పుష్కర పనుల్లో అవినీతి
పుష్కర పనుల్లో అవినీతి
Published Wed, Aug 10 2016 11:07 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 AM
ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన విమర్శ
కంకిపాడు/తోట్లవల్లూరు :
పుష్కర పనుల్లో అవినీతి చోటుచేసుకుంటుదని, అభివృద్ధి పనులకు కేటాయించిన నిధులను దుర్వినియోగం చేస్తున్నారని వైఎస్సార్ సీపీ శాసనసభా పక్ష ఉపనేత, పామర్రు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆరోపించారు. పుష్కర నిధులు రూ.60 లక్షలతో చేపట్టిన కంకిపాడు–రొయ్యూరు జెడ్పీ రోడ్డును బుధవారం ఆమె పరిశీలించారు. పుష్కరాల ప్రారంభానికి 24 గంటల సమయం కూడా లేదని, పనులు ఎక్కడివక్కడే ఉన్నాయని ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. పుణ్యస్నానాలకు వచ్చే భక్తుల సౌకర్యాన్ని లెక్కచేయకుండా తూతూమంత్రంగా పనులు కానివ్వటం సరైందేనా? రోడ్డు అభివృద్ధి చేయమంటే కొండలు, గుట్టలుగా నిర్మించటం నిధులు దుర్వినియోగం చేయటం కాదా? అని పంచాయతీరాజ్ అధికారులను ప్రశ్నించారు.
50 శాతం కూడా పూర్తికాకపోవడం శోచనీయం
రూ 60 లక్షలతో చేపట్టిన రోడ్డు పనులు 50 శాతం కూడా పూర్తికాకపోవటం శోచనీయమని కల్పన అన్నారు. రోడ్డు పరిశీలన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. హడావిడిగా చేస్తున్న పనుల్లో నాణ్యత లేకపోవటంతో పుష్కరాలు పూర్తికాగానే రోడ్డు కూడా ధ్వంసమవుతుందని అన్నారు. పుష్కరాల్లో భక్తుల ప్రయోజనాలను పక్కనపెట్టి నామినేషన్లతో పనులు కట్టబెట్టి కోట్లు దోచి పెడుతున్నారని ఆరోపించారు. పనుల్లో నా ణ్యత ఉండటం లేదని నిధులు దుర్విని యోగానికి పాల్పడుతున్నారని విమర్శించారు.
నిధుల కేటాయింపులో వివక్ష
నిధులు కేటాయింపుల్లో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల పట్ల వివక్ష చూపుతున్నారని విమర్శించారు. రొయ్యూరు ఇసుక క్వారీ నుంచి ప్రభుత్వ అవసరాలకు ఇసుకను తోడుకుంటున్నారని, రొయ్యూరు ప్రధానరహదారి అభివృద్ధికి కనీసం రూ.1.20 కోట్లు కూడా కేటాయించకపోవటం శోచనీయమన్నారు. నిధుల కేటాయింపుల్లో కలెక్టరు వివక్ష చూపుతున్నారని విమర్శించారు. జేడ్పీ ఫ్లోర్ లీడర్ తాతినేని పద్మావతి మాట్లాడారు. తోట్లవల్లూరు ఎంపీపీ కళ్లం వెంకటేశ్వరరెడ్డి, రొయ్యూరు సర్పంచ్ లుక్కా సుబ్బారావు, ఎంపీటీసీ సభ్యుడు మూడే శివశంకర్‌రావు, వైఎస్సార్ సీపీ జిల్లా సహాయ కార్యదర్శి మాదు వసంతరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యద ర్శి బొడ్డు సుగుణాకర్‌రావు, జిల్లా కార్యదర్శి చింతలపూడి గవాస్కర్‌రాజు, పార్టీ గ్రామ అధ్యక్షుడు మోర్ల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ డీఈ రఘురామ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement