నవ నిర్మాణ దీక్ష సభలు ఎక్కడ చూసినా ఇదే తీరు..
ఒంగోలు టౌన్: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో వారం రోజుల పాటు నిర్వహించిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో ప్రచార ఆర్భాటం తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈనెల 2 నుంచి 8వ తేదీ వరకు నిర్వహించిన నవ నిర్మాణ దీక్షల వల్ల శాఖాపరమైన కార్యక్రమాలకు ఆటంకం కలిగింది. దీక్షల కోసం ప్రభుత్వం జిల్లాకు కేటాయించిన కోటి రూపాయలు ప్రజాధనం కూడావృథా అయింది. అయితే శని, ఆదివారాలు రెండు రోజులు సెలవులు రావడంతో అధికారులు, ఉద్యోగులు ఊపిరి పీల్చుకున్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు ప్రతి ఏటా జూన్ 2వ తేదీ నుండి నవ నిర్మాణ దీక్ష నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా నాలుగో విడత నవ నిర్మాణ దీక్ష చేపట్టారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి ఒక్కరోజు దీక్ష నిర్వహించి ఉంటే బాగుండేదని, ఇలాంటి వాటిని కూడా వారం రోజులపాటు నిర్బంధంగా నిర్వహించి చంద్రబాబు తన మార్కు ప్రచారాన్ని నిర్వహించుకునేందుకు వేదికగా మలచుకున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపించాయి. జిల్లా కేంద్రం, డివిజనల్ కేంద్రం, మునిసిపల్ కేంద్రం, మండల కేంద్రం, గ్రామ పంచాయతీ అనే తేడా లేకుండా ఎక్కడ బడితే అక్కడ నవ నిర్మాణ దీక్షలకు సంబంధించిన ఫ్లెక్సీలను ఏర్పాటుచేసి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ప్రతిజ్ఞ టు మహాసంకల్పం
రాష్ట ప్రభుత్వం వారంరోజులపాటు నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలను ప్రతిజ్ఞతో ప్రారంభించి మహాసంకల్పంతో ముగించింది. తొలిరోజు 2వ తేదీ ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం, విభజన హామీలు అమలుపై చర్చించి ప్రభుత్వ ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. రెండవరోజు నీటిభద్రత, కరువు రహిత రాష్ట్రం, మూడవరోజు రైతు సంక్షేమం, ఆహార భద్రత, నాల్గవ రోజు సంక్షేమం–సాధికారత, ఐదవరోజు జ్ఞాన భూమి –ఉపాధి కల్పన, ఆరవరోజు మౌలిక సదుపాయాలు– మెరుగైన జీవనం, ఏడవరోజు సుపరిపాలన–అవినీతిరహిత సమాజం గురించి చర్చించారు. చివర్లో మహా సంకల్పం చేపట్టారు. జిల్లా కేంద్రమైన ఒంగోలులోని ఏ–1 ఫంక్షన్ హాలులో మహాసంకల్పం చేపట్టారు. వారం రోజులపాటు షెడ్యూల్ ప్రకటించినప్పటికీ ఎక్కువ ప్రాంతాల్లో సక్రమంగా అమలు చేయకుండా యంత్రాంగం మమ అనిపించేసింది.
అందుకు కారణం నవ నిర్మాణ దీక్షలో ప్రజల భాగస్వామ్యం లేకపోవడమే. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామ పంచాయతీ వరకు అన్నిచోట్ల నవ నిర్మాణ దీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించడంతో ప్రజల భాగస్వామ్యం కొరవడింది. పైగా ప్రతిరోజూ మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ప్రజలను నిర్బంధంగా ఉంచేందుకు గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు యంత్రాంగం ప్రయత్నించినప్పటికీ ప్రజల హాజరు పలచగానే ఉంది. జిల్లాకు చెందిన మంత్రి, శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నచోట్ల ప్రజలను పథకాల పేరుతో మభ్యపెట్టి దీక్షలకు తరలించడం జరిగింది. కొత్తగా పింఛన్లు, ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించడంతో ప్రజలు ఆ మాత్రమైనా వచ్చారు. లేకుంటే ఎర్రటి ఎండల్లో పనేమి లేదన్నట్లుగా వెళతామా అని కొంతమంది ప్రజలు అధికారుల ఎదుట బహిరంగంగానే వ్యాఖ్యానించిన సంఘటనలు చోటు చేసుకున్నాయి.
అధికారపార్టీ నేతల హడావుడి
నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో అధికార పార్టీ నేతల హడావుడి ఎక్కువగా కనిపించింది. ఇది ప్రభుత్వ కార్యక్రమమైనప్పటికీ తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యక్రమంలా భావించి హల్‌చల్ చేశారు. ముఖ్యమంత్రి తనయుడు, పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్, మహిళా శిశు సంక్షేమశాఖామంత్రి పరిటాల సునీత, జిల్లాకు చెందిన మంత్రి శిద్దా రాఘవరావు నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్నారు. జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి నారాయణ జిల్లాపై కన్నెత్తి కూడా చూడలేదు. అధికార పార్టీ శాసనసభ్యులు పాల్గొన్న నవ నిర్మాణ దీక్షల్లో తెలుగు తమ్ముళ్ల సందడి మరీ ఎక్కువగా కనిపించింది. కొన్నిచోట్ల తెలుగు తమ్ముళ్లు కూర్చొని, అధికారులు నిల్చొన సంఘటనలు చోటు చేసుకున్నాయి. దీనిని బట్టి నవ నిర్మాణ దీక్షను అధికారపార్టీ ఏవిధంగా ఉపయోగించుకుందో అర్ధం చేసుకోవచ్చు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం కంటే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించేందుకే ఎక్కువగా దీక్షను వినియోగించుకున్నారు. దీంతో ప్రజలు ఇది ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అని వ్యాఖ్యానించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment