస్తున్నారు. వెరసి ప్రజల్లో రోజు రోజుకూ అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఐదేళ్లుగా అర్జీలు ఇస్తున్నా నేటికీ పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు ఎప్పుడు తీరుస్తారని ఎక్కడికక్కడ టీడీపీ ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. వాళ్లు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సభలు తూతూ మంత్రంగా ముగించేసి జారుకుంటున్నారు.
♦ పెడన పట్టణం 6వ వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా సాగింది. సమస్యలు ప్రస్తావించేందుకు సభకు వచ్చిన మున్సిపల్ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్‌పై టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. మున్సిపాలిటీలో నెలకొన్న పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించగా టీడీపీ జన్మభూమి కమిటీ నాయకులు, వైస్‌చైర్మన్ అబ్దుల్‌ఖయ్యూం, వహెబ్‌ఖాన్, హామీదుల్లా, యక్కల శ్యామలయ్య తదితరులు చైర్మన్‌పై తీవ్ర పదజాలంతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో చైర్మన్‌ను నెట్టేశారు. ఆ సమయంలో ఆయన చేతికి ఉన్న వాచి సైతం విరిగిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్యను సర్దుమణిగేలా చేశారు.
♦ కృత్తివెన్ను మండలం పల్లెపాలెం జన్మభూమి మాఊరు సభ రసాభాసగా మారింది. ఐదేళ్ల పాలనలో మా గ్రామానికి చేసిందేమీ లేదని, అలాంటప్పుడు మాకెందుకీ సభలు అంటూ పల్లెపాలెం వాసులు జన్మభూమి సభను అడ్డుకున్నారు. కనీసం ప్రతిజ్ఞ, సీఎం సందేశం కూడా చదవడానికి వీలులేదంటూ పట్టుపట్టారు. దీంతో పోలీసులు పహారాలో అధికారులు తూతూ మంత్రంగా సభను నిర్వహించారు. నాలుగున్నరేళ్ల పాలనలో మా పంచాయితీకి ఇచ్చింది కేవలం రెండు లక్షల రూపాయలే, దీనిపై ఎమ్మెల్యేని అడుగుతుంటే జెడ్‌పీటీసీని అడగమంటున్నారు. అసలు మాకు ఎమ్మెల్యే ఉన్నట్టా లేనట్టా అంటూ స్థానికులైన దావీదు, వరదరాజులతో పాటు కొందరు వేదికపై ఉన్న జెడ్‌పీటీసీ తులసీరావును నిలదీశారు.
♦ విజయవడ నగరంలోని 29వ డివిజన్ పరిధిలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జన్మభూమి కార్యక్రమంలో వినూత్న నిరసన తెలిపారు. దీంతో పక్కనే ఉన్న పోలీసులు అరెస్టు చేశారు.
♦ విజయవాడ నగరంలో శ్మశానానికి స్థలం కేటాయించాలని దళితులు జన్మభూమి కార్యక్రమంలో ప్రశ్నించారు. సమస్య పరిష్కరించాల్సిన పాలకులు దళితుల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఒక్క సారిగా దళిత నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.
♦ కంకిపాడు మండలం కుండేరులో తమకు రేషన్ కార్డులు ఎప్పుడిస్తారని ప్రజలు తహసీల్దార్‌ను నిలదీశారు. ఐదేళ్లుగా అర్జీలు సమర్పిస్తున్నా.. వాటి పరిష్కారం మాత్రం లభించడం లేదని ఆవేదన చెందారు.
♦ నందివాడ మండలం పెద్ద లింగాల గ్రామంలో గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. పలు మార్లు అధికారులకు అర్జీలు పెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. దీంతో జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యను ప్రజలు నిలదీశారు. దళితులు ఎక్కువ నివసిస్తున్న గ్రామంలో తాగునీటి సైతం తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యే కల్పనపై మహిళాగ్రహం
మంత్రిపాలెం(మొవ్వ): ‘జన్మభూమి–మా ఊరు’ గ్రామసభలలో భాగంగా మూడో రోజైన శుక్రవారం మంత్రిపాలెం గ్రామంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన మహిళలు సభను స్తంభింపచేశారు. మొవ్వ మండలం మంత్రిపాలం పంచాయతీ పరిధిలోని సూరసాని మాలపల్లిలో అధ్వానంగా ఉన్న అంతర్గత రహదారులు నిర్మించని అధికారులపై, రోడ్డు అభివృద్ధికి కృషి చేయని ఎమ్మెల్యే కల్పన నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ దళితవాడ మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో దళితవాడ అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చిన కనీసం దాని వైపు కన్నెత్తి చూడని ఎమ్మెల్యే, మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏ మొఖం పెట్టుకుని గ్రామానికి వచ్చావంటూ గ్రామస్తులు నిలదీశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ఎంపీపీ కిలారపు మంగమ్మ, తహసీల్దార్ బి రామానాయక్, ఎంపీడీవో వి ఆనందరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment