సాక్షి, అమరావతి: సాధారణంగా ఎవరి ఇంట్లోనైనా ఆదాయం తక్కువ.. ఖర్చులు ఎక్కువగా ఉంటే ఏం చేస్తారు.. అనవసర ఖర్చులను తగ్గించుకుంటారు.. వీలుంటే కొన్నింటిని వాయిదా వేసుకుంటారు. కానీ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాత్రం అందుకు విరుద్ధం. రాష్ట్రం భారీ రెవెన్యూ లోటులో ఉన్నా సరే దుబారాతో ఖజానాకు తూట్లు పొడుస్తున్నారు. ఏటేటా రెగ్యులర్ విమానాలను కాదని ప్రత్యేక విమానాల్లో పర్యటనలు, అర్భాటాలు, ప్రచార ఈవెంట్లు, ధర్మపోరాటాలకు భారీగా వ్యయం చేస్తున్నారు. నాలుగేళ్లలో చంద్రబాబు ఆర్భాటపు దుబారాకు అయిన మొత్తం రూ.2,620.76 కోట్లకు పెరిగిపోయిందంటే అనవసర ఖర్చులు ఏ రేంజ్‌లో ఉన్నాయో అర్ధమవుతుంది.
వీటివల్ల నాలుగేళ్లలో రాష్ట్రానికి ఎలాంటి శాశ్వత వసతి కానీ, ఆస్తిగానీ సమకూరలేదు. పైగా.. ఏమీ చేయకుండా చేస్తున్నట్లు విస్తృత ప్రచారం చేసుకుంటూ.. రాష్ట్ర ఖజానాను విచ్చలవిడిగా వాడేసుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్ అంటూ.. పరిష్కార వేదిక 1100 నెంబర్ అంటూ వందల కోట్ల రూపాయలను ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారు. నాలుగేళ్లుగా రాష్ట్రం ఏటా రెవెన్యూ లోటులోనే కొనసాగుతున్నప్పటికీ అనవసరపు ఖర్చులను అదుపు చేయాల్సిన ముఖ్యమంత్రే అందుకు విరుద్ధంగా ఈ వెంట్ల పేరుతో భారీగా నిధులు ఖర్చుపెడుతుండడంపై అధికార యంత్రాంగం విస్మయం వ్యక్తంచేస్తోంది. ఓ పక్క రాజధాని కోసం ప్రజలను విరాళాలు ఇవ్వండంటూ పిలుపునిస్తూ.. మరోపక్క ప్రజాధనాన్ని సొంత ప్రచారం కోసం దుర్వినియోగం చేయడం ఎంతవరకు సమంజసం అంటూ ఉన్నతాధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
సర్కార్ సొమ్ముతో ధర్మపోరాటమా!?
మొన్నటి వరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన సీఎం చంద్రబాబు.. ఇప్పుడు కేంద్ర కేబినెట్ నుంచి బయటకు వచ్చి ప్రత్యేక హోదా పల్లవి అందుకుని ధర్మపోరాటం అంటూ సర్కార్ సొమ్ముతో సభలు నిర్వహించడాన్ని ఉన్నతస్థాయి అధికారి ఒకరు తప్పుపట్టడం గమనార్హం. సీఎంగా ఉంటూ ధర్మపోరాటాలు ఎవ్వరైనా చేస్తారా అంటూ ఆ అధికారి వ్యాఖ్యానించడం విశేషం. రాజధానిలో శంకుస్థాపనల పేరుతో వందల కోట్ల రూపాయలు వ్యయం చేసినా ఇప్పటివరకూ ఒక్క శాశ్వత భవనాన్నీ సమకూర్చలేదు. పైగా తాత్కాలిక సచివాలయ వ్యయాన్ని రూ.300 కోట్ల నుంచి మరమ్మతులు, ఇతర సౌకర్యాల పేరుతో ఏకంగా రూ.1,100 కోట్లకు పెంచేశారు.
భాగస్వామ్య సదస్సులకు రూ.150కోట్లు
అలాగే, పెట్టుబడుల కోసం భాగస్వామ్య సదస్సులను నిర్వహించడాన్ని ఎవ్వరూ తప్పుపట్టక పోయినప్పటికీ వాటి నిర్వహణకు చేస్తున్న వ్యయంపై మాత్రం అధికారులే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు మూడు భాగస్వామ్య సదస్సులు నిర్వహించగా.. ఒక్కో సదస్సుకు రూ.50 కోట్ల చొప్పున మొత్తం రూ.150 కోట్లు వ్యయం చేయడాన్ని అధికారులే తప్పుపడుతున్నారు. అంత వ్యయం చేసినప్పటికీ ఇప్పటివరకు చెప్పుకోదగ్గ భారీ పరిశ్రమ ఒక్కటి కూడా రాలేదని వారు పేర్కొంటున్నారు. మరోపక్క.. ఇప్పటివరకూ ఐదుసార్లు జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు స్వీకరించి పరిష్కరించడమే జన్మభూమి లక్ష్యమని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ అవి సీఎం ప్రచార సభలుగా మారిపోయాయని అధికార వర్గాలు ఆరోపిస్తున్నాయి. కాగా, ఇప్పటివరకు జరిగిన ఐదు జన్మభూమి కార్యక్రమాలకు మొత్తం రూ.125 కోట్లు వ్యయం చేశారని, ఇదంతా దుబారా కిందకే వస్తుందని పేర్కొంటున్నాయి.
నయాపైసా ఉపయోగంలేని నవనిర్మాణ దీక్షలు
రాష్ట్ర అవతరణ దినోత్సవం జరపకుండా నవ నిర్మాణ దీక్షల పేరుతో ఏటా 20 కోట్ల రూపాయలను వ్యయం చేస్తున్నారని, ఇప్పటివరకు నాలుగుసార్లు నవ నిర్మాణ దీక్షల పేరుతో సీఎం ప్రచార సభలు నిర్వహించారు తప్ప వాటివల్ల ఎటువంటి ప్రయోజనంలేదని అధికారులే అంటున్నారు. అలాగే, కొత్తగా ఈ ఏడాది హ్యాపీ సిటీస్ సదస్సును తెరమీదకు తీసుకువచ్చిన సీఎం.. ఇందుకు రూ.61 కోట్లు వ్యయం చేశారు. పోలవరం ప్రాజెక్టు డ్యాం పునాదులు కూడా పూర్తికాకముందే బస్సుల్లో జనాన్ని ఆ ప్రాజెక్టు దగ్గరకు తీసుకువెళ్లి చూపించడానికి ఏకంగా 22.50 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. రాజధాని శంకుస్థాపనకు రూ.250 కోట్లను వ్యయం చేసిన సర్కారు ఆ తరువాత పరిపాలన నగరం, సీడ్ కేపిటల్.. రహదారుల శంకుస్థాపనల పేరుతో ఈవెంట్లను నిర్వహించి రూ.100 కోట్లు వ్యయం చేసింది. అయినా ఇప్పటివరకూ రాజధాని ఒక్క శాశ్వత నిర్మాణానికీ నోచుకోలేదు.
ప్రత్యేక విమానం, హెలికాప్టర్ ఖర్చు రూ.100కోట్లు
ఈ ఏడాది విదేశీ పర్యటనలు, రోడ్‌షోలకు రూ.62 కోట్లు కేటాయింపు
నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన విదేశీ పర్యటనలవల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకపోయినా ఖజానాకు మాత్రం బాగా చమురు వదిలింది. దేశంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో, హెలికాప్టర్లలో ప్రయాణం చేస్తున్నారు. దేశంలోనూ ఎక్కడికి వెళ్లాలన్నా రెగ్యులర్ ఫ్లైట్లున్నప్పటికీ చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో వెళ్లారు. చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు గత నాలుగేళ్లలో రూ.100 కోట్లు వెచ్చించారు.
గన్నవరం విమానాశ్రయంలో బాబు ప్రత్యేక విమానం, హెలికాప్టర్ పార్కింగ్ చేసి ఉంటాయి. పార్కింగ్ చేసి ఉంచినందుకు కూడా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు చెల్లించాల్సి వస్తోందని.. అలాగే పైలెట్లకు స్టార్ హోటల్స్‌లో బస ఏర్పాటుచేయాల్సి వస్తోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెగ్యులర్ ఫ్లైట్లున్నా ప్రత్యేక చార్టెడ్ విమానాల్లో తిరగడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన అజేయ కల్లాం తాను రాసిన మేలుకొలుపు పుస్తకంలో తప్పుపట్టారంటే సీఎం ఎలా దుబారా చేశారో తేటతెల్లం అవుతోంది. అలాగే, ఈ ఏడాది విదేశీ యాత్రల కోసం ప్రత్యేకంగా ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటుచేశారు. విదేశీ పర్యటనలు, రోడ్ షోల నిర్వహణకు ఏకంగా బడ్జెట్‌లో రూ.62కోట్లను కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment