
ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీ చాలా పథకాలకు టీడీపీ ప్రభుత్వం గద్దెనెక్కిన తరువాత మంగళం పాడేసింది. హామీలు గుప్పించి అమలు చేయకుండా ప్రజలను మోసగించిన పథకాల్లో చంద్రన్న పెళ్లికానుక ఒకటి. పథకం లబ్ధిని ఆశించిన అర్హులు నిరాశ చెందుతున్నారు. ప్రకటనలు చూసి మోసపోయామని నిట్టూరుస్తున్నారు.
పాకాల : ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఓట్లకు ఎరవేసేందుకు గత ఏడాది అక్టోబర్‌లో చంద్రబాబునాయుడు ఆర్భాటంగా చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని ప్రవేశ పెట్టారు. ఆయా వర్గాల్లో కుటుంబంలోని యువతుల వివాహానికి నగదు ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు. అయితే పదవీ కాలం దాదాపుగా పూర్తి కావస్తున్నా నేటికీ ఆ పథకం జాడ కనపించడం లేదని అర్హులు వాపోతున్నారు.
పథకం వివరాలు...
చంద్రన్న పెళ్లికానుక పథకంలో లబ్ధిపొందాలంటే ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన యువతికి 18 ఏళ్లు, యువకుడికి 21 ఏళ్లు నిండి ఉండాలి. తగిన ధ్రువీకరణ పత్రాలు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు రూ.50 వేలు, బీసీలకు రూ.35 వేలు, మైనారిటీలకు రూ.30 వేలు పెళ్లి కుమార్తె ఖాతాలో జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది. ఈ పథకం గురించి తెలుసుకున్న పెళ్లి చేసుకునే యువతీ యువకులు దరఖాస్తు అందజేసేందుకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. విధివిధానాలు రూపొందించకపోవడంతో దరఖాస్తులు ఎప్పటి నుంచి తీసుకోవాలో తెలియక, దరఖాస్తుదారులకు ఏ చెప్పాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
పెళ్లి ముహూర్తాల జోరు..
ఈనెలలో అధిక సంఖ్యలో ముహూర్తాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ పథకం అమలు చేసి ఉంటే చాలా మందికి ఉపయోగకరంగా ఉండేదని అర్హులు అంటున్నారు. పథకాన్ని ప్రవేశ పెట్టిన తరువాత అమలు చేయకుండా ఆలస్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిలాగా ఈ పథకానికి కూడా గ్రహణం పట్టిందని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాల్లేవ్..
చంద్రన్న పెళ్లికానుక పథకానికి సంబంధించి ఎటువంటి ఆదేశాలు అందలేదు. అందిన వెంటనే ప్రచారం నిర్వహించి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇప్పటివరకు మండలంలో ఇద్దరు కల్యాణమిత్రలను ఏర్పాటు చేశాం, వారికి శిక్షణ కూడా ఇచ్చాం.

నరసింహులు, ఏపీఎం, పాకాల