faild
-
చేతులెత్తేసిన కాంగ్రెస్
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: శాసనసభ ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి కాంగ్రెస్ పార్టీ తేరుకోలేక పోతోంది. అసెంబ్లీ ఫలితాల అనంతరం ఓటమిని అంగీకరిస్తూనే... స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తామని చెప్పిన పలువురు ఓడిపోయిన అభ్యర్థులు ఆ దిశగా చేసిన ప్రయత్నాలేవీ లేవు. ఒకరిద్దరు నాయకులు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసే బలమైన అభ్యర్థులకు ఆర్థిక సాయం అందించి ప్రోత్సహిస్తున్నారే తప్ప అనేక చోట్ల ఆ పార్టీ ఉనికి ప్రశ్నార్థకమైంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 1503 పంచాయతీలకు ఎన్నికలు జరుగుతుండగా, మొదటి విడత 511 పంచాయతీలకు ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఈ మొదటి విడత ఎన్నికల్లో ఏకంగా 133 పంచాయతీల సర్పంచి స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. వీరిలో మెజారిటీ స్థానాలు టీఆర్ఎస్ బలపరిచిన నాయకులే కావడం గమనార్హం. ఇక ఎన్నికలు జరిగిన 378 పంచాయతీల్లో కూడా టీఆర్ఎస్ వాటా 80 శాతానికి పైగానే ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవం, ఎన్నికలు జరిగిన స్థానాలు కలుపుకొని గెలిచింది కేవలం 62 పంచాయతీలే. అంటే మొత్తం పంచాయతీల్లో 12 శాతం మాత్రమే ఆ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ కన్నా స్వతంత్ర అభ్యర్థులు ఎక్కువ సీట్లలో గెలుపొందడం విశేషం. ఆసక్తి చూపని కాంగ్రెస్ నేతలు శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందని భావించిన సీట్లలో కూడా గులాబీ జెండా ఎగరడంతో పలు నియోజకవర్గాల్లో పోటీ చేసిన అభ్యర్థులు జీర్ణించుకోలేక పోయారు. కోట్లాది రూపాయలు వెచ్చించినా, ఫలితం నిరాశపర్చడంతో తేరుకోవడం లేదు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రభుత్వం కూడా పూర్తిస్థాయిలో కొలువు తీరకముందే రాష్ట్ర ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తుండడంతో పోటీ చేసిన అభ్యర్థులు పెద్దగా ఆసక్తి చూపలేదు. కొన్ని గ్రామాల్లో తమకు నమ్మకస్తులని భావించిన నాయకులు, గెలిచే అవకాశం ఉన్న వారికి మాత్ర మే కొంత మేర అందుబాటులో ఉంటున్నారు. మొదటి విడత ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం వీయగా, రెండు, మూడవ విడతల్లో సైతం అదే పరిస్థితి పునరావృతం అవుతుందని తెలుస్తోంది. రెండు, మూడు విడతల్లో ఏకగ్రీవం అయిన సర్పంచు స్థానాల్లో 90 శాతం వరకు టీఆర్ఎస్ అభ్యర్థులే ఉండడంతో ఎన్నికలు జరిగే గ్రామాల్లో కూడా అదే తీరు ఉండబోతుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పంచా యతీ ఎన్నికలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం గమనార్హం. కాంగ్రెస్‌కు బలమైన పంచాయతీల్లో సైతం... శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ ఇచ్చిన స్థానాలపై కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు కన్నేశారు. ఈ మేరకు ఆ పంచాయతీలను కూడా కైవసం చేసుకునేందుకు పావులు కదిపారు. ఆసిఫాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్కు ధీటుగా పోటీ ఇచ్చిన కాంగ్రెస్, స్వల్ప మెజారిటీతో విజయం సాధించింది కూడా. ఇక్కడ అత్రం సక్కు ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, రెండు, మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌కు ఒకటి రెండు మాత్రమే దక్కడం గమనార్హం. ఓడిపోయినప్పటికీ, మాజీ ఎమ్మెల్యే కోవ లక్ష్మి పంచాయతీలను కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేశారు. బలమైన అభ్యర్థులను టీఆర్ఎస్ మద్ధతుదారులుగా పోటీలో నిలిపారు. అలాగే అసెంబ్లీ ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చిన నిర్మల్, బోథ్ నియోజకవర్గాలలో సైతం పంచాయతీలు టీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ దక్కాయి. బెల్లంపల్లిలో బీఎస్పీ నామమాత్రంగా మిగిలిపోయింది. 101 స్థానాలకు ఎన్నికలు జరిగితే బీఎస్పీ పేరుతో మాజీ మంత్రి గడ్డం వినోద్ మద్దతిచ్చిన 10 మంది మాత్రమే గెలిచారు. మిగతా అన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులే సర్పంచులుగా గెలిచారు. మూడవ విడత నామినేషన్ల పర్వం ముగిసిన తరువాత పరిస్థితిని గమనిస్తే 25, 30 తేదీల్లో జరిగే ఎన్నికల్లో సైతం టీఆర్ఎస్ హవానే కొనసాగే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కాగా స్వతంత్రులుగా గెలిచిన సర్పంచులు కూడా టీఆర్ఎస్ వైపే మొగ్గు చూపనుండడం, గ్రామాల అభివృద్ధికి అవసరమైన నిధుల కోసం కాంగ్రెస్ సర్పంచులు సైతం తమవైపే వస్తారని ఎమ్మెల్యేలు ఆశాభావంతో ఉండడంతో గ్రామాల్లోని పాలకమండళ్లలో కూడా మరో ఐదేళ్ల వరకు గులాబీ గుబాలింపు తప్పదని అర్థమవుతోంది. -
వెలవెలబోయిన నవనిర్మాణ దీక్షలు
నగరి : నవనిర్మాణ దీక్ష పేరిట ప్రభుత్వం నిర్వహించిన శిబిరాలు వెలవెలబోయాయి. నగరి మున్సిపల్ పరిధిలోని 1, 25, 26, 27 వార్డులకు కొండచుట్టు మండపం వద్ద, 3, 4, 5, 6, 22, 23, 24 వార్డులకు పీసీఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నవనిర్మాణ దీక్షా శిబిరాలు ఏర్పాటు చేశారు. వీటి నిర్వహణకు సూపర్వైజర్లుగా మేనేజర్ రవికుమార్, ఆర్ఓ ఇమ్రాన్ ఖాన్‌ను నియమించారు. ఉదయాన్నే వీరు షామియానాలు, చైర్లు వేసి దీక్షా శిబిరాన్ని సిద్ధం చేశారు. కానీ 11 గంటల వరకు కూడా జనం శిబిరాల వద్ద ఎక్కడా కనిపించలేదు. కౌన్సిలర్లు కూడా రాలేదు.. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవనిర్మాణ దీక్షల్లో అధికారులతో పాటు ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చాయి. పలువురు కౌన్సిలర్లు కూడా హాజరుకాలేదు. దీంతో అధికారులు ఉన్న జనంతో మమ అంటూ నవనిర్మాణ దీక్షా శిబిరాలను ముగించేశారు. నేలపై కూర్చుని టీడీపీ నాయకుల నిరసన కొండచుట్టు మండపం వద్ద ఏర్పాటు చేసిన నవనిర్మాణ దీక్షా శిబిరంలో కమిషనర్, తహసీల్దార్ గైర్హాజరయ్యారంటూ 1వ వార్డుకు చెందిన కౌన్సిలర్ లత, టీడీపీ నాయకులు చలపతి ఆగ్రహానికి గురయ్యారు. ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ శిబిరాలకు అధికారులే రాకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు ఎవరు సమాధానం చెబుతారన్నారు. 1వ వార్డులో ప్రజలకు పట్టాలు ఇవ్వలేదని, తాగునీరు, పారిశుద్ధ్యం సమస్య ఉందని అధికారులు రాకుంటే వీటిని ఎవరికి చెప్పుకోవాలన్నారు. వేదికపై వారికి ఏర్పాటు చేసిన సీట్లను వదిలి నేలపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. నవనిర్మాణ దీక్షకు సందన కరువు విజయపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా చేపట్టిన నవనిర్మాణ దీక్షకు ప్రజలను నుంచి స్పందన పూర్తిగా కరువైంది. ఎంపీడీఓ బాలగణేష్ ఆధ్వర్యంలో శనివారం పన్నూరు, సూరికాపురంలో నవనిర్మాణ దీక్షలు జరిగాయి. కానీ ఎక్కడా జనం పాల్గొనకపోవడంతో సభలు వెలవెలబోయాయి. అందరికీ అండగా ఉంటాం... పుత్తూరు: అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించి అండగా ఉంటామని ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ పేర్కొన్నారు. శనివారం పుత్తూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట నవనిర్మాణదీక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలకు తాను, తన కుమారుడు గాలి జగదీష్ అండగా ఉంటామని వ్యాఖ్యానించారు. దీంతో స్థానిక టీడీపీ వర్గాల్లో అలజడి నెలకొంది. పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ పేరును ప్రస్తావించకపోవడంపై ఆయన వర్గీయులు కంగుతిన్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చంద్రన్న బీమా, పింఛన్ల పథకాలు ప్రజల మన్ననలు పొందాయన్నారు. నవనిర్మాణదీక్షలో భాగంగా అందరి చేత మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబు ప్రతిజ్ఞ చేయించారు. డీఎస్పీ భవానీహర్ష, వైఎస్ చైర్మన్ ఆనంగి ఆనంద్, మాజీ చైర్మన్ కరుణాకరన్, మాజీ వైస్ చైర్మన్ ప్రతాప్‌రాజు, భాస్కర్, గణేష్, నాయకులు జయప్రకాష్ పాల్గొన్నారు. -
నవ నిర్మాణ దీక్ష.. నవ్వులపాలు
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమం కడప నగరంలో నవ్వులపాలయ్యింది. జనం లేక ఆ సభలు వెలవెలబోయాయి. కడప నగరపాలక సంస్థ పరిధిలో 21 ప్రాంతాల్లో నవనిర్మాణ దీక్ష వేదికలు ఏర్పాటు చేశారు. 44వ డివిజన్ చెమ్ముమియ్యాపేటలో కలెక్టర్ హరికిరణ్ పాల్గొనగా మిగతా ప్రాంతాల్లో కార్పొరేషన్‌కు చెందిన నోడల్ ఆఫీసర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఒక్క సభకూ పట్టుమని పదిమంది ప్రజలు రాకపోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు. ఖాళీ కుర్చీలు వేసి, వాటిముందు అధికారులు కూర్చున్నారు. సభలకు వచ్చిన వారికి 2వ తేది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం–విభజన హామీల అమలు అనే అంశంపై చర్చ చేపట్టి, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు, నృత్యాలు నిర్వహించి బహుమతులు అందజేయాల్సి ఉంది. అయితే పాఠశాలలకు సెలవులు కావడంతో విద్యార్థులుగానీ, ఇటు తల్లిదండ్రులు గానీ ఈ కార్యక్రమాలకు హాజరు కాలేదు. దీంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణపై అధికారులకు అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా, జనం లేకపోవడంతో వేచి చూసి చూసి అధికారులు మధ్యాహ్నానికే చాప చుట్టేశారు. బాడుగ వృథా అన్ని డివిజన్లలో తప్పనిసరిగా నవనిర్మాణ దీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. 21 ప్రాంతాల్లో వేదికలు, కుర్చీలు, షామియానాలు, ఇతర ఖర్చులు భరించి ఏర్పాటు చేశారు. మొదటిరోజే జనం రాకపోవడంతో వాటికి బాడుగ వృథా అయ్యే పరిస్థితి ఏర్పడింది. ముఖం చాటేసిన టీడీపీ కార్పొరేటర్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అటు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు, ఇటు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ముఖం చాటేశారు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు కానివారు వేదికలు ఎక్కినా జనం లేకపోవడంతో వారు కూడా మెల్లగా జారుకున్నారు. కడప నగరపాలక సంస్థ, ఒక రెండు, మూడు శాఖల అధికారులు మినహా తక్కిన అధికారులు, సిబ్బంది కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. 4,5,6, 9,10 డివిజన్లలో నిర్వహించిన సభల్లో జనం లేక 11 గంటలకే అన్నీ కుర్చీలు ఎత్తేశారు. ఈ రెండు డివిజన్లలోనూ టీడీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. మొత్తంపైన ప్రతిచోటా నవనిర్మాణ దీక్ష అభాసుపాలైంది. -
హామీలను విస్మరించిన ప్రభుత్వాలు
నిర్మల్‌టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించాయని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి రాజన్న అన్నారు. నిర్మల్‌రూరల్ మండలంలోని మంజులాపూర్‌లో గ్రామ ప్రజల సమస్యలను ఆయన శనివారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2014 సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలు పూర్తిగా విస్మరించాయని విమర్శించారు. నాలుగేళ్ల నుంచి ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నాయని ఆరోపించారు. డబ్బే ప్రధాన లక్ష్యం చేసుకుని ప్రజాసంక్షేమాన్ని విస్మరిస్తున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బహుజనులంతా ఏకమై బీఎస్పీనే గెలిపించాలని కోరారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేసేందుకు ఈ నెల 8 నుంచి జోనల్ స్థాయి పదాధికారుల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా అధ్యక్షుడు బాపురావు, నాయకులు సాయన్న, ప్రకాష్, ముత్యం, నాగరావు, దిగంబర్ పాల్గొన్నారు. -
చంద్రన్న.. పెళ్లికానుక ఏదన్నా..?
ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీ చాలా పథకాలకు టీడీపీ ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత మంగళం పాడేసింది. హామీలు గుప్పించి అమలు చేయకుండా ప్రజలను మోసగించిన పథకాల్లో చంద్రన్న పెళ్లికానుక ఒకటి. పథకం లబ్ధిని ఆశించిన అర్హులు నిరాశ చెందుతున్నారు. ప్రకటనలు చూసి మోసపోయామని నిట్టూరుస్తున్నారు. పాకాల : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్లకు ఎరవేసేందుకు గత ఏడాది అక్టోబర్‌లో చంద్రబాబునాయుడు ఆర్భాటంగా చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆయా వర్గాల్లో కుటుంబంలోని యువతుల వివాహానికి నగదు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. అయితే పదవీ కాలం దాదాపుగా పూర్తి కావస్తున్నా నేటికీ ఆ పథకం జాడ కనపించడం లేదని అర్హులు వాపోతున్నారు. పథకం వివరాలు... చంద్రన్న పెళ్లికానుక పథకంలో లబ్ధిపొందాలంటే ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన యువతికి 18 ఏళ్లు, యువకుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. తగిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేలు, బీసీలకు రూ.35 వేలు, మైనారిటీలకు రూ.30 వేలు పెళ్లి కుమార్తె ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ పథకం గురించి తెలుసుకున్న పెళ్లి చేసుకునే యువతీ యువకులు దరఖాస్తు అందజేసేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. విధివిధానాలు రూపొందించకపోవడంతో దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకోవాలో తెలియక, దరఖాస్తుదారులకు ఏ చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. పెళ్లి ముహూర్తాల జోరు.. ఈనెలలో అధిక సంఖ్యలో ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ పథకం అమలు చేసి ఉంటే చాలా మందికి ఉపయోగకరంగా ఉండేదని అర్హులు అంటున్నారు. పథకాన్ని ప్రవేశ పెట్టిన తరువాత అమలు చేయకుండా ఆలస్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిలాగా ఈ పథకానికి కూడా గ్రహణం పట్టిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాల్లేవ్.. చంద్రన్న పెళ్లికానుక పథకానికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు అందలేదు. అందిన వెంటనే ప్రచారం నిర్వహించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇప్పటివరకు మండలంలో ఇద్దరు కల్యాణమిత్రలను ఏర్పాటు చేశాం, వారికి శిక్షణ కూడా ఇచ్చాం. -
మహిళలపై దాడులు అరికట్టడంలో విఫలం
ప్రగతిశీల మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.విష్ణుమ్మ తెనాలిటౌన్: రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రగతిశీల మహిళ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు ఎన్.విష్ణుమ్మ విమర్శించారు. మహిళల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న వ్యతిరేక విధానాలకు నిరసనగా నిర్వహిస్తున్న సదస్సుల్లో భాగంగా రూరల్ మండలం కఠెవరంలోని మహిళ సంఘం కార్యాలయంలో శుక్రవారం సదస్సు ఏర్పాటు చేశారు. విష్ణుమ్మ మాట్లాడుతూ అధికారంలోకి వస్తే మద్యం షాపులు తొలగిస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాకా గ్రామీణ ప్రాంతాల్లో వీధికో మద్యం షాపునకు లైసెన్స్ ఇచ్చి మహిళల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళ సాధికారత పేరుతో మహిళలను మోసం చేస్తున్నారన్నారు. మార్చి 8వ తేదీ మహిళ దినోత్సవాన్ని శ్రామిక మహిళ పోరాట దినోత్సవంగా జరపాలని పిలుపునిచ్చారు. మహిళా సంఘం జిల్లా కార్యదర్శి శీలం ఏసమ్మ మాట్లాడుతూ మహిళలకు సమాన హక్కులు కల్పించి అన్ని రంగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. సదస్సులో డి.శివపార్వతి, కృష్ణావేణి, రమణమ్మ, సుబ్బలక్ష్మి, కార్యకర్తలు పాల్గొన్నారు.