నవనిర్మాణ దీక్షపై సీఎం టెలికాన్ఫరెన్స్
Published Tue, Jun 6 2017 1:20 PM | Last Updated on Sat, Jul 28 2018 3:39 PM
అమరావతి: సకాలంలో వర్షాలు పడటం శుభసూచకమంటూ.. ప్రభుత్వ కృషికి ప్రకృతి సహకారం తోడైతే ప్రతి రంగంలో అద్భుత ప్రగతి సాధించవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఇస్రో విజయం, సివిల్స్ విద్యార్ధుల విజయాలు స్ఫూర్తిదాయకాలన్నారు. రాష్ట్రంలో రూ. 4లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని, 6 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయని, అన్ని ఎంవోయూలు గ్రౌండ్ అయితే 30 లక్షల మందికి ఉపాధి వస్తుందని చెప్పారు. మాన్యుఫ్చాక్చర్ హబ్‌గా మన రాష్ట్రం తయారు కావాలని, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు అందరికీ ఏర్పడాలని, ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ రూపొందాలని ఆకాంక్షించారు.
వంద శాతం కరెంటు కనెక్షన్లు, వంద శాతం వంట గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామన్నారు. ఇదే స్ఫూర్తితో రాష్ట్రంలో అందరికీ వంద శాతం ఇంటి స్థలాలు, సొంత ఇళ్లు కల్పిస్తామన్నారు. ప్రతి గ్రామం, వార్డులో పెండింగ్ సమస్యలను గుర్తించి వెంటనే వాటిని పరిష్కరించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. ప్రతి కుటుంబంలో భరోసా, భద్రత పెంచడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మూడేళ్లలో చేసిన పనులను నవనిర్మాణ దీక్షలలో చర్చనీయాంశాలు చేశామని సీఎం చెప్పారు.
ప్రభుత్వం చేసిన పనులపై ప్రజలు సంతృప్తి చెందాలని, అప్పుడే వ్యవస్థల పట్ల వారిలో నమ్మకం పెరుగుతుందని చంద్రబాబు అన్నారు. నవ నిర్మాణ దీక్షలను విజయవంతం చేసిన అందరికీ అభినందనలు తెలియజేశారు. ఇదే స్ఫూర్తితో రేపటి మహా సంకల్పాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టెలికాన్ఫరెన్స్‌లో జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement