చంద్రబాబుకు షాక్.. నిలదీసిన మహిళలు!
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడికి నవనిర్మాణ దీక్షలో చేదు అనుభవం ఎదురైంది. విజయవాడలో శనివారం జరిగిన నవనిర్మాణ దీక్షలో టీడీపీ పాలనలో నెలకొన్న అవినీతిపై నేరుగా సీఎం చంద్రబాబునే మహిళలు ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తల అవినీతి వల్ల తమకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.
జన్మభూమి కమిటీ సభ్యులు సంతకాలు పెట్టడానికి డబ్బులు అడిగారని శిరీష అనే దళిత మహిళ సీఎం ముందు తన గోడు వెళ్లబోసుకుంది. తాను డబ్బులు ఇవ్వలేకపోవడంతో ఉద్యోగం ఇవ్వలేదని, ఇలాగైతే పేదలకు ఎలా న్యాయం జరుగుతుందని ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ఇళ్లు, పెన్షన్ల మంజూరులో అవినీతి జరుగుతున్నదని మచిలీపట్నానికి చెందిన వెంకటేశ్వరమ్మ అనే మహిళ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. అవినీతి కారణంగా తన భర్తకు 60 ఏళ్లు నిండినా పెన్షన్ రావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.