బూత్‌కమిటీల సమావేశంలో మట్లాడుతున్న ఎమ్మెల్యే రోజా
నగరి (నిండ్ర) : పార్టీ పటిష్టతకు బూత్ కమిటీలు చురుగ్గా వ్యవహరించాలని ఎమ్మెల్యే ఆర్‌కే రోజూ దిశానిర్దేశం చేశారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం నగరి రూరల్ మండల బూత్ కమిటీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. నియెజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ పటిష్టతకు కమిటీలు సమన్వయంతో వ్యవహరించడం వల్ల పట్టు సాధించామని, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, మరింత చురుగ్గా వ్యవహరించాల్సిన అవసరాన్ని ఆమె ప్రధానంగా ప్రస్తావించారు.
గ్రామాల్లో వైఎస్సార్‌సీపీ మద్దతుదార్ల పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నారని, ఆ విషయాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలని సూచించారు. కొత్తగా ఓటర్లను నమోదు చేయించడానికి కూడా మరింత చురుగ్గా వ్యవహరించాలని, దీనివల్ల పార్టీకి బలం చేకూరుతుందన్నారు. ఈ బాధ్యతలు తీసుకోవడంలో బూత్‌కమిటీలు శ్రద్ధ తీసుకోవాలన్నారు. అమలుకాని వాగ్దానాలతో మోసం చేసిన ప్రభుత్వ పెద్దల తీరుపై ప్రజలను మరింత చైతన్యం చేయడంతో పాటు, అధికారంలోకి రాగానే వైఎస్సార్‌సీపీ అమలు చేయనున్న నవరత్న పథకాలపై విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజల అభిమానం చూరగొనాలన్నారు.
ఆ ప్రచారం నమ్మవద్దు..
నగరి వైఎస్సార్ సీపీ అభ్యర్ధిగా తనకు టికెట్ లేదని కొందరు సాగిస్తున్న ప్రచారాన్ని నమ్మవద్దని ఎమ్మెల్యే రోజా పార్టీ శ్రేణులను కోరారు. నేను పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నా. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, శ్రేణులు పార్టీని మరింత పటిష్టం చేయాలనే తపనతోనే ఉన్నారు. తనపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని ఆమె హితవు పలికారు. రాష్ట్రంలో అధికార పార్టీని సూటిగా నిలదీసే వారిలో నేను కూడా ఒకరినని రోజా తెలిపారు. దీంతో తనపై అనవసరంగా తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని అన్నారు. నా జీవితం పార్టీకే అంకితం. జగన్ అన్నకు తోడుగా ఉంటానని స్పష్టం చేశారు. పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో నగరి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానని అన్నారు.
గెలుపే ధ్యేయం కావాలి..
నగరి నియోజగవర్గంలో పార్టీ నాయకులు కలిసికట్టుగా పనిచేయాలని వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ నాయకుడు కేజే.కుమార్ కోరారు. నగరి బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో అయన మాట్లాడారు. గ్రామ స్థాయి నుంచి నాయకులు, కమిటీ సభ్యులు పార్టీ విజయానికి మరింత పట్టుదలతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో నగరిలో రోజాను మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుని, రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకోవాల్సిన చారిత్రాత్మక అవసరం ఉందన్నారు. టీడీపీ నాయకుల అరాచకాలను ప్రజలకు వివరించి మరింత చైతన్యం చేయాలన్నారు. నగరిలో ఇసుక మాఫియా, ఎర్రచందనం అక్రమ రవాణాతో పాటు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న తీరుపై ప్రజలకు వివరించాలన్నారు. కార్యక్రమంలో నాయకులు బుజ్జిరెడ్డి, చంద్రారెడ్డి, హరిహరన్, సుధాకర్‌రెడ్డి, తిరుమలరెడ్డి, నాగయ్యనాయుడు, కృష్ణమూర్తి, పరుశురామ్, ప్రతీప్‌లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment