
నవ నిర్మాణ దీక్ష వెలవెల!
- సీఎం ప్రసంగం మొదలవగానే ఇంటిబాట పట్టిన విద్యార్థులు, మహిళలు
- టవర్‌క్లాక్ వద్ద ట్రాఫిక్ నియంత్రణతో ఇబ్బందిపడిన ప్రజలు
అనంతపురం అర్బన్ : ప్రభుత్వ యంత్రాంగం ఎంతో ఆర్భాటంగా శుక్రవారం నిర్వహించిన ‘నవ నిర్మాణ దీక్ష’ వెలవెలబోయింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 10 గంటలకు విజయవాడలో దీక్ష ప్రతిజ్ఞ చేసి ప్రసంగం ప్రారంభించారు. ఆ లైవ్ ఇక్కడ మొదలవగానే విద్యార్థులు, మహిళలు ఇంటిబాట పట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు తప్పదన్నట్లుగా కూర్చుండిపోయారు.
సమైక్యాంధ్ర ఉద్యమానికి వేదికగా నిలిచిన టవర్‌క్లాక్ వద్దే ‘నవ నిర్మాణ దీక్ష’ వేదిక ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ విధించడంతో ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆర్ట్స్ కళాశాల ఎదుటి మార్గం ద్వారా వేదిక వద్దకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రజలు వచ్చేందుకు కూడా దారి ఉంచలేదు. బారికేడ్ల కింద నుంచి దూరి రావాల్సి రావడంతో మహిళలు ఇబ్బంది పడ్డారు. భరత నాట్యం చేసేందుకు వచ్చిన చిన్నారులకు వేదిక మీద అవకాశం కల్పించకపోవడంతో వారు కింద ఉన్న ఖాళీ స్థలంలో నాట్య ప్రదర్శన ఇచ్చారు. దీంతో కార్యక్రమానికి వచ్చినవారు నేరుగా వీక్షించలేకపోయారు.