తాళ్వాయిపాడు సభలో మాట్లాడుతున్నచంద్రబాబునాయుడు
నెల్లూరు(పొగతోట)/సూళ్లూరుపేట: గడిచిన నాలుగేళ్లలో జిల్లాను ఎంతో అభివృద్ధి చేశాం.. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి మొదలుకుని చెక్‌డ్యాంల నిర్మాణం వరకు చాలా చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. నెల్లూరుకు ఇంకా ఏం చేయాలని ప్రజలను ప్రశ్నించారు. రానున్న రోజుల్లో జిల్లాలో అభివృద్ధి పనులు చేపడతామని హామీలిస్తూ తనదైన శైలిలో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. సుమారు గంటన్నరపాటు సీఎం ప్రసంగం కొనసాగింది. ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. శుక్రవారం నవ నిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సీఎం పర్యటించారు. తొలుత పెళ్లకూరు మండలంలోని తాళ్వాయిపాడులో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు. మధ్యాహ్నం అక్కడి నుంచి నాయుడుపేట చేరుకుని మహాసంకల్ప ముగింపు సభలో గంటకు పైగా ప్రసంగించారు.
రెండు గంటలు అలస్యంగా ..
షెడ్యూల్ ప్రకారం సీఎం పర్యటన ఉదయం 10 గంటలకు తాళ్వాయిపాడులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకోవాల్సి ఉంది. ఉదయం 12 గంటల సమయంలో సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గ్రామానికి చేరుకుని అక్కడ గ్రామదర్శినిలో ప్రజలతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం నాయుడుపేట చేరుకున్నా రు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు. జిల్లాలో ఏడు వేల కోట్ల విలువ చేసే సీజేఎఫ్‌ఎస్ భూములను ఎస్సీ, ఎస్టీలకు స్వాధీనం చేసేలా చర్యలు చేపడతున్నామన్నారు. లక్ష ఎకరాల చుక్కల భూములకు యాజమాన్యపు హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. భవిష్యత్‌లో నిరుద్యోగ సమస్య రాకుండా పరిశ్రమలు స్థాపనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సోమశిల హైలెవల్ కెనా ల్ రూ.800కోట్లతో ప్రారంభించామన్నారు. రెండో దశ పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రూ.43కోట్లతో పులికాట్ ముఖద్వారం పనులు చేపట్టి పూర్తి చేస్తామన్నారు.
జిల్లాలో చిన్నచిన్న ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి 1.25లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకొచ్చామన్నారు. రాబోవు ఏడాదిలో 20వేల పంటగుంటలు, నాలుగు లక్షల చెక్‌డ్యామ్‌లు నిర్మించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వర్షపాతం తక్కువైనా నీటి నిర్వహణ సమర్థవంతంగా చేస్తూ దిగుబడులు సాధిస్తున్నామన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసమే రాష్ట్రాన్ని విభజించినట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ 2014కి ముందు దెయ్యాలకు పెన్షన్లు ఇచ్చేవారని, రేషన్‌షాపుల్లో బియ్యం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా ఇవ్వలేకపోయినా అర్హులైన వారికి పింఛన్లు, నిత్యావసర సరుకులు సకాలంలో అందిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ నిధులు కేటాయించడం లేదన్నారు. బీజేపీకి పతనం ప్రారంభమైందన్నారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 2014లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఎకరం సాగు భూమి ఇచ్చిన ఘనత చంద్రబాబునాయుడికే దక్కిందన్నారు. అనంతరం సీఎంను టీడీపీ నాయకులు సన్మానించారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఆర్డీఓలు హరిత, శీనానాయక్, భక్తవత్సలరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ లావణ్యవేణి ఎమ్మెల్యేలు పాశం సునీల్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ ఎంపీ నెలవల, మాజీ ఎమ్మెల్యేలు పరసా, బల్లి దుర్గాప్రసాద్, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి, కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment