
నవనిర్మాణ దీక్ష నవ్వుల పాలు! ’
– అభివృద్ధి అంటూ ప్రజాప్రతినిధుల ఊకదండపు ఉపన్యాసాలు
– కార్యక్రమాలకు సామాన్య ప్రజలు హాజరు అంతంతే
- అధికారులు, పొదుపు మహిళలు, విద్యార్థులతో సరిపెట్టిన వైనం
మూడేళ్లలో ప్రభుత్వం సాధించింది ఏమీ లేదు. జిల్లాలో ఒక్క పరిశ్రమ వచ్చింది లేదు. ఒక నిరుద్యోగికి ఉద్యోగం ఇచ్చింది లేదు. సరికదా వందల సంఖ్యలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల్ని తొలగించారు. వరస కరువులతో అల్లాడుతుంటూ కరువు సహాయక చర్యలు చేపట్టలేదు. ఉపాధి కరువై కూలీలు వలసబాట పట్టారు. హంద్రీ– నీవా రెండో దశ పనులు పూర్తి చేసే సూచనలు కనిపించలేదు. పేదలకు ఒక్క ఇళ్లు నిర్మించలేదు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే అభివృద్ధి బాటలో ఉన్నామంటూ... ముఖ్యమంత్రి నిద్రాహారాలు మాని కృషి చేస్తున్నారంటూ అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ‘నవ నిర్మాణ దీక్ష’ కార్యక్రమంలో గొప్పలకు పోయారు. ఒక రకంగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు సోత్కర్షతోనే ఏడు రోజుల కార్యక్రమం ముగిసింది.
- అనంతపురం అర్బన్
‘నవ నిర్మాణ దీక్ష’ కార్యక్రమాలు ఈ నెల 2 నుంచి గురువారం వరకు జరిగాయి. తొలి రోజున ప్రతిజ్ఞ, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రసంగంతో ముగిసింది. ముఖ్యమంత్రి ప్రసంగం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే కార్యక్రమానికి హాజరైన పొదుపు మహిళలు, విద్యార్థులు సభ నుంచి వెళ్లిపోయారు. ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం తప్పనిసరై కూర్చున్నారు. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు రోజుకు ఒక అంశంపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తోందంటూ ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చారు.
ఐదు రోజుల పాటు జరిగిన సమీక్ష కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం కనిపించలేదు. సమీక్ష అంశానికి సంబంధించిన రోజున ఆయా వర్గాలకు చెందిన వారిని కార్యక్రమానికి అధికారులు తరలించారు. నవ నిర్మాణ దీక్ష ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం కావడంతో ఉద్యోగుల భాగస్వామ్యం తప్పనిసరయ్యింది.ప్రధానంగా రెవెన్యూ, మున్సిపల్, డీఆర్‌డీఏ శాఖల అధికారులు, సిబ్బంది ఏడు రోజుల కార్యక్రమాన్ని తలపై మోశారు. నవ నిర్మాణ దీక్ష వల్ల ఒరిగిందేమి లేదని, ఒక రోజుతో సరిపెట్టాల్సిన కార్యక్రమాన్ని ఏడు రోజుల పాటుు నిర్వహించడంతో తాము తీవ్ర ఇబ్బందికి గురయ్యామని పలువురు అధికారులు, సిబ్బంది వాపోయారు.
ఇబ్బంది పడిన ప్రజలు
దీక్షలో భాగంగా ఏడు రోజుల పాటు జరిగిన కార్యక్రమాల కారణంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు సమీక్ష కార్యక్రమాలు నిర్వహించడంతో ముఖ్య అధికారులందరూ పాల్గొనడంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైళ్లు కదలలేదు. రోజూ క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్లే ఆర్డీఓలు, తహసీల్దార్లు నవనిర్మాణ దీక్షకు పరిమితయ్యారు. దీంతో మండలాల్లో రెవెన్యూ కార్యాలయాలకు వివిధ పనులపై వచ్చే ప్రజలకు అధికారులు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో వారి పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అలాగే ప్రతి సోమవారం కలెక్టరేట్‌తో పాటు డివిజన్, మండల స్థాయిలో నిర్వహంచే మీ కోసం కార్యక్రమం రద్దయింది. దీంతో పలువురు ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు కలెక్టరేట్, డివిజన్, మండల స్థాయి కార్యాలయాలకు వచ్చి ఊసూరుమంటూ వెనుతిరిగారు.
నిధులు ఇవ్వని ప్రభుత్వం
నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ప్రభుత్వం తరపున అధికార యంత్రాగం ఆర్భాటంగా నిర్వహించింది. అయితే కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని తెలిసింది. దీంతో అధికారులు తమ పలుకుబడిని ఉపయోగించి నిర్వహణ ఏర్పాట్లు చేశారు. ఇప్పుడు వాటికి బిల్లులు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని వారు వాపోతున్నారు.
‘మహా సంకల్పం’లో ఉద్యోగులే
దీక్ష చివరి రోజున గురువారం జిల్లాలోని 14 నియోజకవర్గాల పరిధిలో మహా సంకల్పం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్ కళాశాల ఆవరణలో ‘మహా సంకల్పం’ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి అన్ని శాఖల అధికారులు, వారి సిబ్బంది తప్పని సరిగా హాజరు కావాలని కలెక్టర్ జి.వీరపాండియన్ ఆదేశాలు ఇచ్చారు. అంతే కాకుండా హాజరు పట్టిక కూడా ఏర్పాటు చేశారు. హాజరు కాని ఉద్యోగులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరిక జారీ చేశారు. దీంతో తప్పని సరిగా ఉద్యోగులందరూ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇక పొదుపు సంఘాల మహిళలను, విద్యార్థులను అధికారులు తరలించారు.