Nava Nirmana Deeksha
-
నవ నిర్మాణ దీక్షలకు మరో రూ.6.55 కోట్లు
సాక్షి, అమరావతి : గత నెల 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలకు మరో రూ.6.55 కోట్లు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రణాళిక శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ దీక్షల కోసం గతంలోనే జిల్లాకు రూ.కోటి చొప్పున మొత్తం రూ.13 కోట్ల రూపాయలను, విజయవాడలో సీఎం చంద్రబాబు నిర్వహించిన సభకు రూ.10 లక్షలను ప్రభుత్వం విడుదల చేసింది. అయితే ఈ నిధులు సరిపోలేదని, మరిన్ని నిధులు వ్యయం అయినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ నేపథ్యంలో జిల్లాకు మరో రూ.50 లక్షల చొప్పున రూ.6.50 కోట్లను, విజయవాడలో సీఎం సభకు మరో రూ.5 లక్షలను ప్రణాళికా శాఖ మంజూరు చేసింది. -
దుబారాకు లోటులేదు..!
సాక్షి, అమరావతి: సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు.. అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు.. వీలుంటే కొన్నింటిని వాయిదా వేసుకుంటారు. కానీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం అందుకు విరుద్ధం. రాష్ట్రం భారీ రెవెన్యూ లోటులో ఉన్నా సరే దుబారాతో ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ఏటేటా రెగ్యులర్ విమానాలను కాదని ప్రత్యేక విమానాల్లో పర్యటనలు, అర్భాటాలు, ప్రచార ఈవెంట్లు, ధర్మపోరాటాలకు భారీగా వ్యయం చేస్తున్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఆర్భాటపు దుబారాకు అయిన మొత్తం రూ.2,620.76 కోట్లకు పెరిగిపోయిందంటే అనవసర ఖర్చులు ఏ రేంజ్లో ఉన్నాయో అర్ధమవుతుంది. వీటివల్ల నాలుగేళ్లలో రాష్ట్రానికి ఎలాంటి శాశ్వత వసతి కానీ, ఆస్తిగానీ సమకూరలేదు. పైగా.. ఏమీ చేయకుండా చేస్తున్నట్లు విస్తృత ప్రచారం చేసుకుంటూ.. రాష్ట్ర ఖజానాను విచ్చలవిడిగా వాడేసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్ అంటూ.. పరిష్కార వేదిక 1100 నెంబర్ అంటూ వందల కోట్ల రూపాయలను ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రం ఏటా రెవెన్యూ లోటులోనే కొనసాగుతున్నప్పటికీ అనవసరపు ఖర్చులను అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రే అందుకు విరుద్ధంగా ఈ వెంట్ల పేరుతో భారీగా నిధులు ఖర్చుపెడుతుండడంపై అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తంచేస్తోంది. ఓ పక్క రాజధాని కోసం ప్రజలను విరాళాలు ఇవ్వండంటూ పిలుపునిస్తూ.. మరోపక్క ప్రజాధనాన్ని సొంత ప్రచారం కోసం దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సర్కార్ సొమ్ముతో ధర్మపోరాటమా!? మొన్నటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా పల్లవి అందుకుని ధర్మపోరాటం అంటూ సర్కార్ సొమ్ముతో సభలు నిర్వహించడాన్ని ఉన్నతస్థాయి అధికారి ఒకరు తప్పుపట్టడం గమనార్హం. సీఎంగా ఉంటూ ధర్మపోరాటాలు ఎవ్వరైనా చేస్తారా అంటూ ఆ అధికారి వ్యాఖ్యానించడం విశేషం. రాజధానిలో శంకుస్థాపనల పేరుతో వందల కోట్ల రూపాయలు వ్యయం చేసినా ఇప్పటివరకూ ఒక్క శాశ్వత భవనాన్నీ సమకూర్చలేదు. పైగా తాత్కాలిక సచివాలయ వ్యయాన్ని రూ.300 కోట్ల నుంచి మరమ్మతులు, ఇతర సౌకర్యాల పేరుతో ఏకంగా రూ.1,100 కోట్లకు పెంచేశారు. భాగస్వామ్య సదస్సులకు రూ.150కోట్లు అలాగే, పెట్టుబడుల కోసం భాగస్వామ్య సదస్సులను నిర్వహించడాన్ని ఎవ్వరూ తప్పుపట్టక పోయినప్పటికీ వాటి నిర్వహణకు చేస్తున్న వ్యయంపై మాత్రం అధికారులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు భాగస్వామ్య సదస్సులు నిర్వహించగా.. ఒక్కో సదస్సుకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.150 కోట్లు వ్యయం చేయడాన్ని అధికారులే తప్పుపడుతున్నారు. అంత వ్యయం చేసినప్పటికీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ భారీ పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదని వారు పేర్కొంటున్నారు. మరోపక్క.. ఇప్పటివరకూ ఐదుసార్లు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించడమే జన్మభూమి లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అవి సీఎం ప్రచార సభలుగా మారిపోయాయని అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు జరిగిన ఐదు జన్మభూమి కార్యక్రమాలకు మొత్తం రూ.125 కోట్లు వ్యయం చేశారని, ఇదంతా దుబారా కిందకే వస్తుందని పేర్కొంటున్నాయి. నయాపైసా ఉపయోగంలేని నవనిర్మాణ దీక్షలు రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకుండా నవ నిర్మాణ దీక్షల పేరుతో ఏటా 20 కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నారని, ఇప్పటివరకు నాలుగుసార్లు నవ నిర్మాణ దీక్షల పేరుతో సీఎం ప్రచార సభలు నిర్వహించారు తప్ప వాటివల్ల ఎటువంటి ప్రయోజనంలేదని అధికారులే అంటున్నారు. అలాగే, కొత్తగా ఈ ఏడాది హ్యాపీ సిటీస్ సదస్సును తెరమీదకు తీసుకువచ్చిన సీఎం.. ఇందుకు రూ.61 కోట్లు వ్యయం చేశారు. పోలవరం ప్రాజెక్టు డ్యాం పునాదులు కూడా పూర్తికాకముందే బస్సుల్లో జనాన్ని ఆ ప్రాజెక్టు దగ్గరకు తీసుకువెళ్లి చూపించడానికి ఏకంగా 22.50 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. రాజధాని శంకుస్థాపనకు రూ.250 కోట్లను వ్యయం చేసిన సర్కారు ఆ తరువాత పరిపాలన నగరం, సీడ్ కేపిటల్.. రహదారుల శంకుస్థాపనల పేరుతో ఈవెంట్లను నిర్వహించి రూ.100 కోట్లు వ్యయం చేసింది. అయినా ఇప్పటివరకూ రాజధాని ఒక్క శాశ్వత నిర్మాణానికీ నోచుకోలేదు. ప్రత్యేక విమానం, హెలికాప్టర్ ఖర్చు రూ.100కోట్లు ఈ ఏడాది విదేశీ పర్యటనలు, రోడ్‌షోలకు రూ.62 కోట్లు కేటాయింపు నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన విదేశీ పర్యటనలవల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకపోయినా ఖజానాకు మాత్రం బాగా చమురు వదిలింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో, హెలికాప్టర్లలో ప్రయాణం చేస్తున్నారు. దేశంలోనూ ఎక్కడికి వెళ్లాలన్నా రెగ్యులర్ ఫ్లైట్లున్నప్పటికీ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో వెళ్లారు. చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు గత నాలుగేళ్లలో రూ.100 కోట్లు వెచ్చించారు. గన్నవరం విమానాశ్రయంలో బాబు ప్రత్యేక విమానం, హెలికాప్టర్ పార్కింగ్ చేసి ఉంటాయి. పార్కింగ్ చేసి ఉంచినందుకు కూడా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు చెల్లించాల్సి వస్తోందని.. అలాగే పైలెట్లకు స్టార్ హోటల్స్‌లో బస ఏర్పాటుచేయాల్సి వస్తోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెగ్యులర్ ఫ్లైట్లున్నా ప్రత్యేక చార్టెడ్ విమానాల్లో తిరగడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన అజేయ కల్లాం తాను రాసిన మేలుకొలుపు పుస్తకంలో తప్పుపట్టారంటే సీఎం ఎలా దుబారా చేశారో తేటతెల్లం అవుతోంది. అలాగే, ఈ ఏడాది విదేశీ యాత్రల కోసం ప్రత్యేకంగా ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటుచేశారు. విదేశీ పర్యటనలు, రోడ్ షోల నిర్వహణకు ఏకంగా బడ్జెట్లో రూ.62కోట్లను కేటాయించారు. -
ఇంకేం చేయాలి
నెల్లూరు(పొగతోట)/సూళ్లూరుపేట: గడిచిన నాలుగేళ్లలో జిల్లాను ఎంతో అభివృద్ధి చేశాం.. కృష్ణపట్నం పోర్టు అభివృద్ధి మొదలుకుని చెక్‌డ్యాంల నిర్మాణం వరకు చాలా చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. నెల్లూరుకు ఇంకా ఏం చేయాలని ప్రజలను ప్రశ్నించారు. రానున్న రోజుల్లో జిల్లాలో అభివృద్ధి పనులు చేపడతామని హామీలిస్తూ తనదైన శైలిలో ఊకదంపుడు ఉపన్యాసం ఇచ్చారు. సుమారు గంటన్నరపాటు సీఎం ప్రసంగం కొనసాగింది. ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపించింది. శుక్రవారం నవ నిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట నియోజకవర్గంలో సీఎం పర్యటించారు. తొలుత పెళ్లకూరు మండలంలోని తాళ్వాయిపాడులో గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొన్నారు. అక్కడ లబ్ధిదారులతో సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు. మధ్యాహ్నం అక్కడి నుంచి నాయుడుపేట చేరుకుని మహాసంకల్ప ముగింపు సభలో గంటకు పైగా ప్రసంగించారు. రెండు గంటలు అలస్యంగా .. షెడ్యూల్ ప్రకారం సీఎం పర్యటన ఉదయం 10 గంటలకు తాళ్వాయిపాడులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకోవాల్సి ఉంది. ఉదయం 12 గంటల సమయంలో సీఎం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా గ్రామానికి చేరుకుని అక్కడ గ్రామదర్శినిలో ప్రజలతో మాట్లాడారు. అనంతరం మధ్యాహ్నం మూడు గంటలకు సీఎం నాయుడుపేట చేరుకున్నా రు. అక్కడ బహిరంగ సభలో మాట్లాడారు. జిల్లాలో ఏడు వేల కోట్ల విలువ చేసే సీజేఎఫ్ఎస్ భూములను ఎస్సీ, ఎస్టీలకు స్వాధీనం చేసేలా చర్యలు చేపడతున్నామన్నారు. లక్ష ఎకరాల చుక్కల భూములకు యాజమాన్యపు హక్కులు కల్పించేలా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. భవిష్యత్‌లో నిరుద్యోగ సమస్య రాకుండా పరిశ్రమలు స్థాపనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. సోమశిల హైలెవల్ కెనా ల్ రూ.800కోట్లతో ప్రారంభించామన్నారు. రెండో దశ పనులకు నిధులు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రూ.43కోట్లతో పులికాట్ ముఖద్వారం పనులు చేపట్టి పూర్తి చేస్తామన్నారు. జిల్లాలో చిన్నచిన్న ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి 1.25లక్షల ఎకరాలను అదనంగా సాగులోకి తీసుకొచ్చామన్నారు. రాబోవు ఏడాదిలో 20వేల పంటగుంటలు, నాలుగు లక్షల చెక్‌డ్యామ్‌లు నిర్మించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. వర్షపాతం తక్కువైనా నీటి నిర్వహణ సమర్థవంతంగా చేస్తూ దిగుబడులు సాధిస్తున్నామన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ రాజకీయ లబ్ధికోసమే రాష్ట్రాన్ని విభజించినట్లు పేర్కొన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్నారు. ప్రధానమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలకు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు. జిల్లా ఇన్చార్జి మంత్రి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ 2014కి ముందు దెయ్యాలకు పెన్షన్లు ఇచ్చేవారని, రేషన్‌షాపుల్లో బియ్యం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేదన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు వేతనాలు సక్రమంగా ఇవ్వలేకపోయినా అర్హులైన వారికి పింఛన్లు, నిత్యావసర సరుకులు సకాలంలో అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ బీజేపీ కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతూ నిధులు కేటాయించడం లేదన్నారు. బీజేపీకి పతనం ప్రారంభమైందన్నారు. పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ 2014లో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామన్నారు. ప్రతి కుటుంబానికి ఒక ఎకరం సాగు భూమి ఇచ్చిన ఘనత చంద్రబాబునాయుడికే దక్కిందన్నారు. అనంతరం సీఎంను టీడీపీ నాయకులు సన్మానించారు. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, జాయింట్ కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఆర్డీఓలు హరిత, శీనానాయక్, భక్తవత్సలరెడ్డి, డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి ఎమ్మెల్యేలు పాశం సునీల్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మాజీ ఎంపీ నెలవల, మాజీ ఎమ్మెల్యేలు పరసా, బల్లి దుర్గాప్రసాద్, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ వేనాటి రామచంద్రారెడ్డి, కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు. -
తెలుగు తమ్ముళ్ల బాహాబాహీ
ఆత్మకూరు: ఆత్మకూరు నియోజకవర్గంలో టీడీపీలో ఆనం రామనారాయణరెడ్డి, కన్నబాబు వర్గీయుల మధ్య రాజకీయ వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి ఆనం వర్గీయులపై కన్నబాబు వర్గీయులు దాడి చేశారు. మున్సిపల్ పరిధిలోని 13వ వార్డు కౌన్సిలర్ బొగ్గవరపు శ్రీకాంత్ నారాయణ గతంలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచి కన్నబాబు వర్గంగా కొనసాగుతున్నాడు. మారిన పరిణామాల క్రమంలో ఆనం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జిగా నియమితులు కావడంతో శ్రీకాంత్ ఆనం వర్గంలోకి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి కన్నబాబుకు అత్యంత సన్నిహితులైన కొందరు శ్రీకాంత్‌తో పాటు ఆనం వర్గానికి చెందిన కొందరిని స్థానిక సినిమా హాల్ వద్దకు రమ్మని ఫోన్ చేసి పిలిపించారు. అక్కడ ఇరువర్గాలు పాత విషయాలను దృష్టిలో ఉంచుకుని వాదులాడుకున్నారు. మాటామాటా పెరిగి ఇరువర్గాలకు బాహాబాహీకి దిగారు. స్థానికులు జోక్యం చేసుకుని సర్దుబాటు చేసి సినిమా హాల్ నుంచి వెలుపలికి పంపించారు. దీంతో కౌన్సిలర్ శ్రీకాంత్ నారాయణ పోలీస్‌స్టేషన్‌లో తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు సీఎం బందోబస్తుకు వెళ్లి ఉండటంతో ఏఎస్సై ఫిర్యాదును స్వీకరించారు. -
రూ.కోటి వ్యయం.. ఒరిగింది శూన్యం
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన నవ నిర్మాణ దీక్షల వల్ల శాఖాపరమైన కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. దీక్షల కోసం ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన కోటి రూపాయలు ప్రజాధనం కూడావృథా అయింది. అయితే శని, ఆదివారాలు రెండు రోజులు సెలవులు రావడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ప్రతి ఏటా జూన్ 2వ తేదీ నుండి నవ నిర్మాణ దీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా నాలుగో విడత నవ నిర్మాణ దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ఒక్కరోజు దీక్ష నిర్వహించి ఉంటే బాగుండేదని, ఇలాంటి వాటిని కూడా వారం రోజులపాటు నిర్బంధంగా నిర్వహించి చంద్రబాబు తన మార్కు ప్రచారాన్ని నిర్వహించుకునేందుకు వేదికగా మలచుకున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. జిల్లా కేంద్రం, డివిజనల్ కేంద్రం, మునిసిపల్ కేంద్రం, మండల కేంద్రం, గ్రామ పంచాయతీ అనే తేడా లేకుండా ఎక్కడ బడితే అక్కడ నవ నిర్మాణ దీక్షలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ప్రతిజ్ఞ టు మహాసంకల్పం రాష్ట ప్రభుత్వం వారంరోజులపాటు నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలను ప్రతిజ్ఞతో ప్రారంభించి మహాసంకల్పంతో ముగించింది. తొలిరోజు 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, విభజన హామీలు అమలుపై చర్చించి ప్రభుత్వ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. రెండవరోజు నీటిభద్రత, కరువు రహిత రాష్ట్రం, మూడవరోజు రైతు సంక్షేమం, ఆహార భద్రత, నాల్గవ రోజు సంక్షేమం–సాధికారత, ఐదవరోజు జ్ఞాన భూమి –ఉపాధి కల్పన, ఆరవరోజు మౌలిక సదుపాయాలు– మెరుగైన జీవనం, ఏడవరోజు సుపరిపాలన–అవినీతిరహిత సమాజం గురించి చర్చించారు. చివర్లో మహా సంకల్పం చేపట్టారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఏ–1 ఫంక్షన్ హాలులో మహాసంకల్పం చేపట్టారు. వారం రోజులపాటు షెడ్యూల్ ప్రకటించినప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో సక్రమంగా అమలు చేయకుండా యంత్రాంగం మమ అనిపించేసింది. అందుకు కారణం నవ నిర్మాణ దీక్షలో ప్రజల భాగస్వామ్యం లేకపోవడమే. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామ పంచాయతీ వరకు అన్నిచోట్ల నవ నిర్మాణ దీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రజల భాగస్వామ్యం కొరవడింది. పైగా ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజలను నిర్బంధంగా ఉంచేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యంత్రాంగం ప్రయత్నించినప్పటికీ ప్రజల హాజరు పలచగానే ఉంది. జిల్లాకు చెందిన మంత్రి, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నచోట్ల ప్రజలను పథకాల పేరుతో మభ్యపెట్టి దీక్షలకు తరలించడం జరిగింది. కొత్తగా పింఛన్లు, ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించడంతో ప్రజలు ఆ మాత్రమైనా వచ్చారు. లేకుంటే ఎర్రటి ఎండల్లో పనేమి లేదన్నట్లుగా వెళతామా అని కొంతమంది ప్రజలు అధికారుల ఎదుట బహిరంగంగానే వ్యాఖ్యానించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. అధికారపార్టీ నేతల హడావుడి నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో అధికార పార్టీ నేతల హడావుడి ఎక్కువగా కనిపించింది. ఇది ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యక్రమంలా భావించి హల్చల్ చేశారు. ముఖ్యమంత్రి తనయుడు, పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్, మహిళా శిశు సంక్షేమశాఖామంత్రి పరిటాల సునీత, జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారాయణ జిల్లాపై కన్నెత్తి కూడా చూడలేదు. అధికార పార్టీ శాసనసభ్యులు పాల్గొన్న నవ నిర్మాణ దీక్షల్లో తెలుగు తమ్ముళ్ల సందడి మరీ ఎక్కువగా కనిపించింది. కొన్నిచోట్ల తెలుగు తమ్ముళ్లు కూర్చొని, అధికారులు నిల్చొన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిని బట్టి నవ నిర్మాణ దీక్షను అధికారపార్టీ ఏవిధంగా ఉపయోగించుకుందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం కంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించేందుకే ఎక్కువగా దీక్షను వినియోగించుకున్నారు. దీంతో ప్రజలు ఇది ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అని వ్యాఖ్యానించడం గమనార్హం. -
వికటిస్తున్న బాబు వ్యూహాలు!
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తి చేసు కొన్నా.. ప్రజలకిచ్చిన ప్రధాన హామీలేవీ ఇప్పటివరకు అమలు చేయలేకపోయారు. కానీ, ఒకట్రెండు హామీలు నహా మొత్తం నెరవేర్చేశామని బొంకుతున్నారు. అధికారం చేపట్టిన జూన్ 8, 2014న సీఎంగా ఐదు దస్త్రాలపై తొలి సంతకం చేశారు. వాటినే ఇప్పటికీ పూర్తిగా అమలు చేయలేదు. పదవి చేపట్టిన తొలి మాసంలోనే ఆర్థిక రంగంతోసహా పలు రంగాలపై శ్వేత పత్రాలు ప్రచురించి కాంగ్రెస్ పదేళ్ల పాలనలో అభివృద్ధి తిరోగమనంలో పయనించిందని చెప్పుకొచ్చారు. కానీ, ఈ నాలుగేళ్లల్లో తన పరిపాలనలో ఆయా రంగాల్లో ఎంత అభివృద్ధి జరిగిందో శ్వేతపత్రాలు ప్రచురించమని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటే.. బాబు విననట్లు నటిస్తూ..‘నవ నిర్మాణదీక్ష’ అంటూ ప్రజలతో ప్రమాణాలు చేయించే కార్యక్రమాల్ని ప్రజాధనంతో నిర్వహిస్తున్నారు. చంద్రబాబు ప్రదర్శిస్తున్న రాజకీయ టక్కుటమార విద్యల్లో ‘నవ నిర్మాణదీక్ష’ ఒకటి. గత నాలుగేళ్లుగా ఈ తంతు నిర్వహిస్తున్నారు. మొదటి మూడేళ్లు నవ నిర్మాణదీక్షల వేదికల నుంచి కాంగ్రెస్ పార్టీని, వైసీపీని తిట్టిపోశారు. ఈ ఏడాది కొత్తగా బీజేపీని, జనసేనను కలిపారు. ప్రభుత్వ కార్యక్రమాల్ని పార్టీ కార్యక్రమాలుగా మార్చివేసి.. ‘ప్రత్యేకహోదా’ ఇవ్వనందుకు బీజేపీని, మోదీని; రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్న సాకుతో కాంగ్రెస్ పార్టీని; అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి వైసీపీని; స్నేహహస్తాన్ని వీడి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలలో ఎండగడుతున్న జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను పదేపదే విమర్శిస్తున్నారు. ప్రత్యేకహోదా అంశంలో మాట తప్పారని ప్రధాని మోదీని ఏపీ ప్రజల్లో విలన్‌గా చిత్రీకరించడానికి బాబు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. మోదీతో జగన్, పవన్‌కల్యాణ్‌లు జత కలిశారని ప్రచారంచేసి.. 2019 ఎన్నికల్లో గట్టెక్కాలన్నది బాబు వ్యూహం! బాబు చేస్తున్న నవ నిర్మాణ దీక్షల పోస్టర్లలో 2050 నాటికి పెట్టుకొన్న లక్ష్యాలు కనిపిస్తున్నాయి. అంటే, 2050 వరకు తన ప్రభుత్వమే ఉంటుందని పరోక్షంగా ప్రజలకు చెబుతున్నట్టే లెక్క. ఏ ప్రజాస్వామ్య వ్యవస్థలోనూ 30 ఏళ్ల తర్వాత సాధించబోయే లక్ష్యాలు ఏర్పరుచుకొన్న దాఖలాలు కన్పిం చవు. గత నాలుగేళ్లలో టీడీపీ అన్ని రంగాల్లో ఘనంగా విఫలమైంది కనుకనే.. ప్రజల దృష్టిని మరల్చడానికి తనకు తెలిసిన విద్యలను ప్రదర్శిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి నిర్దిష్టమైన ఎజెండా లేదు. ఈ నాలుగేళ్లల్లో సాధించామని చెప్పుకోవడానికి ఏ ఒక్క ఘనత లేదు. నాలుగేళ్ల బాబు పాలనలో వ్యవసాయరంగం కుదేలయింది. ఎన్నికల ముందు బేషరతుగా రైతు రుణమాఫీ చేస్తామన్నారు. మొత్తం రుణభారం రూ. 95,455 కోట్లుగా ఎస్ఎస్బీసీ తేల్చితే.. కాకి లెక్కలు వేసి రైతులకు రూ. 24,000 కోట్లు చెల్లిస్తామని చెప్పి ఇప్పటివరకు కేవలం రూ. 14,000 కోట్లమేర మాత్రమే చెల్లించారు. ఆ మొత్తం రైతులు వడ్డీలు కట్టడానికే సరిపోయింది. ఇక, రాష్ట్రంలో కరువును పారద్రోలామని ఘనంగా చెప్పుకొంటూ.. అనంతపురం జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించిన ఘనత ఈ ప్రభుత్వానిది. క్రిందటేడాది.. రాయలసీమ నుంచి పొరుగునున్న తమిళనాడుకు 4 లక్షల మంది సన్నకారు రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం వలసబాట పట్టారని పతాక శీర్షికల్లో వార్తలొచ్చాయి. సాగునీటి రంగానికి సంబంధించి అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టుల అంచనాల్ని అనూహ్యంగా పెంచేశారు. పెంచిన అంచనాలను చీఫ్ సెక్రటరీ ఆమోదించడానికి నిరాకరిస్తే.. క్యాబినెట్లో ఫైల్‌పెట్టి ఆమోదముద్ర వేసుకొన్నారు. పట్టిసీమను సకాలంలో పూర్తిచేస్తే 21.9% బోనస్ ఇస్తామనే నిబంధన ఏర్పరిచి.. ఆ ప్రాజెక్టు సకాలంలో పూర్తయిందని చెప్పుకోవడానికి.. పాత పైపులు తెచ్చి బిగించి సంబ రాలు జరుపుకొన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంను కేంద్ర ప్రభుత్వమే నిర్మించాల్సి ఉండగా, కాంట్రాక్టింగ్ పనుల కోసం దాని నిర్మాణం తలకెత్తుకొని.. దానిని పూర్తి చేయలేక నెపాన్ని కేంద్రంపై నెట్టేస్తున్నారు. పోలవరం అవినీతికి కేంద్రంగా మారిపోయింది. దాని లెక్కలు, ఖర్చులు చెప్పే పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం లేకపోవడంతో, కేంద్రం నిధులు విడుదల చేయని పరిస్థితి. డ్వాక్రా మహిళలకు రూ. 14,000 కోట్ల రుణాలను మాఫీ చేస్తామని చెప్పి.. కేవలం రూ. 3,000 చొప్పుల పెట్టుబడి రూపంలో ఇచ్చారు. ఫలితంగా 84 లక్షల మంది మహిళలు రుణగ్రస్తులుగా బ్యాంకు రికార్డుల్లో మిగిలారు. మహిళల సాధికారత మద్యం అమ్మకాల పెంపు ద్వారా సాధ్యపడుతుందా? ఈ నాలుగేళ్లల్లో ఏడాపెడా అప్పులు చేయడంలోనే ఈ ప్రభుత్వం విజయం సాధించింది. ఎఫ్ఆర్బిఎం చట్టం నిబంధనలను పక్కనపెట్టి ఇష్టానుసారం అప్పులు చేశారు. ఈ నాలుగేళ్లల్లో రూ.1,40, 000 కోట్ల మేర కొత్తగా రుణాలు తీసుకొచ్చారు. ఆర్థిక క్రమశిక్షణ కాగడాపెట్టి వెతికినా కనపడదు. గతంలో చేసిన దుబారాకు అదనంగా ఇటీవల ధర్మదీక్ష కార్యక్రమాలకు ఒక్కోదానికి రూ. 30 కోట్లు చొప్పున, నవ నిర్మాణదీక్షకు రూ.13 కోట్లు చొప్పున ఖర్చు పెడుతున్నారు. వీటివల్ల ప్రజలకు ఒరిగేదేమిటి? ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగభృతి రూపంలో నెలకు రూ. 2,000 ఇస్తామన్న హామీని.. ఆగస్టు నెల నుంచి డిగ్రీ చదివిన నిరుద్యోగులకు పరిమితం చేసి ఇస్తామంటున్నారు. ఎన్నికల ఏడాదిలో కేవలం 6 లేక 7 నెలలు అదికూడా 21 ఏళ్లు దాటి ఓటు కలిగిన వారికి ఇవ్వాలన్న నిర్ణయం, ఓట్లు కొల్లగొట్టే వ్యూహం మాత్రమే. రాష్ట్ర పాలన కాడిని పక్కన పడేసి బాబు.. ప్రతి పక్షపార్టీలను తిట్టడం, సొంత పార్టీ నేతలతో తిట్టించడమే పనిగా పెట్టుకుని చాలాకాలమే అయింది. ఎన్డీఏ నుంచి బయకొచ్చాక అది మరింత పెరిగింది. పార్టీ నేతలతో జరిపే టెలికాన్ఫరెన్స్‌లు, పార్టీ సమన్వయ భేటీల్లో ఆయన చర్చించే అంశాలు కేవలం రెండే రెండు. 1. టీడీపీ బాగా పనిచేస్తున్నదన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి అసత్యాలు ప్రచా రం చేయడం, రాష్ట్ర ప్రభుత్వ పని తీరుపై 80% ప్రజలు సంతృప్తి చెందుతున్నారని చెప్పుకోవడం. 2. ప్రతిపక్షాలపై బురదజల్లే విధంగా తిట్లదండకాలు ఎలా ఉండాలో నాయకులకు దిశానిర్దేశం చేయడం. జన్మభూమి కమిటీలతో ఇప్పటికే టీడీపీ నేతలు గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకతను కొనితెచ్చుకొన్నారు. నాలుగేళ్లపాటు ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి.. ప్రత్యేకహోదా సాధించలేకపోవడం తెలుగుదేశం వైఫల్యమని ప్రజలు నమ్ముతున్నారు. పైగా, ప్రత్యేకహోదా వల్ల ఉపయోగం లేదని, అదేమీ సంజీవని కాదని ప్రచారం చేసిన బాబు.. కేవలం ప్రజల్లో పెరుగుతున్న ప్రత్యేకహోదా సెంటిమెంట్‌ను సొమ్ము చేసుకోవడానికే.. చివరి క్షణంలో ప్రత్యేకహోదా అంశాన్ని ఎత్తుకున్నారన్న నిజం ప్రజలు గ్రహిస్తున్నారు. బాబు పన్నుతున్న వ్యూహాలు వికటిస్తున్నాయి. టీడీపీ అధినేత ప్రతి అడుగును, ప్రతి వ్యూహాన్ని ప్రజలు పూర్తిగా అర్థం చేసుకుంటున్నారు. సి. రామచంద్రయ్య వ్యాసకర్త మాజీ ఎంపీ ‘ 81069 15555 -
ఎమ్మెల్యే మణిగాంధిపై విరుచుకుపడ్డ జనం
బురాన్‌దొడ్డి(సి.బెళగల్) : ‘‘అయ్యా మేము నాలుగేళ్లుగా తిరుగుతున్నా పింఛన్ ఇవ్వడం లేదు. మేము సచ్చాక పింఛన్ ఇవ్వాలనుకున్నారా..?’’ అంటూ వృద్ధులు ఎమ్మెల్యే మణిగాంధీని, అధికారులను నిలదీశారు. బుధవారం మండల పరిధిలోని బురాన్‌దొడ్డిలో సర్పంచ్ రామకృష్ణ ఆధ్వర్యంలో పంచాయతీ నోడల్ అధికారి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గోనెనాయక్ జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నవనిర్మాణ దీక్ష కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. మండల ప్రత్యేకాధికాధికారి ప్రసాదరావు, ఎంపీడీఓ సిద్ధాలింగమూర్తి, తహసీల్దార్ అన్వర్‌హుసేన్, ఆర్అండ్బీ ఏఈ ఫణీరామ్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వృద్ధులు గంగన్న, జాన్, వితంతువులు వరలక్ష్మి, సువర్ణ, మైబూబాబీ, గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన వృద్ధురాలు నాగమ్మ పింఛన్‌కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న పట్టించుకోవడం లేదని వాపోయారు. గ్రామంలో తాగడానికే నీళ్లు లేవని గ్రామస్తులు దేవరాజు, మాదన్న, ఆనంద్ తదితరులు అధికారులను నిలదీశారు. అదేవిధంగా గ్రామంలోని ఎస్సీలకు శ్మశానానికి స్థలం కేటాయించాలని చంద్రన్న, సుంకన్నలు అధికారులను కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగమనెమ్మ, అధికారులు పాల్గొన్నారు. -
‘ఏం సాధించారో చెప్పే ధైర్యముందా!’
నాయుడుపేటటౌన్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లుగా నవనిర్మాణ దీక్ష పేరుతో రూ.కోట్లు దుర్వినియోగం చేయడం తప్ప ఏం సాధించారో చెప్పే ధైర్యం ఉందా అని సూళ్లూరుపేట ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ తిరుపతి పార్లమెంటరీ జిల్లా ఇన్చార్జ్ కిలివేటి సంజీవయ్య విమర్శించారు. నాయుడుపేటలోని ఆయన నివాసంలో గురువారం వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అభివృద్ధిపై పొట్టి శ్రీరాములు స్వస్థలమైన జువ్వలదిన్నెలో ప్రజలు నిలదీస్తారని ఇంటిలిజెన్స్ నివేదిక ఇవ్వడంతో సభను మార్చేస్తారా? అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయా సాధన కోసం జాతీయ పార్టీ నాయకురాలి అదేశాలను సైతం లేక్క చేయక తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి కాంగ్రెస్ నుంచి మగధీరుడిలా బయటకు వచ్చి వైఎస్సార్ సీపీని స్థాపించారన్నారు. అలాంటి తమ నేతను విమర్శించే అర్హత టీడీపీ నాయకులకు లేదన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నవనిర్మాణ దీక్ష పేరుతో చేపట్టే సభలో జిల్లాలో టీడీపీ నాయకులు నదుల్లో ఇసుకను కొల్లగొడుతున్న తీరు, నీరు–చెట్టు పేరుతో జరుగుతున్న రూ.కోట్ల అవినీతి, ఆక్రమణల పేరిట 400 కుటుంబాలను రోడ్డుపై పడేసిన తీరు, పులికాట్ ముఖద్వారాల్లో పూడికతీయిస్తాం అంటూ చేప్పే మోసకారి మాటల గురించి ప్రజలకు చెప్పాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. మొదట్లో చంద్రబాబు కాంగ్రెస్‌తో లాలూచిపడి చీకటి ఒప్పందాలు చేసుకుని, రాష్ట్ర విభజనకు కారకుడిగా నిలిచారని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో ప్రధాని మోదీతో పాటు కేసీఆర్‌తో లాలుచీ పడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టిన ఘనత చంద్రబాబుదేనన్నారు. ప్రత్యేక హోదా కోసం తమ పదవులను త్యాగం చేసిన ఎంపీల గురించి మాట్లాడే అర్హత టీడీపీ నాయకులు లేదన్నారు. వారికి దమ్ముంటే వైఎస్సార్ సీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యేలతో రాజీనామలు చేయించి, వారిని మళ్లీ పోటీలో నిలబెట్టి గెలిపించాలని సవాల్ విసిరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, పట్టణాధ్యక్షుడు షేక్ రఫీ, కౌన్సిలర్ కళాచంద్ర, జరీనా, జిల్లా కార్యదర్శి పాదర్తి హరిరెడ్డి, నాయకులు కె.హరిబాబు మొదలియార్, డి.రవీంద్ర, పి.రఘ, జి.సిద్ధయ్య, డి.రాజశేఖరరెడ్డి, మెస్ భాస్కర్‌రెడ్డి, మోహన్‌రావు, సీహెచ్ మోహన్‌కృష్ణశర్మ, సి.చెంగయ్య, పి.భాస్కర్, రత్నశ్రీ, సుగుణమ్మ, అనురాధ, ఇరుగు సాయి, వెంకటేష్ పాల్గొన్నారు. -
‘చంద్రబాబు.. బీజేపీకి గౌరవ కార్యదర్శి’
సాక్షి, విశాఖపట్నం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌లకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఏ ప్రయోజనం లేని నవనిర్మాణ దీక్షల కారణంగా ఏపీలో వారం రోజులుగా ప్రభుత్వ పాలన నిలిచిపోయిందన్నారు. ఆయన విశాఖలో శుక్రవారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. నవనిర్మాణ దీక్షలకు రూ.50 కోట్లు వృథా చేశారని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌లు భయపడుతున్నారేమో గానీ, బీజేపీకి ఎలాంటి భయాలు లేవని స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు ఉన్న కాంగ్రెస్ పార్టీతో కలవాలని చంద్రబాబు ఎందుకు అనుకుంటున్నారో చెప్పాలన్నారు. నిత్యం ప్రధాని పదవిని వదులుకున్నానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబును ప్రధానిని చేస్తానని ఎవరు చెప్పారని ఈ సందర్భంగా ఏపీ సీఎంను ఆయన ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలు చెబితేనే పెన్షన్లు ఇస్తున్నారని, అర్హులకు ఇళ్లు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెల్లవారి లేచిన దగ్గరి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నామస్మరణ చేస్తూ బీజేపీకి చంద్రబాబు గౌరవ ప్రచార కార్యదర్శిగా మారారని పేర్కొన్నారు. బీజేపీ నేతలపై దాడులకు నిరసనగా ఈ నెల 11న విజయవాడలో ధర్నా చేపట్టనున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు. -
విసిగి...వేసారిన జనం
పుంగనూరు : చండ్రమాకులపల్లెకు సీఎం చంద్రబాబు గంటకుపైగా ఆలస్యంగా రావడంతో టీడీపీ నాయకులు విసిగిపోయారు. సీఎం సభ కోసం తరలించిన జనం మండుటెండలో గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రజలకంటే అధికారులు, పోలీసులే ఎక్కువగా కనిపించారు. ఐదు నిముషాల్లో సభ ముగించడంతో జనం నిరాశచెందారు. అంతేకాకుండా పలు ఆర్టీసీ బస్సులు సీఎం సభకు ప్రజలను తరలించేం దుకు మరలించడంతో ఇతర పట్టణాలకు వెళ్లాల్సిన ప్రయాణికులకు తిప్పలు తప్పలేదు. -
తమ్ముళ్లకు తలంటిన చంద్రన్న!
సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో రోజురోజుకు దిగజారిపోతున్న తెలుగుదేశం ప్రతిష్ట.. నిత్యం నేతల గొడవలు.. ఎంత ప్రచారం చేపట్టిన ప్రజాభిమానం పొందడంతో విఫలం. నిఘావర్గాల నివేదికలు వెరసి తమ్ముళ్లకు చంద్రన్న తలంటారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ప్రొద్దుటూరు మండలం నాగాయపల్లె గ్రామదర్శిని వెళ్లేందుకు సీఎం చంద్రబాబునాయుడు కాన్వాయ్ బయలుదేరింది. కొద్దిదూరం వెళ్లగానే బస్సు నిలిపేశారు. బస్సులో ఉన్నవారిని దింపేసి, ముందుసీట్లో ఉన్న సీఎం వెనుక వైపునకు వెళ్లారు. బస్సులోపలికి ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిని పిలిపించారు. ప్రభుత్వ నిఘా వర్గాల నివేదికలను దృష్టిలో ఉంచుకొని మీ ఇద్దర్ని ఇక్కడ పదవుల్లో పెట్టడం తాను చేసిన పెద్ద పొరపాటు అంటూ సీఎం మండిపడ్డట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు వర్గ విభేదాలు తీవ్రం అవుతుంటే మీరేం చేస్తున్నారు. పరిష్కరించాల్సింది పోయి, ఏదో వైపు మీరు మొగ్గు చూపుతూ పరిస్థితిని మరింత జఠిలం చేస్తున్నారని నిలదీసినట్లు సమాచారం. బద్వేల్లో ఎమ్మెల్యే జయరాములు, టీడీపీ నేత విజయజ్యోతి ఇద్దరిని టార్గెట్ చేస్తే మీరు ఇచ్చే మేసేజ్ ఏమిటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగులో గ్రూపు విభేదాలను ఎందుకు పరిష్కరించలేకపోయారు. ఒక వర్గానికి అనుగుణంగా పనిచేయడం ఏ మేరకు సబబు. పార్టీని ఏం చేయాలనుకుంటున్నారు అంటూ ఒకదాని తర్వాత ఒకటి ప్రశ్నలు సంధించడంతో ఇద్దరు నాయకులు నీళ్లు నమిలినట్లు తెలుస్తోంది. ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి సర్దిచెప్పే ప్రయత్నం చేయబోగా, అతని కంటే అనుభవం లేదు. మీ అనుభవం ఏం ఏడ్చింది అనడంతో కిమ్మనకుండా ఉండిపోయినట్లు సమాచారం. కలిసి పనిచేయండి.. ఇన్చార్జి మంత్రి సోమిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి వ్యవహారం అయ్యాక ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేలు లింగారెడ్డి, వరదరాజులరెడ్డిలను బస్సులోకి పిలిపించినట్లు సమాచారం. ఇద్దరు కలిసికట్టుగా పనిచేయాలని, మీరు కలిసి పనిచేయకపోతే ఏం చేయాలో నాకు తెలుసని బాబు ముఖాన్నే చెప్పినట్లు సమాచారం. లింగారెడ్డి ఏదో చెప్పబోయేందుకు ప్రయత్నించగా మంత్రి, జిల్లా అధ్యక్షుడు ఇద్దరితో కలిసి కూర్చొని మాట్లాడుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇకపైన విభేదాలంటూ రచ్చకెక్కితే సహించేది లేదని హెచ్చరించినట్లు సమాచారం. దాదాపు 15 నిమిషాలు బస్సులో ఇదే వ్యవహారం నడిచింది. అక్కడ తమ్ముళ్లు..ఇక్కడ విద్యార్థులు ప్రొద్దుటూరులో తమ్ముళ్లకు తలంటిన చంద్రన్న నవ నిర్మాణ దీక్షలో విద్యార్థులకు క్లాస్ తీసుకున్నారు. విద్యార్థుల కోసం ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు వివరించేంత వరకూ ఓపిగ్గా సీఎం ప్రసంగం వీక్షించసాగారు. కేంద్రప్రభుత్వం, బీజేపీ నాయకత్వం, వైఎస్సార్సీపీ విమర్శించడం సాగిస్తుంటే విద్యార్థులు సీట్లుల్లోంచి లేచి వెళ్లిపోవడం ఆరంభించారు. ఇది గమనించిన పోలీసు అధికారులు విద్యార్థులను కూర్చోబెట్టే ప్రయత్నం చేశారు. నేను చేసే ప్రయత్నానికి మీరు మద్దతు ఇస్తారా...లేదా... ఇస్తే చప్పట్లు కొట్టండి...అంటూ పలుమార్లు విద్యార్థులతో అడిగి చప్పట్లు కొట్టించుకున్నారు. సీఎం ప్రసంగం పూర్తయ్యే సరికి సభలో దాదాపు 80 శాతం వెళ్లిపోయారు. కుర్చీలు ఖాళీగా దర్శనమిచ్చాయి. అయినప్పటీకీ ప్రసంగంలో మార్పులేదు. సీఎం చెప్పాలనుకున్న విషయాలన్నీ పూర్తిగా చెప్పేశారు. ప్రజాధనంతో కార్యక్రమం నిర్వహిస్తూ ఎన్నికల్లో ఓడించడండి అంటూ పిలుపునిచ్చారు. ఉన్నతాధికారుల సాక్షిగా రాజకీయ అంశాలకు వేధికగా నవనిర్మాణ దీక్ష నిలవడం విశేషం. -
ఇంటెలిజెన్స్ ‘నో’
రాష్ట్ర అవతరణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు స్వస్థలం బోగోలు మండలం జువ్వలదిన్నె. ఇక్కడ ప్రభుత్వం నవ నిర్మాణదీక్ష కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించింది. సీఎం టూర్ షెడ్యూలు కూడా ఖరారైంది. అధికార యంత్రాంగం అంతా అక్కడే కేంద్రీకృతమైంది. ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయి. అయితే బుధవారం ఉదయానికి అకస్మాత్తుగా రూట్ మారిపోయింది. కావలి, నెల్లూరు నియోజకవర్గాల్లో పర్యటనను రద్దు చేసి సూళ్లూరుపేట నియోజకవర్గానికి మార్చేశారు. అధికారులు ఆగమేఘాలపై నాయుడుపేట, తాళ్వాయిపాడులో బహిరంగ సభ, గ్రామదర్శిని కార్యక్రమాలు జరపాలని నిర్ణయించారు. హడావుడిగా కొత్త రూట్‌ను ప్రకటించటం జిల్లాలో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీనివెనుక అసలు కారణం ఇంటెలిజెన్స్ ఇచ్చిన నివేదికే అని తెలిసింది. మోడల్ విలేజ్‌గా ప్రకటించిన జువ్వలదిన్నెలో సీఎం సభ నిర్వహిస్తే ప్రజలనుంచి నిరసనలు ఎదురుకావచ్చన్న అధికారుల సూచనలతో షెడ్యూల్ మారినట్లు సమాచారం. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: సీఎం చంద్రబాబునాయుడు నవనిర్మాణ దీక్ష ముగింపు సభ జిల్లాలో నిర్వహించనున్నట్లు గత నెలలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో ఈ నెల 3న సీఎం పర్యటన ఖరారు చేసిన అధికారులు వివరాలు ప్రకటించారు. ఆ మేరకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 8న ఉదయం జువ్వలదిన్నెకు హెలికాప్టర్ ద్వారా చేరుకుని అక్కడ చిప్పలేరుపై నిర్మాణంలో ఉన్న వంతెన, ఇతర అభివృద్ధి పనులను పరిశీలిస్తారని, అనంతరం అమరజీవి పొట్టి శ్రీరాములు సొంతూరు అయిన జువ్వలదిన్నెలోని ఆయన స్మారక భవనాన్ని పరిశీలించి, స్థానిక గిరిజన కాలనీలో మాటామంతి కార్యక్రమ నిర్వహణ, అధికారులతో సమీక్ష నిర్వహించేలా షెడ్యూల్ ఖరారు చేశారు. అక్కడి నుంచి మధ్యాహ్నం నెల్లూరు నగరానికి చేరుకొని వీఆర్సీ గ్రౌండ్లో నవనిర్మాణ దీక్ష ముగింపు సభలో పాల్గొని తిరుగు పయనమవుతారని ప్రకటించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణతో పాటు ఇతర అధికారులు ఏర్పాట్లు సిద్ధం చేశారు. మంగళవారం మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి వీఆర్సీ గ్రౌండ్లో నిర్వహించే దీక్ష ఏర్పాట్లను కూడా పరిశీలించి అధికారులకు అనేక సూచనలు చేశారు. ఈ పరిణమాల క్రమంలో బుధవారం ఉదయం కల్లా పర్యటన మొత్తం పూర్తిగా మారిపోయింది. వెను వెంటనే జిల్లా అధికార గణం కొత్తరూట్లో పర్యటించి అక్కడ అధికారులతో సమావేశం నిర్వహించి, ఏర్పాటు ముమ్మరంగా చేయాలని స్థానిక అధికారులకు ఆదేశాలు ఇచ్చి కొత్త షెడ్యూల్‌ను ఖరారు చేసినట్లు ప్రకటించారు. అభివృద్ధి పనుల్లో నిర్లక్ష్యంపై వ్యతిరేకత వస్తుందనే.. జిల్లాలో మోడల్ విలేజ్‌గా జువ్వలదిన్నెను అధికారులు గతంలో ప్రకటించారు. ఆ మేరకు అక్కడ అభివృద్ధి పనులు పూర్తి స్థాయిలో నిర్వహించి మోడల్ విలేజ్‌లో చిన్నపాటి సమస్య కూడా లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగది. ఈ క్రమంలో జువ్వలదిన్నెలో కీలకంగా ఫిషింగ్ హార్బర్ వ్యవహరం పెండింగ్‌లో ఉంది. సీఎం అనేక సందర్భాల్లో ఫిషింగ్ హార్బర్ వస్తుందని ప్రకటించారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. రూ. 250 కోట్లతో నిర్మించే ఫిషింగ్ హార్బర్ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో ఏర్పాటు కావాల్సి ఉంది. తీర ప్రాంత ప్రజలు కూడా సుదీర్ఘకాలంగా జువ్వలదిన్నె కోసం ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర అవతరణకు కారకుడు అయిన పొట్టిశ్రీరాములు సొంత గ్రామంలో కొత్త రాష్ట్ర నవనిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమాల్లో భాగంగా అక్కడ పర్యటిస్తే వ్యతిరేకత వస్తుందని ఇంటెలిజెన్స్ వర్గాలు సూచించాయి. దీనికి తోడు చిప్పలేరు వాగుపై వంతెన నిర్మాణ పనులు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు నెమ్మదిగా సాగుతున్నాయి. ఈ క్రమంలో 3న అక్కడ పర్యటించిన కలెక్టర్ ముత్యాలరాజు పనులు నత్తనడకన సాగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిణమాల క్రమంలో కావలి, నెల్లూరు నగరం నుంచి పర్యటన పూర్తిగా మారిపోయిన సూళ్లూరుపేట నియోజకవర్గంకే పరిమితం అయింది. తాళ్వాయిపాడులో గ్రామదర్శిని, నాయుడుపేటలో సభ ఈ క్రమంలో 8న సీఎం పర్యటన సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఖరారైంది. పెళ్లకూరు మండలంలోని తాళ్వాయిపాడులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు హెలికాప్టర్ ద్వారా చేరుకుంటారు. అక్కడ గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడ గ్రామస్తులతో ముఖాముఖిలో పాల్గొంటారు. అక్కడి నుంచి నాయుడుపేట చేరుకుని ఎల్సీఎం గ్రౌండ్లో ఫొటో ఎగ్జిబిషన్‌ను తిలకించి నవనిర్మాణ దీక్ష మహా సంకల్ప సభలో పాల్గొని తిరుగుపయమవుతారు. -
నేడు జిల్లాలో సీఎం పర్యటన
చిత్తూరు కలెక్టరేట్: ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మట్లాడారు. నవనిర్మాణ దీక్షల్లో భాగంగా ముఖ్యమంత్రి విచ్చేయనున్నట్లు తెలియజేశారు. వివిధ కార్యక్రమాల అనంతరం హంద్రీ–నీవా, సుజల–స్రవంతి పనులపై అధికారులుతో సమావేశం నిర్వహించే అవకా శం ఉందని ఆయన తెలిపారు. రాత్రికి అక్కడే బసచేసి 8వ తేదీ ఉదయం 8 గంటలకు బయలుదేరి శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి వెళతారని పేర్కొన్నారు. ఓడీఎఫ్ రాష్ట్రంగా ప్రకటన? ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ఓడీఎఫ్‌గా ప్రకటించే అవకాశం ఉందని కలెక్టర్ ప్రద్యుమ్న తెలిపారు. ఓడీఎఫ్ సాధనలో జిల్లా ప్రజలు చేసిన విశేష కృషికి కృతజ్ఞతగా ఇక్కడ నుంచే రాష్ట్రాన్ని కూడా ప్రకటించనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఫైబర్‌గ్రిడ్ కనెక్షన్లు గురువారానికి 3 లక్షలు పూర్తవుతాయన్నారు. గడచిన నాలుగేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 17 వేల కిలో మీటర్ల మేరకు సీసీ రోడ్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇందుకు సంబంధించిన పైలాన్‌ను చంద్రమాకులపల్లె బహిరంగ సభలో ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. -
భయపడ్డ బీజేపీ నాయకత్వం!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రధాని నరేంద్రమోది నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. తప్పుడు నిర్ణయాలతో నాలుగేళ్లలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న బీజేపీ నాయకత్వం ఇప్పుడు భయపడుతోందని వ్యాఖ్యానించారు. అందుకే నాలుగేళ్లుగా పక్కన పెట్టిన సీనియర్ నేతలు అద్వానీ, మురళీమనోహార్ జోషిలను అడుక్కునే పరిస్థితి వచ్చిందని సీఎం ఎద్దేవా చేశారు. బుధవారం సీఎం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు రూరల్ మండలంలో గ్రామదర్శిని, కడపలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్‌కు రూ.15లక్షలు జమ చేస్తామని ఎన్నికల్లో ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ ఏం చేశారన్నారు. ఏ తమ్ముళ్లు ఒక్క రూపాయి అయినా మీ అకౌంట్లో వేశారా అని ప్రశ్నించారు. కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని విభజన చట్టంలో ఉన్నా ఎందుకు అమలు చేయడంలేదని సీఎం ప్రశ్నించారు. విడిపోయి కట్టబట్టలతో మిగిలిన రాష్ట్రానికి జాతీయ పార్టీ అండ కావాలని ఆ రోజు బీజేపీతో జట్టుకట్టామన్నారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోయినా నాలుగేళ్లు ఓపిక పట్టామని, చివరికి విభజన చట్టంలో ఉన్న వాటినీ అమలుచేయకపోవడంతో విడిపోయామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన బీజేపీని ఓడించమని తాను కర్ణాటకలోని తెలుగువారికి పిలుపు ఇవ్వడంలో వల్లే అక్కడ ఆ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. రాష్ట్రానికి ప్రకటించిన 11 యూనివర్శిటీల కోసం రూ.11వేల కోట్లు విలువచేసే భూములిస్తే ఏమాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం దగా చేసినా మన తెలివితేటలతో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రూ.16లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు 2,444 ఎంఓయూలు చేసుకున్నాం. తద్వారా 30లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని పునరుద్ఘాటించారు. కేంద్రంతో లాలూచీ పడే రాజీనామాలు కేంద్ర ప్రభుత్వంతో వైఎస్సార్సీపీ లాలూచీపడిందని అందులో భాగంగానే ఎంపీలతో రాజీనామా చేయించారని చంద్రబాబు మరోసారి ఆరోపించారు. సంవత్సరంలోపు ఎన్నికలు రావని తెలుసు కాబట్టే రాజీనామాలు చేశారన్నారు. ఏప్రిల్ 3న రాజీనామా చేసుంటే ఇప్పటికే ఎన్నికలు వచ్చేవని, మే 29న ఆమోదించినా ఎన్నికలు వచ్చేవన్నారు. ఈరోజు మళ్లీ స్పీకర్ వద్దకు వెళ్లారని, వారికి చేతకాకపోతే చేతకాదని చెప్పాలి తప్పితే రాజీనామాలు ఆమోదించకపోవడానికి తాను కారణమని ఎలా చెబుతారని, అక్కడ నామాట వినే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. హ్యాపీనెస్ ఇండెక్స్‌లో రాష్ట్రానికి 44వ స్థానం సాక్షి, అమరావతి: హ్యాపీనెస్ ఇండెక్స్‌లో (ఆనంద సూచిక) రాష్ట్రం ర్యాంకు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నవ నిర్మాణ దీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. యునైటెడ్ నేషన్స్ సాధికారత సర్వే ఆనంద సూచికలో రాష్ట్రానికి ప్రపంచంలో 44వ ర్యాంకు వచ్చిందని, రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ప్లానింగ్ కార్యదర్శి సంజయ్‌గుప్తా చెప్పగా దానిపై చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం ఆనంద ఆంధ్రప్రదేశ్‌గా రూపొందాలన్నారు. -
జనం కరువాయే.. దీక్షలు బరువాయే..!
సాక్షి, కడప : రాష్ట్ర ప్రభుత్వం అట్టహాసంగా ఈనెల శుక్రవారం నుంచి చేపట్టిన నవ నిర్మాణ దీక్షలకు జనాలు కరువయ్యారు. తమ పరువు కాపాడుకోవడానికి అధికారులు నానా తిప్పలు పడుతున్నారు. జనాలు రాక సభల నిర్వహణ అధికారులకు బరువవుతోంది. ఎక్కడ చూసినా జనం నుంచి నవ నిర్మాణదీక్షలకు స్పందన లేదు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని అధికారులు, టీడీపీ నాయకులు ఎంత ప్రయత్నిస్తున్నా లాభం లేకుండాపోతోంది. కేవలం పింఛన్ ఇస్తామని లబ్ధిదారులు సభలకు తిప్పుకోండం.. ఇవ్వకుండా రేపురండని అంటూ ఉద్యోగులు చెప్పడం పరిపాటిగా మారిందనే విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. సభలకు జనాలు రాకపోవడానికి కారణం.. నాలుగేళ్లుగా రైతులకు రుణమాఫీ అందలేదు. దీంతో వారు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. అలాగే డ్వాక్రా రుణమాఫీకి ఎసరుపెట్టి కేవలం పసుపు కుంకుమగా మార్చి అంతో ఇంతో ఇచ్చే సొమ్మును కూడా కంతుల రూపంలో ఆలస్యం చేయడంపై మహిళలు ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచుకున్నారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం కింద రెండు రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్, నిరుద్యోగ భృతి, ఇంటింటికి ఉద్యోగం, నిరుపేదలకు ఇల్లు ఇలా అనేక రకాల హామీలిచ్చి అంతంత మాత్రంగా కూడా అమలు చేయకపోవడంపై ప్రజలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ గ్రామసభలకు ప్రజల నుంచి ఎలాంటి స్పందన రావడంలేదు. కేవలం దీక్షల్లో అధికారులు మాత్రమే ఉంటున్నారు. అంతటా.. అంతంత మాత్రంగానే జిల్లాలో ఎక్కడ చూసినా నవ నిర్మాణ దీక్షలు వెలవెలబోతున్నాయి. కలెక్టర్ హరికిరణ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు హాజరైన దీక్షలు మినహా అన్ని చోట్ల జనం కరువవుతున్నారు. గతంలో ఎన్నడూ లేని తరహాలో ఈ సారి మండల కేంద్రాలతోపాటు పంచాయతీల్లో ఎనిమిది రోజుల నవ నిర్మాణ దీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. పల్లెల్లో ఎక్కడా జనం లేని దీక్షలే కనిపిస్తున్నాయి. జనాలు నిండుగా ఉండే దీక్షలు మచ్చుకైనా కనిపించడం లేదు. దీక్షల్లో ఒక అంకె దాటని జనం.. జిల్లాలో నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షల్లో జనం ముగ్గురు, అయిదు మంది, ఏడు మంది, పది మంది ఇలా కనిపిస్తున్నారు. వీరపునాయునిపల్లె మండల కేంద్రంలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షల్లో కేవలం ఐదారు మందే కనిపించారు. అలాగే రైల్వేకోడూరు, పుల్లంపేట మండలాల్లోని పలు చోట్ల కేవలం పది మందిలోపే జనాలు కనిపించా రు. పులివెందులలోని మిస్సమ్మ బంగ్లాలో నిర్వహించిన దీక్షకు జనం లేక చిన్న పిల్లలను తీసుకొచ్చి నిర్వహించారు. రాయచోటి నియోజకవర్గంలోని మండలాల్లో నిర్వహిస్తున్న సభలకు కూ డా జనాలు లేక కేవలం డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి నడిపిస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలోని నందలూరు మండలంలో ప్రజలు లేక నవ నిర్మాణదీక్ష బోసిపోయింది. ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేలు, కడప ఇలా అన్నిచోట్ల జనం లేని సభలే దర్శనమిస్తున్నా యి. అందునా పింఛన్ల కోసం వృద్ధులను తీసుకొ స్తుండగా.. డ్వాక్రా మహిళలు, అంగన్వాడీ వర్క ర్లు, ఇతర ప్రభుత్వ సిబ్బంది ఖచ్చితంగా హాజరు కావాలని అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారు. జనం లేకపోవడంతో ఎవరో ఒకరు కనిపిస్తే కొంతైనా దీక్షలకు స్పందనగా చూపించవచ్చని అధికార యంత్రాంగం ఆరాట పడుతోంది. -
‘నిర్బంధ’ దీక్ష
ఒంగోలు టౌన్: నవ నిర్మాణ దీక్షను నిర్బంధ దీక్షగా మార్చేశారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా మంగళవారం స్థానిక రామనగర్‌లోని మున్సిపల్ హైస్కూల్లో కార్యక్రమ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ప్రారంభవుతుందని, అందులో భాగంగా అర్హులైన వారికి సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పడంతో అనేకమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను రప్పించారు. జిల్లా ఇన్చార్జి మంత్రి నారాయణతో పాటు జిల్లాకు చెందిన మరో మంత్రి శిద్దా రాఘవరావు వస్తున్నారంటూ వారిని బలవంతంగా కూర్చోబెట్టారు. నిముషాలు గంటలుగా మారిన ఇద్దరు మంత్రుల ఆచూకీ లేదు. చివరకు మంత్రులు నవ నిర్మాణ దీక్షకు హాజరు కావడంలేదని తేలింది. దీంతో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు వస్తున్నారంటూ కార్యక్రమానికి వచ్చిన వారిని మరోసారి బలవంతంగా కూర్చోపెట్టారు. సమీపంలోనే నివాసముంటున్న శాసనసభ్యుడు దామచర్ల సాయంత్రం 5.30గంటల సమయంలో తీరికగా వచ్చారు. ఎర్రటి ఎండలో మధ్యాహ్నం నుంచి ఎదురుచూసిన వృద్ధులు అన్ని గంటలు షామియానా కింద కూర్చోలేక పైకి లేచ్చారు. నవ నిర్మాణ దీక్షలో శాసనసభ్యుడు పాల్గొన్న అనంతరం ఆయనతో కార్యక్రమాలు నిర్వహించి ఉంటే వచ్చిన కొద్దిమంది అలాగే ఉండేవారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వరుసపెట్టి ప్రసంగాలు చేస్తుండటంతో అప్పటికే సత్తువ కోల్పోయి ఉన్న వృద్ధులు, వితంతువులు ఇక కూర్చోవడం తమవల్ల కాదంటూ బయటకు వెళ్లేందుకు గుంపులుగా లేచారు. ఇది గమనించిన వేదికపై ఉన్న నగరపాలక సంస్థ అధికారులు వారిని కూర్చోపెట్టాలంటూ తమ సిబ్బందిని ఆదేశించారు. ‘ఇక్కడే ఉంటే ప్రాణాలు పోతాయంటూ’ పలువురు వృద్ధులు వారితో వాదనకు దిగుతూ అక్కడ నుంచి బయటకు వెళ్లారు. ఉన్న కొద్దిపాటి మంది వారిని అనుసరిస్తూ బయటకు వెళ్లేందుకు లేవడంతో మున్సిపల్ హైస్కూల్ గేట్లను మూసివేశారు. ఎవరూ బయటకు వెళ్లకుండా అక్కడ ఒక వ్యక్తిని ఉంచారు. అయినా కొంతమంది మహిళలు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, నగర పాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని పంపించి మహిళలు ఎవరూ బయటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. ఇప్పటివరకు తాము ఓపికతో ఉన్నామని, ఇక తమవల్ల కాదంటూ ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగిని ఆమెతో వాదన పెట్టుకొంది. చివరకు ఆ మహిళ తన ఇద్దరు చిన్న బిడ్డలను తీసుకొని బయటకు వెళ్లింది. నవ నిర్మాణ దీక్షకు హాజరైన వారు ఒకరొకరుగా బయటకు వెళుతుండటంతో ఏం చేయాలో పాలుపోని నగర పాలక సంస్థ అధికారులకు చివరకు ఆ స్కూల్లో ఉన్న విద్యార్థులను బలవంతంగా కూర్చోపెట్టారు. ఇంత జరుగుతున్నా శాసనసభ్యుడు దామచర్ల ఆంజనేయులు మాత్రం తమ పార్టీ నాయకులు చేసే ప్రసంగాలను వింటూ కూర్చున్నారు తప్పితే, ముందుగా ఆయన ప్రసంగం చేసి ఉంటే నవ నిర్మాణ దీక్ష నిర్బంధ దీక్షగా మారి ఉండేది కాదని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల అభివృద్ధి కార్యక్రమాలను వివరించి 830 మందికి సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ బ్రహ్మయ్య, మున్సిపల్ ఇంజినీర్ సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాబ్బాబూ.. చప్పట్లు!
తూర్పుగోదావరి, అమలాపురం: నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా ప్రమాణం చేసిన నాలుగేళ్ల తరువాత చంద్రబాబునాయుడు కోనసీమ కేంద్రమైన అమలాపురంలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షకు ప్రజాస్పం దన అంతంత మాత్రంగానే కనిపించిం ది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన బాబు పర్యటన సందర్భంగా రచ్చబండ, విద్యార్థులతో ముఖాముఖి, దళితవాడ పర్యటన, నవ నిర్మాణదీక్ష బహిరంగ సభల్లో చంద్రబాబు చేసిన ప్రసంగాలు ఆకట్టుకోలేకపోయాయి. పైగా స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటన షెడ్యూలు ఖరారు, చేసిన ఏర్పాట్లపై చంద్రబాబే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం. సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఆలస్యంగా మొదలై.. ఆలస్యంగానే ముగుస్తుంది. కానీ అమలాపురంలో మంగళవారం బాబు పర్యటన పది నిమిషాలు ఆలస్యంగా మొదలై.. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ముగిసింది. ఉదయం 10.15 నుంచి సాయంత్రం 5.30 వరకు అంటే 7.15 గంటలపాటు చంద్రబాబు అమలాపురం మున్సిపాలిటీ, రూరల్ మండలాల్లోనే గడిపారు. సమనస, రంగాపురం, వన్నెచింతలపూడిలో జరిగిన కార్యక్రమాలకు స్థానికుల హాజరు అంతంత మాత్రమే. పైగా బాబు పర్యటించిన దారి చాలా ఇరుకుగా ఉండడం, భారీ భద్రత, అందుకు తగ్గట్టుగా పెద్ద కాన్వాయి కావడంతో బందోబస్తుకు వచ్చిన పోలీసులు సైతం ఇబ్బంది పడ్డారు. రంగాపురంలో వీరభద్రుని ఆలయం నుంచి శివాలయం వరకు నడుచుకుని వెళ్లే సమయంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. ‘మీకు ఆర్గనైజేషన్ చేయడంరావడం లేదు’ రంగాపురం గ్రామదర్శిని ఏర్పాట్లపై చంద్రబాబు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘మీరు చాలా ఉత్సాహంగా వచ్చారు. మీరు ప్రశాంతంగా ఉంటేనేను చెప్పేది అర్థమవుతుంది. కానీ అలా లేదు.. ఆర్గనైజేషన్ బాగుంటే ఇటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఎండలో మీరు ఇబ్బంది పడుతున్నారు’ అని బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీకు ఆర్గనైజేషన్ చేయడం కూడా రావడం లేదు అని అక్కడ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో నిర్వహించే బహిరంగ సభకు జనం పెద్ద ఎత్తున వస్తారన్న అంచనాలు తప్పాయి. రంగులు వేయడం, రోడ్లు వేయడం, ఫ్లెక్స్‌లు కట్టడం వంటి ఆర్భాటాలు చేశారు తప్ప అమలాపురం నియోజకవర్గ టీడీపీ నేతలు జనాన్ని తరలించే విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. చివరకు పార్టీ కార్యకర్తలు, నాయకుల హాజరు కూడా పెద్దగా లేదు. సభకు వచ్చినవారిలో మూడొంతుల మంది డ్వాక్రా మహిళలు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారు. సభలో నేతల ప్రసంగాలకు చప్పట్లు కరువయ్యాయి. నాయకులు సైతం ప్రభుత్వం సాధించిన విషయాలను తక్కువగా చెప్పి... జగన్‌పై విమర్శలు ఎక్కువ చేశారు. చంద్రబాబు ప్రసంగం సైతం చప్పగా సాగింది. ఏకంగా 1.02 గంటల పాటు ఒకసారి, లబ్ధిదారులకు కార్లు, ఆటోలు పంపిణీ సమయంలో మరో 15 నిమషాలు చంద్రబాబు ప్రసంగించారు. తాను ఎంతో చేశానని, మరోసారి అవకాశం ఇవ్వాలని, 25 ఎంపీ స్థానాలు గెలిపించాలని చంద్రబాబు పదేపదే కోరినా జనం నుంచి పెద్దగా స్పందన లేదు. కర్ణాటకలో బీజేపీని ఓడించింది మనమే కదా తమ్ముళ్లూ అని ఒకసారి, 2019లో బీజేపీని ఓడించి కేంద్రంలో చక్రం తిప్పేది మనమే అని ఒకసారి ప్రసంగం మధ్యలో ఆపి చప్పట్ల కోసం ఎదురుచూశారు. ఈ రెండు సందర్భాల్లోనూ కార్యకర్తల నుంచి స్పందన లేకపోవడంతో చప్పట్లు కొట్టండి అని అడిగి మరీ కొట్టించుకున్నారు. బీజేపీ, వైఎస్సార్ సీపీ కలిసి పనిచేస్తున్నాయా? అని బాబు ప్రశ్నించి చేతులు ఎత్తమన్నా పెద్దగా ఎవరూ చేతులు ఎత్తలేదు. తొలి ప్రసంగం ముగిసిన తరువాత మంత్రి రాజప్ప గుర్తు చేయడంతో చంద్రబాబు అమలాపురం అభివృద్ధికి రూ.25 కోట్లు ఇస్తామన్నారు. అలాగే కోటిపల్లి– ముక్తేశ్వరం వంతెన అంశం పరిశీలిస్తానన్నారు. అంతకుమించి ఈ ప్రాంతానికి చేసేదేమీ చెప్పలేదు. సాగుసమ్మె ప్రస్తావన గతంలో కోనసీమ రైతులు సాగుసమ్మె చేస్తే జాతీయ స్థాయి నుంచి నేతలను తీసుకువచ్చానని, వారి కష్టాలు చూసే రుణమాఫీ చేశానన్న బాబు ఇప్పుడు మరోసారి రైతులు సాగుసమ్మెకు సిద్ధమవుతున్న విషయంపై స్పందించలేదు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసులు అమలు చేయడం లేదన్న బాబు, తాను బోనస్‌గా క్వింటాల్‌కు రూ.200 ఇస్తానన్న విషయాన్ని మరిచారు. ఏతా వాతా బాబూ పర్యటన వల్ల సమనసలో అధ్వానంగా ఉన్న రహదారి ఆధునీకరణకు నోచుకుంది. అలాగే చింతలపూడి (సమనస)లాకులు, ఎర్రవంతెన–నల్లవంతెన రోడ్డు రైలింగ్‌కు కొత్తరంగులు పడ్డాయికాని పెద్దగా ప్రయోజనం లేదని నియోజకవర్గ వాసులు చెప్పుకుంటుండడం కొసమెరుపు. అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన నవ నిర్మాణదీక్ష సభలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, సుజయ కృష్ణ రంగారావు, ఎంపీలు పండుల రవీంద్రబాబు, తోట నరసింహం, ఎమ్మెల్సీ కె.రవికిరణ్‌వర్మ, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, పులపర్తి నారాయణమూర్తి, దాట్ల బుచ్చిబాబు, తోట త్రిమూర్తులు పాల్గొన్నారు. -
జనం సొమ్ముతో స్వీయ భజన
జాతీయ స్థాయిలోనే తనను మించిన సీనియర్ నాయకుడు లేరని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు తన క్యారెక్టర్ గురించి ప్రజలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ‘‘నా చేతికి వాచీ, ఉంగరం లేవు, నా జేబుల్లో డబ్బులు లేవు. నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు, మందుకొట్టలేదు, సిగరెట్ కాల్చలేదు, చెడు స్నేహాలు కూడా చెయ్యలేదు’’ అంటూ ఆయన 68 ఏళ్లు నిండినాక ఈ వివరణలు ఇచ్చుకోవడం ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి అవసరమా? ఇంటి గడప దాటితే ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసే సీఎం చేతికి ఉంగరం ఉందా లేదా, వాచీ పెట్టుకున్నారా లేదా ఎవరిక్కావాలి? నలభై ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగిన నాయ కుడని గెలిపిస్తే నాలుగేళ్ళు గడిచినా వీసమెత్తు పని చెయ్యలేదన్న సత్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా ధ్రువీకరించదల్చుకున్నట్టు కనిపిస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక ఈ నాలుగేళ్ల కాలంలో ప్రతి ఏటా ఒక వారం రోజుల పాటు ప్రజా ధనం వెచ్చించి నిర్వహిస్తున్న నవ నిర్మాణ దీక్షల్లో ఆయన చేస్తున్న ప్రసంగాలే అందుకు నిదర్శనం. అసలు ఈ దీక్షలు ఇందుకోసం అన్న స్పష్టత బాబుకు అయినా ఉందా అన్న అనుమానం తాను ఈ సంద ర్భంగా చేసే ప్రసంగాలను వింటే అనిపిస్తుంది. తెలంగాణా ఏర్పడ్డాక ఆ రాష్ట్రం జూన్ రెండున అవ తరణ దినోత్సవాన్ని ప్రతి ఏటా అత్యంత వైభవంగా జరుపుకుంటున్నది. తెలంగాణా పోగా మిగిలిన ఏపీకి కూడా ఒక అవతరణ దినోత్సవం ఉండాలి కదా? చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే ఈ విషయంలో కేంద్ర హోం శాఖను స్పష్టత కోరగా భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఏర్పడిన 1956 నవంబర్ ఒకటినే అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రం సూచించింది. నిజానికి అదే ఏపీకి అవతరణ దినోత్సవం జరుపుకోడానికి సరైన తేదీ ఎందుకంటే విడిపోయింది తెలంగాణా ప్రాంతం కానీ ఏపీ కాదు. పోనీ పూర్వపు హైదరాబాద్ రాష్ట్రాన్ని కలుపుకొన్న సందర్భంగా నిర్ణయమైన తేదీ కాబట్టి ఇప్పుడు నవం బర్ ఒకటిని ఎలా అవతరణ దినోత్సవంగా పరిగణి స్తామనే అభ్యంతరం ఉంటే మద్రాసు ప్రావిన్స్ నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడిన 1953 అక్టోబర్ ఒకటి అయినా అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలి. ఈ రెండిట్లో ఏదో ఒక తేదీన తప్ప కుండా ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం జరగా ల్సిందే. ఏపీ ప్రజలు మాత్రం గత నాలుగేళ్ళుగా అవ తరణ దినోత్సవాలు జరుపుకునే అవకాశాన్ని కోల్పో యారు. పెద్ద రాష్ట్రాలు విడిపోవడం భారతదేశంలో ఇవాళ కొత్తగా జరుగుతున్నది కాదు. గతంలో కూడా పలు కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి. విడిపోయాక రెండు రాష్ట్రాలూ తమతమ వీలును బట్టి అవతరణ దినో త్సవాలు జరుపుకుంటూనే ఉన్నాయి. కాబట్టి ఏపీకి కూడా అవతరణ దినోత్సవం ఉండాల్సిందే. పోనీ తెలంగాణాలో కొత్త ప్రభుత్వం ఏర్పడి మంత్రివర్గ ప్రమాణ స్వీకారం జరిగిన జూన్ రెండో తేదీని అవతరణ దినోత్సవంగా ఖరారు చేసు కున్నారు కాబట్టి ఏపీలో చంద్రబాబు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసిన జూన్ ఎనిమిదిని అవతరణ దినోత్సవంగా పాటించవచ్చని ఎవరైనా సూచించ వచ్చు. రేపు ఇంకో పార్టీ ఎన్నికల్లో గెలిచి ఇంకో తేదీన ప్రమాణ స్వీకారం చేస్తే అప్పుడు అవతరణ దినో త్సవం ఆ ప్రభుత్వానికి అనుకూలమైన తేదీకి మారు తుందా? తెలంగాణకు కూడా అదే వర్తిస్తుంది కదా అని అనొచ్చు. తెలంగాణలో ప్రభుత్వం మారినా అవతరణ దినోత్సవాన్ని ఇంకో రోజుకు మార్చే వీలు లేదు. ఆ సాహసం ఏ రాజకీయ పక్షమూ చేయలేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది అపాయింటెడ్ డేట్‌న కాబట్టి. మొత్తం మీద ఏపీకి అవతరణ దినోత్సవం లేకుండా పోయింది. నవ నిర్మాణం ఎక్కడ? అప్పాయింటెడ్ డేట్ అయిన జూన్ రెండున మొదలు పెట్టి వారం రోజులపాటు అంటే తాను ప్రమాణ స్వీకారం చేసిన జూన్ 8 వరకూ ప్రతి ఏటా చంద్ర బాబు నవ నిర్మాణ దీక్ష పేరిట చేస్తున్న జాతర ఒక రూపాయి మందమయినా ఏపీ ప్రజల అభివృద్ధికో, సంక్షేమానికో ఉపయోగపడేది కాదు, పైగా కోట్లాది రూపాయల ప్రజాధనం వృథాగా ఖర్చు అవుతోంది. ఏపీకి నవ నిర్మాణం అవసరమే, దానికి అందరూ దీక్ష బూనాల్సిందే. రాష్ట్రాన్ని కష్టాల్లో నుంచి బయ టపడేసి. మళ్ళీ ప్రగతి బాట పట్టించాల్సిందే. ప్రస్తు తం నవ నిర్మాణ దీక్ష నాలుగోది. వచ్చే ఏడాది ఈ సమయానికి ఎన్నికలు ముగిసి పోయి కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కొత్త ప్రభు త్వాలు ఏర్పడుతాయి. అధికారం ఎవరికి ఇవ్వాలో ప్రజలు నిర్ణయిస్తారు కాబట్టి బాబుకు మళ్ళీ నవ నిర్మాణ దీక్షవారోత్సవం నిర్వహించే అవకాశం వస్తుందో లేదో ఇప్పుడే చెప్పలేం. నమ్మి నాలుగేళ్లు అధికారం అప్పజెపితే ప్రజలకు ఆయన ఏమీ చెయ్య లేక పోయారనడానికి దీక్షల్లో ఆయన చేస్తున్న ప్రసం గాలే నిదర్శనం. మొదటి మూడేళ్లూ బీజేపీతో స్నేహం కొనసాగింది కాబట్టి దీక్షల్లో ఎన్డీఏ ప్రభు త్వం మీద ఈగ వాలకుండా చూసుకున్నారు. గొప్ప అభివృద్ధిని కేంద్రం సాయంతో సాధిస్తున్నామని ఊదరగొట్టారు. నాలుగో ఏట నవ నిర్మాణ దీక్ష సమయం వచ్చేసరికి బీజేపీతో చెడింది. ఆ పార్టీని తిట్టడానికీ, ప్రతిపక్షాలకు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, పవన్ కల్యాణ్‌కూ బీజేపీతో లేని సంబంధం అంటగట్టడానికీ తెగ ఆరాట పడిపోతు న్నారు. నవ నిర్మాణ దీక్ష లక్ష్యం ఏమిటి? ఆయన చేస్తున్నది ఏమిటి? రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి రాజధాని లేక, ఆదాయ వనరులు సరిగా లేక, రూ.16 వేల కోట్ల లోటుతో మిగిలిపోయిన మాట వాస్తవం. అందుకే ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలన్న డిమాండ్ బలంగా అందరిలో ఉంది. నిన్నటిదాకా ఆ కోర్కె బలంగా లేనిది చంద్రబాబుకే. నవ నిర్మాణ దీక్షల్లో ప్రతిన బూనాల్సింది రాష్ట్రా నికి ప్రత్యేక హోదా సాధించడానికి పోరాటం చేస్తా మనీ సాధించే వరకూ ఊరుకోబోమనీ, కానీ చంద్ర బాబు చేస్తున్నదేమిటి? ప్రతిపక్షాలను తిట్టిపో యడం, తనకు తాను కాండక్ట్ సర్టిఫికేట్లు ఇచ్చు కోవడం, కాసేపు తనకు ఏదో ముప్పు రాబోతున్న దనీ, రాష్ట్రంలోని అయిదు కోట్ల మంది ప్రజలూ తన చుట్టూ వలయంలా ఏర్పడి రక్షించుకోవాలని భయం నటించడం– వీటితోనే నవ నిర్మాణ దీక్షా కాలం గడి చిపోతున్నది. నవ నిర్మాణ దీక్షా కార్యక్రమాల్లో భాగంగా ఆయన సోమవారం విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం జమ్మాదేవిపేటలో తాను మాట్లాడిన మాటలు వింటే రాష్ట్ర నవ నిర్మాణం కాదు తెలుగుదేశం పార్టీ ఇంకా మాట్లాడితే బాబు నిర్మాణా నికి జరుగుతున్న ప్రయత్నంగా అర్థం అవుతుంది. ‘సొంత’ క్యారెక్టర్ సర్టిఫికెట్! జాతీయ స్థాయిలోనే తనను మించిన సీనియర్ నాయకుడు లేరని చెప్పుకునే చంద్రబాబుకు ఇప్పుడు తన క్యారెక్టర్ గురించి ప్రజలకు చెప్పుకోవాల్సిన పరిస్థితి. ‘‘నా చేతికి వాచీ, ఉంగరం లేవు, నా జేబుల్లో డబ్బులు లేవు. నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు, మందుకొట్టలేదు, సిగరెట్ కాల్చలేదు, చెడు స్నేహాలు కూడా చెయ్యలేదు’’ అంటూ ఆయన 68 ఏళ్లు నిండినాక ఈ వివరణలు ఇచ్చుకోవడం ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడికి అవసరమా? ఇంటి గడప దాటితే ప్రత్యేక విమానాల్లో తిరుగుతూ కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసే సీఎం చేతికి ఉంగరం ఉందా లేదా, వాచీ పెట్టుకున్నారా లేదా ఎవరిక్కావాలి? రాష్ట్ర ఖజానాయే ఆయన జేబులో ఉంటే పిచ్చి పర్సుతో పనేంటి? ఇక ప్రజ లంతా తనకు రక్షణ కవచంలా ఉండాలని కూడా ఆయన వేడుకున్నారు. ప్రజలను పాలకుడు రక్షి స్తాడా, ప్రజలే పాలకుడిని రక్షిస్తారా? ఇంతకూ ఆయనకు రాబోతున్న ముప్పు ఏమిటి? ఆయన మీద జరుగుతున్న కుట్ర ఏమిటి? ఆయనే ప్రజలకు వివ రిస్తే బాగుంటుంది. ఇంకోమాట అదే జమ్మాదేవి పేటలో ఆయన అన్నారు, ‘బీజేతో పొత్తు పెట్టుకున్న వారిని చిత్తుగా ఓడించండి’ అని. అవును ఇప్ప టికయితే ఆయనే కదా బీజేపీతో ఎన్నికల పొత్తు పెట్టుకున్నది. తననే ఓడించమని పిలుపు ఇస్తున్నారా ప్రజలకు?ఇటువంటి పనికిరాని మాటలు మాట్లాడటానికి ఆయన కోట్లాది రూపాయల ప్రజా ధనం ఖర్చు చేస్తున్నారంటే అర్థం ఏమిటి? నవ నిర్మాణ దీక్షల్లో చెప్పుకోడానికి గత నాలుగేళ్ళుగా తాను రాష్ట్రానికి చేసిందేమీ లేదనీ, భవిష్యత్తులో ఏదో చేసే ఆలోచన కూడా లేదనే కదా. ఐదు లోక్‌సభ సీట్లకు ఉప ఎన్ని కలొస్తే నంద్యాల తరహా ఆటలు సాగవు! నవ నిర్మాణ దీక్షలను ఆయన ఎన్నికల సభలు చేసేశారు. ఎన్నికలంటే జ్ఞాపకం వచ్చింది ప్రత్యేక హోదా సాధన కోసం లోక్‌సభ సభ్యత్వాలకు అయిదుగురు వైఎస్ఆర్సీపీ సభ్యులు చేసిన రాజీనామాలు ఆమో దం పొంది ఉపఎన్నికలు రావాలని చంద్రబాబు ఉవ్విళ్లూరుతున్నారు. ఆ అయిదు లోక్‌సభ సీట్లకు మాత్రమే ఎన్నికలొస్తే నంద్యాల స్టయిల్లో నడిపిం చేయవచ్చని అనుకుంటూ ఉండవచ్చు. నంద్యాల అసెంబ్లీ ఉప ఎన్నిక జరిగిన పరిస్థితి వేరు. భూమా నాగిరెడ్డి చనిపోయిన సానుభూతి కూడా సరిపోక వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, అధికార యంత్రాంగం మొత్తాన్ని అక్కడ మోహరింపచేసి తొండి ఆట ఆడిస్తే తప్ప గెలవలేదు. ఈ అయిదు గురు వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీనామాలు ఒక వేళ ఆమోదం పొందితే జరిగే ఉప ఎన్నికలు నంద్యాల లాంటివి కాదు. ఒక లక్ష్యం సాధించడం కోసం పద వులను తృణప్రాయంగా త్యజించే వారిని ప్రజలు ఎట్లా అక్కున చేర్చుకుంటారో చంద్రబాబుకు అను భవమే కదా గతంలో. కాంగ్రెస్ అవమానాలను భరించలేక బయటికొచ్చి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో కలిసి ఉప ఎన్నికలకు వెళ్ళిన నాయకుల విషయంలో కానీ, తెలంగాణా సాధన కోసం అక్కడ రాజీనామాలు చేసి పోటీ చేసిన నాయకుల విష యంలో కానీ ప్రజలు ఎటువంటి తీర్పు ఇచ్చారో చూశాం కదా. ఆ రెండు సందర్భాల్లోనూ తెలుగు దేశం పార్టీ చాలా చోట్ల డిపాజిట్లు కూడా పోగొట్టు కున్నట్టు గుర్తు. వ్యాసకర్త: దేవులపల్లి అమర్, datelinehyderabad@gmail.com -
నవ నిర్మాణ దీక్షలో మహిళకు వేధింపులు
పార్వతీపురం టౌన్ : టీడీపీ చేపడుతున్న నవనిర్మాణ దీక్షలు వేధింపుల దీక్షలుగా మారుతున్నాయి. దీక్షలకు జనాన్ని తీసుకురావాలని ప్రజాప్రతినిధులు అంగన్వాడీ, వెలుగు, ఎన్ఆర్ఈజీఎస్ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. జనాలను తీసుకురాని సిబ్బందిపై దుర్భాషలాడుతున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం పురపాలక సంఘంలోని 5వ వార్డులో సోమవారం జరిగిన నవనిర్మాణ దీక్ష వేదిక సాక్షిగా అదే వార్డుకు చెందిన ఓ అంగన్వాడీ కార్యకర్తపై అసభ్యకరంగా మాట్లాడిన వార్డు కౌన్సిలర్ చొక్కాపు వెంకటరావును కార్యకర్త భర్త కొట్టిన సంఘటన సమావేశానికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. సమావేశంలో కౌన్సిలర్ వెంకటరావు మాట్లాడడానికి సిద్ధపడుతుండగా, బాధితురాలైన అంగన్వాడీ కార్యకర్త భర్త కలుగజేసుకుని మహిళలంటే అంత చులకనా నీకు.. ఎంతకాలం వేధింపులకు గురి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నాడు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో టీడీపీ నాయకులు కలుగజేసుకుని కార్యకర్త భర్తను అక్కడ నుంచి పంపించివేశారు. అంతకుముందు జనాలను తీసుకురావడంలో విఫలమైందని ఆరోపిస్తూ సదరు కౌన్సిలర్ వెంటకరావు అంగన్వాడీ కార్యకర్తను దుర్భాషలాడారు. దీంతో బాధితురాలు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది. రాజీ ప్రయత్నాలు జరిగిన విషయంపై అంగన్వాడీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎలాగైనా ఇరువర్గాలను రాజీ కుదర్చి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. నలిగిపోతున్న ఉద్యోగులు... నవనిర్మాణ దీక్షలకు జనాన్ని తీసుకువచ్చే విషయంలో అంగన్వాడీ కార్యకర్తలు, బీఎల్ఓలు, వెలుగు సిబ్బంది నలిగిపోతున్నారు. మండుతున్న ఎండలో పెడుతున్న సమావేశాలకు జనం తీసుకురావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే అధికార పార్టీ నాయకులు ఎక్కడ మండిపడతారోననే ఉద్దేశంతో సిబ్బంది ఏదో ఒక రకంగా ప్రజలను తీసుకువస్తున్నారు. -
ప్రజలంతా నాకు రక్షణ కవచంలా ఉండాలి
సాక్షి ప్రతినిధి, శృంగవరపుకోట/గోపాలపట్నం (విశాఖ పశ్చిమ): ‘బీజేపీతో పొత్తు పెట్టుకున్నవారికి ఓటేయకండి. ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్నవారిని ఎన్నికల్లో చిత్తుగా ఓడించండి’ అని సీఎం చంద్రబాబు ప్రజలను కోరారు. విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం, జమ్మాదేవిపేటలో సోమవారం నిర్వహించిన గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొని రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీడీపీకి వ్యతిరేకంగా మహాకుట్ర జరుగుతోందని, ప్రజలంతా తనకు రక్షణ కవచంలా ఉండాలని వేడుకున్నారు. అనంతరం ఎస్.కోటలో నిర్వహించిన నవ నిర్మాణదీక్ష సభకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తనను పొగిడిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తనపై విమర్శలు చేస్తూ రాష్ట్రాన్ని బలహీనపరుస్తున్నారని అన్నారు. అసలు పవన్ తననెందుకు తిడుతున్నాడో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు. అమ్మాయిలతో తిరగలేదు ‘నా చేతికి వాచీ, ఉంగరం లేదు.. జేబులో డబ్బులు లేవు.. నేనెప్పుడూ అమ్మాయిలతో తిరగలేదు.. మందుకొట్టలేదు.. సిగరెట్ కాల్చలేదు.. చెడు స్నేహాలు కూడా చేయలేదు. అలాంటి నన్ను తిడుతుంటే మీ కోసం భరిస్తున్నాను’ అని సీఎం అన్నారు. ప్రధాని మోదీ తిరుపతి వెంకన్న సాక్షిగా అమరావతిని ఢిల్లీ కంటే మిన్నగా అభివృద్ధి చేస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రజలకు, ఏడుకొండలవాడికి ద్రోహం చేశారన్నారు. కర్ణాటకలో బీజేపీకి బలం లేకపోయినా ఎమ్మెల్యేలను కొనడానికి బరితెగించి కోర్టు ఆదేశాలతో చతికిలపడిందని ఎద్దేవా చేశారు. గాలివాన బీభత్సం ఎస్.కోటలో చంద్రబాబు నిర్వహించిన నవ నిర్మాణదీక్ష సభలో గాలివాన బీభత్సం సృష్టించింది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో భారీ గాలివాన రావడంతో టెంట్లు కూలిపోయి బారికేడ్లు తిరగబడ్డాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సభకు అంతరాయం ఏర్పడింది. తర్వాత విద్యుత్‌ను పునరుద్ధరించడంతో చంద్రబాబు సభనుద్దేశించి ప్రసంగించారు. జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల నుంచి తరలించిన మహిళలు, వృద్ధులు, యువకులు మండుతున్న ఎండలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు నానా ఇబ్బందులు పడ్డారు. అనంతరం భారీ వర్షంలో తడిసి ముద్దవడంతో సీఎం ప్రసంగిస్తుండగానే వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి, సుజయకృష్ణ రంగారావు, ఎంపీ అశోక్‌గజపతిరాజు, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి, ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి, ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ శోభా హైమావతి, జిల్లా కలెక్టర్ హరి జవహర్లాల్ సహా పలువురు అధికారులు, నాయకులు పాల్గొన్నారు. విశాఖ విమానాశ్రయంలో సోమవారం రాత్రి గోపాలపట్నం, ములగాడ, మహారాణిపేట తహసీల్దార్ కార్యాలయాలను రిమోట్ ద్వారా సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగులందర్నీ కలుపుకుని పోతున్నానన్నారు. కాగా, కళింగ వైశ్యులకు ఓబీసీ రిజర్వేషన్ ప్రభుత్వం ఇచ్చినా విశాఖ జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆ సామాజికవర్గానికి చెందిన నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. కళింగ వైశ్యుల సంఘం జిల్లా అధ్యక్షుడు పూనా ఉమామహేశ్వరరావు ఈ మేరకు విశాఖలో సీఎంను కలిసి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, జేసీ సృజన, పోలీస్ కమిషనర్ యోగానంద్, జాయింట్ సీపీ రవికుమార్ మూర్తి, జీవీఎంసీ కమిషనర్ హరినారాయణన్, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, విష్ణుకుమార్‌రాజు, గణబాబు, పల్లా శ్రీనివాస్, వాసుపల్లి గణేష్‌కుమార్, జెడ్పీ చైర్పర్సన్ లాలంభవానీ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబు నవనిర్మాణ దీక్ష సభకు బ్రేక్
సాక్షి, విజయనగరం : భారీ వర్షం కారణంగా సోమవారం విజయనగరం జిల్లా ఎస్ కోటలో జరగాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్ష బహిరంగ సభ అర్థాంతరంగా నిలిచిపోయింది. చంద్రబాబు నవనిర్మాణ దీక్ష సభకు చేరకున్న వెంటనే ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం మొదలైంది. దీంతో సభాప్రాంగణంలో ఉన్న ప్రజలు చెట్ల కిందకు పరుగులు తీశారు. ఉరుములు, మెరుపుల శబ్ధానికి భయపడ్డ జనం చెట్ల కింద నుంచి సమీపంలోని దుకాణాలు, షెడ్ల కిందకు వెళ్లి బిక్కుబిక్కుమంటూ తలదాచుకున్నారు. ఉదయం భానుడి ప్రతాపంతో ఉక్కిరిబిక్కిరి అయిన జనం ఒక్కసారిగా కురిసిన వర్షంతో ఆందోళనకు గురయ్యారు. భయంకరమైన ఈదురు గాలుల కారణంగా సమీపంలోని రేకులు ఎగిరి పడుతున్నాయి. -
‘టీడీపీ అంటే టాపిక్ డైవర్షన్ పార్టీ’
సాక్షి, అమరావతి: ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించానికే టీడీపీ నవ నిర్మాణ దీక్షలు చేస్తుందని వైఎస్సార్సీపీ నేతలు బీవై రామయ్య, కాటసాని రాంభూపాల్ రెడ్డి, హఫీజ్ ఖాన్ విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన 600 హామీల గురించి ప్రశ్నిస్తే ఎదురుదాడి చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సమస్యలను పక్కదారి పట్టించడం టీడీపీకి అలవాటైన పని అని విమర్శించారు. టీడీపీ అంటే టాపిక్ డైవర్షన్ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. బీవై రామయ్య సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా రాకుండా అడ్డుకున్నది చంద్రబాబేనని ఆరోపించారు.వైఎస్పార్సీపీ ఎంపీల రాజీనామపై ప్రశ్నించే నైతిక అర్హత చంద్రబాబుకు లేదన్నారు. చంద్ర బాబు 40ఏళ్ల రాజకీయ అనుభవం వేల కోట్ల రూపాయలు లూటీ చేయడానికే పనికొచ్చిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం నాలుగేళ్లలో చేశామన్న అభివృద్ధి మేడిపండును తలపిస్తే.. టీడీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు గురువింద సామెతను గుర్తు చేస్తుందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, అతని మంత్రి వర్గం అలీబాబా 40 దొంగల్లాగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని మండిపడ్డారు. -
ఏపీ ప్రభుత్వం అవినీతి కేరాఫ్ అడ్రస్‌గా మారింది
-
దీక్ష వద్దు.. సభలూ వద్దు!
వలేటివారిపాలెం: గ్రామంలో చాలాకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించకుండా నవనిర్మాణ దీక్షలు పేరుతో సభలు నిర్వహించొద్దని అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. ఈ సంఘటన మండలంలోని కూనిపాలెంలో ఆదివారం జరిగింది. గ్రామంలో నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్షను నిర్వహించకుండా అధికారులు గ్రామం విడిచి వెళ్లే వరకూ స్థానికులు ఒప్పుకోలేదు. సమస్యలు పరిష్కరిస్తాం.. అర్జీలు ఇవ్వాలని అధికారులు కోరారు. ఇప్పటికే పలు సార్లు ఆర్డీఓకు, స్థానిక శాసన సభ్యుడికి అర్జీలు ఇచ్చినా ఫలితం కనిపించలేదని, నవ నిర్మాణ దీక్షకు గ్రామానికి వచ్చిన అధికారులు గ్రామంలో ఉన్న సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారని నిలదీశారు. గ్రామానికి పైఎత్తున వాగులో చెక్‌డ్యామ్ నిర్మించారని, పోకూరు గ్రామానికి చెందిన రైతులు ఎందుకు పగుల గొట్టారని, చెక్ డ్యామ్ నిర్మించే వరకూ గ్రామానికి అధికారులు రావొద్దని తెగేసి చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే పోతుల రామారావు వద్దకు అంతా వెళ్లి విషయం చెబితే రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు ఉన్నాయని, అందువల్లే చెక్‌డ్యామ్ పగులగొట్టాల్సి వచ్చిందని సమాధానం చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. లక్షలాది రూపాయలతో నిర్మించిన చెక్‌డ్యామ్‌ను పగుల గొట్టాల్సిన అవసరం ఏమిటని నిలదీశారు. వర్షాలు లేక పంటలు పండక రైతులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటుంటే నిర్మించిన చెక్‌డ్యామ్ పగులుగొట్టి గ్రామంలోని రైతులు ఇబ్బందులు పెట్టేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారో సామాధానం చెప్పాలని గ్రామస్తులు పట్టుబట్టారు. వర్షాలు పడినప్పుడు నీరు నిల్వ చేసుకునేందుకు నిర్మించిన చెక్‌డ్యామ్‌ను తిరిగి నిర్మించే వరకు అధికారులు గ్రామంలో నవనిర్మాణ దీక్షలు చేపట్టొద్దని, వెంటనే గ్రామాన్ని ఖాళీ చేసి వెళ్లాలని పట్టుబట్టారు. ఫ్లెక్సీని తీసేయాలని డిమాండ్ చేశారు. అధికారులు తొలగించక పోవడంతో గ్రామస్తులు ఫ్లెక్సీని తొలగించి నవనిర్మాణ దీక్ష బహిష్కరిస్తున్నామంటూ అక్కడి నుంచి ఎవరింటికి వారు వెళ్లిపోయారు. చేసేది లేక అధికారులు కూడా తమ కార్యాలయాల బాట పట్టారు. -
‘ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుంది’
సాక్షి, వైఎస్సార్ కడప : నవనిర్మాణ దీక్షలు రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల్లా లేవని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లా ఉన్నాయని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప పార్లమెంట్ అధ్యక్షుడు సురేష్ బాబు విమర్శించారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన నవనిర్మాణ దీక్షలపై ఆ నేతలు తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘రాష్ట్రంలో ఏం సాధించారని నవనిర్మాణ దీక్షలకు దిగారో సీఎం చంద్రబాబు ప్రజలకు వివరించాలి. కడప జిల్లాకు ఏం సాధించారని చంద్రబాబు కడప పర్యటనకు వస్తున్నారు. అధికారులు కూడా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎన్ని హామీలు అమలు చేశారో చంద్రబాబు చెప్పాలి. రాష్ట్రంలో పరిస్థితులు చూస్తే టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కచ్చితంగా ఆత్మ క్షోభిస్తుంది. అందరిని మోసం చేసే వ్యక్తి చంద్రబాబు, కానీ ప్రధాని నరేంద్ర మోదీ తనను మోసం చేశారని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు. గత జన్మభుమికి చేసిన ఖర్చులకు సంబంధించిన నిధులను ఇంతవరకు మంజూరు చేయలేదు. తిరిగి నవనిర్మాణ దీక్షలు చేస్తూ నిధులను వృథా చేస్తున్నారు. హోదా కోసం టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే ఎప్పుడో రాష్ట్రానికి హోదా వచ్చి ఉండేది. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి విశ్వసనీయత గల రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు మాదిరి దొంగ నాటకాలు ఆడటం లేదంటూ’ రఘురామిరెడ్డి, సురేష్ బాబు పేర్కొన్నారు.