నగరి: కొండచుట్టు మండపం వద్ద జనం లేక ఖాళీగా ఉన్న దీక్షా శిబిరం
నగరి : నవనిర్మాణ దీక్ష పేరిట ప్రభుత్వం నిర్వహించిన శిబిరాలు వెలవెలబోయాయి. నగరి మున్సిపల్ పరిధిలోని 1, 25, 26, 27 వార్డులకు కొండచుట్టు మండపం వద్ద, 3, 4, 5, 6, 22, 23, 24 వార్డులకు పీసీఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నవనిర్మాణ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు సూపర్‌వైజర్లుగా మేనేజర్ రవికుమార్, ఆర్‌ఓ ఇమ్రాన్ ఖాన్‌ను నియమించారు. ఉదయాన్నే వీరు షామియానాలు, చైర్లు వేసి దీక్షా శిబిరాన్ని సిద్ధం చేశారు. కానీ 11 గంటల వరకు కూడా జనం శిబిరాల వద్ద ఎక్కడా కనిపించలేదు.
కౌన్సిలర్లు కూడా రాలేదు..
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవనిర్మాణ దీక్షల్లో అధికారులతో పాటు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. పలువురు కౌన్సిలర్లు కూడా హాజరుకాలేదు. దీంతో అధికారులు ఉన్న జనంతో మమ అంటూ నవనిర్మాణ దీక్షా శిబిరాలను ముగించేశారు.
నేలపై కూర్చుని టీడీపీ నాయకుల నిరసన
కొండచుట్టు మండపం వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షా శిబిరంలో కమిషనర్, తహసీల్దార్ గైర్హాజరయ్యారంటూ 1వ వార్డుకు చెందిన కౌన్సిలర్ లత, టీడీపీ నాయకులు చలపతి ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శిబిరాలకు అధికారులే రాకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు ఎవరు సమాధానం చెబుతారన్నారు. 1వ వార్డులో ప్రజలకు పట్టాలు ఇవ్వలేదని, తాగునీరు, పారిశుద్ధ్యం సమస్య ఉందని అధికారులు రాకుంటే వీటిని ఎవరికి చెప్పుకోవాలన్నారు. వేదికపై వారికి ఏర్పాటు చేసిన సీట్లను వదిలి నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు.
నవనిర్మాణ దీక్షకు సందన కరువు
విజయపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన నవనిర్మాణ దీక్షకు ప్రజలను నుంచి స్పందన పూర్తిగా కరువైంది. ఎంపీడీఓ బాలగణేష్ ఆధ్వర్యంలో శనివారం పన్నూరు, సూరికాపురంలో నవనిర్మాణ దీక్షలు జరిగాయి. కానీ ఎక్కడా జనం పాల్గొనకపోవడంతో సభలు వెలవెలబోయాయి.
అందరికీ అండగా ఉంటాం...
పుత్తూరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించి అండగా ఉంటామని ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ పేర్కొన్నారు. శనివారం పుత్తూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నవనిర్మాణదీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు తాను, తన కుమారుడు గాలి జగదీష్ అండగా ఉంటామని వ్యాఖ్యానించారు. దీంతో స్థానిక టీడీపీ వర్గాల్లో అలజడి నెలకొంది. పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ పేరును ప్రస్తావించకపోవడంపై ఆయన వర్గీయులు కంగుతిన్నారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ చంద్రన్న బీమా, పింఛన్ల పథకాలు ప్రజల మన్ననలు పొందాయన్నారు. నవనిర్మాణదీక్షలో భాగంగా అందరి చేత మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ భవానీహర్ష, వైఎస్ చైర్మన్ ఆనంగి ఆనంద్, మాజీ చైర్మన్ కరుణాకరన్, మాజీ వైస్ చైర్మన్ ప్రతాప్‌రాజు, భాస్కర్, గణేష్, నాయకులు జయప్రకాష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment