MLA kalpana
-
ఎమ్మెల్యే కల్పనపై మహిళాగ్రహం
సాక్షి,కృష్ణాజిల్లా, మచిలీపట్నం: జన్మభూమి కార్యక్రమం ‘రణ’ భూమిగా మారుతోంది. సమస్యలను ప్రస్తావించకుండా టీడీపీ నాయకులు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. తాము చెప్పిందే వినాలి.. తిరిగి ప్రశ్నించకూడదన్న ధోరణి అవలంబిస్తున్నారు. వెరసి ప్రజల్లో రోజు రోజుకూ అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఐదేళ్లుగా అర్జీలు ఇస్తున్నా నేటికీ పరిష్కారం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ కష్టాలు ఎప్పుడు తీరుస్తారని ఎక్కడికక్కడ టీడీపీ ప్రజా ప్రతినిధులను నిలదీస్తున్నారు. వాళ్లు సమాధానం చెప్పలేక నీళ్లు నములుతున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో సభలు తూతూ మంత్రంగా ముగించేసి జారుకుంటున్నారు. ♦ పెడన పట్టణం 6వ వార్డులో నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం రసాభాసగా సాగింది. సమస్యలు ప్రస్తావించేందుకు సభకు వచ్చిన మున్సిపల్ చైర్మన్ బండారు ఆనంద్ ప్రసాద్‌పై టీడీపీ నాయకులు దౌర్జన్యం చేశారు. మున్సిపాలిటీలో నెలకొన్న పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించగా టీడీపీ జన్మభూమి కమిటీ నాయకులు, వైస్‌చైర్మన్ అబ్దుల్‌ఖయ్యూం, వహెబ్ఖాన్, హామీదుల్లా, యక్కల శ్యామలయ్య తదితరులు చైర్మన్‌పై తీవ్ర పదజాలంతో వాగ్వాదానికి దిగారు. ఒకానొక సందర్భంలో చైర్మన్‌ను నెట్టేశారు. ఆ సమయంలో ఆయన చేతికి ఉన్న వాచి సైతం విరిగిపోయింది. పోలీసులు రంగ ప్రవేశం చేసి సమస్యను సర్దుమణిగేలా చేశారు. ♦ కృత్తివెన్ను మండలం పల్లెపాలెం జన్మభూమి మాఊరు సభ రసాభాసగా మారింది. ఐదేళ్ల పాలనలో మా గ్రామానికి చేసిందేమీ లేదని, అలాంటప్పుడు మాకెందుకీ సభలు అంటూ పల్లెపాలెం వాసులు జన్మభూమి సభను అడ్డుకున్నారు. కనీసం ప్రతిజ్ఞ, సీఎం సందేశం కూడా చదవడానికి వీలులేదంటూ పట్టుపట్టారు. దీంతో పోలీసులు పహారాలో అధికారులు తూతూ మంత్రంగా సభను నిర్వహించారు. నాలుగున్నరేళ్ల పాలనలో మా పంచాయితీకి ఇచ్చింది కేవలం రెండు లక్షల రూపాయలే, దీనిపై ఎమ్మెల్యేని అడుగుతుంటే జెడ్పీటీసీని అడగమంటున్నారు. అసలు మాకు ఎమ్మెల్యే ఉన్నట్టా లేనట్టా అంటూ స్థానికులైన దావీదు, వరదరాజులతో పాటు కొందరు వేదికపై ఉన్న జెడ్పీటీసీ తులసీరావును నిలదీశారు. ♦ విజయవడ నగరంలోని 29వ డివిజన్ పరిధిలో శ్మశాన వాటిక ఏర్పాటు చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జన్మభూమి కార్యక్రమంలో వినూత్న నిరసన తెలిపారు. దీంతో పక్కనే ఉన్న పోలీసులు అరెస్టు చేశారు. ♦ విజయవాడ నగరంలో శ్మశానానికి స్థలం కేటాయించాలని దళితులు జన్మభూమి కార్యక్రమంలో ప్రశ్నించారు. సమస్య పరిష్కరించాల్సిన పాలకులు దళితుల గొంతు నొక్కే ప్రయత్నం చేశారు. ఒక్క సారిగా దళిత నాయకులను అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. ♦ కంకిపాడు మండలం కుండేరులో తమకు రేషన్ కార్డులు ఎప్పుడిస్తారని ప్రజలు తహసీల్దార్‌ను నిలదీశారు. ఐదేళ్లుగా అర్జీలు సమర్పిస్తున్నా.. వాటి పరిష్కారం మాత్రం లభించడం లేదని ఆవేదన చెందారు. ♦ నందివాడ మండలం పెద్ద లింగాల గ్రామంలో గ్రామానికి వచ్చే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. పలు మార్లు అధికారులకు అర్జీలు పెట్టుకున్నా లాభం లేకుండా పోయింది. దీంతో జన్మభూమి కార్యక్రమానికి వచ్చిన ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్యను ప్రజలు నిలదీశారు. దళితులు ఎక్కువ నివసిస్తున్న గ్రామంలో తాగునీటి సైతం తంటాలు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కల్పనపై మహిళాగ్రహం మంత్రిపాలెం(మొవ్వ): ‘జన్మభూమి–మా ఊరు’ గ్రామసభలలో భాగంగా మూడో రోజైన శుక్రవారం మంత్రిపాలెం గ్రామంలో ప్రభుత్వ తీరుపై ఆగ్రహించిన మహిళలు సభను స్తంభింపచేశారు. మొవ్వ మండలం మంత్రిపాలం పంచాయతీ పరిధిలోని సూరసాని మాలపల్లిలో అధ్వానంగా ఉన్న అంతర్గత రహదారులు నిర్మించని అధికారులపై, రోడ్డు అభివృద్ధికి కృషి చేయని ఎమ్మెల్యే కల్పన నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ దళితవాడ మహిళలు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో దళితవాడ అభివృద్ధి చేస్తానంటూ హామీ ఇచ్చిన కనీసం దాని వైపు కన్నెత్తి చూడని ఎమ్మెల్యే, మళ్లీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏ మొఖం పెట్టుకుని గ్రామానికి వచ్చావంటూ గ్రామస్తులు నిలదీశారు. కార్యక్రమంలో మండల ప్రత్యేకాధికారి డాక్టర్ ఎం శ్రీనివాసరావు, ఎంపీపీ కిలారపు మంగమ్మ, తహసీల్దార్ బి రామానాయక్, ఎంపీడీవో వి ఆనందరావు పాల్గొన్నారు. -
పుష్కర పనుల్లో అవినీతి
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విమర్శ కంకిపాడు/తోట్లవల్లూరు : పుష్కర పనుల్లో అవినీతి చోటుచేసుకుంటుదని, అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. పుష్కర నిధులు రూ.60 లక్షలతో చేపట్టిన కంకిపాడు–రొయ్యూరు జెడ్పీ రోడ్డును బుధవారం ఆమె పరిశీలించారు. పుష్కరాల ప్రారంభానికి 24 గంటల సమయం కూడా లేదని, పనులు ఎక్కడివక్కడే ఉన్నాయని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. పుణ్యస్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యాన్ని లెక్కచేయకుండా తూతూమంత్రంగా పనులు కానివ్వటం సరైందేనా? రోడ్డు అభివృద్ధి చేయమంటే కొండలు, గుట్టలుగా నిర్మించటం నిధులు దుర్వినియోగం చేయటం కాదా? అని పంచాయతీరాజ్ అధికారులను ప్రశ్నించారు. 50 శాతం కూడా పూర్తికాకపోవడం శోచనీయం రూ 60 లక్షలతో చేపట్టిన రోడ్డు పనులు 50 శాతం కూడా పూర్తికాకపోవటం శోచనీయమని కల్పన అన్నారు. రోడ్డు పరిశీలన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. హడావిడిగా చేస్తున్న పనుల్లో నాణ్యత లేకపోవటంతో పుష్కరాలు పూర్తికాగానే రోడ్డు కూడా ధ్వంసమవుతుందని అన్నారు. పుష్కరాల్లో భక్తుల ప్రయోజనాలను పక్కనపెట్టి నామినేషన్లతో పనులు కట్టబెట్టి కోట్లు దోచి పెడుతున్నారని ఆరోపించారు. పనుల్లో నా ణ్యత ఉండటం లేదని నిధులు దుర్విని యోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు. నిధుల కేటాయింపులో వివక్ష నిధులు కేటాయింపుల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. రొయ్యూరు ఇసుక క్వారీ నుంచి ప్రభుత్వ అవసరాలకు ఇసుకను తోడుకుంటున్నారని, రొయ్యూరు ప్రధానరహదారి అభివృద్ధికి కనీసం రూ.1.20 కోట్లు కూడా కేటాయించకపోవటం శోచనీయమన్నారు. నిధుల కేటాయింపుల్లో కలెక్టరు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. జేడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి మాట్లాడారు. తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, రొయ్యూరు సర్పంచ్ లుక్కా సుబ్బారావు, ఎంపీటీసీ సభ్యుడు మూడే శివశంకర్‌రావు, వైఎస్సార్ సీపీ జిల్లా సహాయ కార్యదర్శి మాదు వసంతరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యద ర్శి బొడ్డు సుగుణాకర్‌రావు, జిల్లా కార్యదర్శి చింతలపూడి గవాస్కర్‌రాజు, పార్టీ గ్రామ అధ్యక్షుడు మోర్ల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ డీఈ రఘురామ్ పాల్గొన్నారు. -
జన్మభూమిలో పోలీసుల ‘ఓవర్’యాక్షన్
ఆధార్ ఉంటేనే లోపలికి... పోలీసు పహారా మధ్య కార్యక్రమం వైఎస్సార్ సీపీ కార్యకర్తల అరెస్టు ఎమ్మెల్యే కల్పన జోక్యంతో విడుదల పామర్రు : ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించలతపెట్టిన జన్మభూమి-మావూరు కార్యక్రమం పలు వివాదాలకు నెలవవుతోంది. పింఛన్ల బాధితులు, రైతులు, డ్వాక్రా మహిళల నిరసనలు, దీర్ఘకాల సమస్యల పరిష్కారంలో విఫలమయ్యారంటూ స్థానికుల ఆందోళనలు వెరసి పోలీసుల లాఠీచార్జీలతో రసాభాసగా కొనసాగుతున్నాయి. శనివారం కొమరవోలు లో జన్మభూమి కార్యక్రమం ఉదయం బ్యానర్లు కట్టే విషయంలోనే గొడవతో ప్రారంభమైంది. పోలీసు సిబ్బంది ఉదయమే వచ్చి గ్రామంలో ఉన్నప్పటికీ... వైఎస్సార్సీపీ కార్యకర్తలు కట్టిన బ్యానర్లు కన్పించకుండా....వాటికి అడ్డుగా టీడీపీ నాయకులు బ్యానర్లు కట్టడంతో ఘర్షణ ప్రారంభమయ్యింది. ఇరు వర్గాలకు న్యాయం చేయాల్సిన పోలీసులు పక్షపాతంగా వ్యవహరించి వైఎస్సార్సీపీ కార్యకర్తలు కట్టిన బ్యానర్లు తొలగించారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్న కార్యకర్తలను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన జోక్యంతో విడిచి పెట్టారు. తదుపరి గ్రామం ముఖద్వారం వద్ద పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించి బయట వ్యక్తులు ప్రవేశించకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఈ విషయంలో గ్రామస్తులను సైతం ఆధార్‌కార్డు చూపనిదే గ్రామంలోకి పంపలేదు. దీంతో రైతులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఎమ్మెల్యే కల్పన తన కార్యకర్తలతో కలిసి కొమరవోలు ముఖద్వారం వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఎమ్మెల్యే కల్పన అనుచరుల కారును అడ్డగించి కారులోని వ్యక్తులను జన్మభూమి పంపకుండా నిలిపివేశారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. సభ ఇలా జరిగింది... తొలుత జన్మభూమి- మన ఊరు కార్యక్రమానికి సర్పంచి పొట్లూరి కృష్ణకుమారి హాజరు కాగా, టీడీపీ కార్యకర్తలు ఆమెను అడ్డగించడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. జన్మభూమికి ఎమ్మెల్యే కల్పన హాజరు కావడంతో ఆమెతో పాటు సర్పంచి కలసి వచ్చారు. ఎమ్మెల్యే కల్పన మాట్లాడుతూ ప్రొటోకాల్‌లో ఉన్న వ్యక్తులను మాత్రమే వేదికపై ఉంచి మిగిలిన వ్యక్తులను పంపించి వేయాలని ఎంపీడీవో రామనాథంను ఆదేశించారు. దీనికి ఎంపీడీవో బదులిస్తూ సర్పంచి లేకపోవడంతోనే ఉపసర్పంచి అధ్యక్షత వహించారన్నారు. ఇది జరుగుతుండగానే సభా ప్రాంగణం బయట రోడ్డుపై ఉన్న ఇరుపార్టీల కార్యకర్తలు వేదిక వైపు దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఇరుపార్టీల కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఒకానొక సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులపైకి దూసుకు రావడంతో పోలీసులు లాఠీఛార్జీ చేసి ఇరుపార్టీల వారిని చెల్లాచెదురు చేశారు. అనంతరం ఘర్షణ సద్దుమణిగాక ఎమ్మెల్యే ప్రసంగాన్ని ముగించి వెళ్లిపోయారు. భారీ బందోబస్తు.... ఓ డీఎస్పీ, ముగ్గురు సీఐలు, ఆరుగురు ఎస్ఐలు, మరో 50మంది కానిస్టేబుళ్ల బందోబస్తు మధ్య కార్యక్రమం కొనసాగింది. కాగా డీఏస్పీ అంకినీడు ప్రసాద్ వచ్చి రాగానే సిబ్బందిని మీ లాఠీలు ఏవని ప్రశ్నించారు. తీసుకు రాలేదని చెప్పడంతో లాఠీలులేకుండా విధులకు ఎలా హాజరయ్యారని సున్నితంగా మందలించారు. దీంతో పోలీసులు పామర్రు స్టేషన్‌కు వెళ్లి జీపులో లాఠీలు తెచ్చారు.