జయనగర్ కాలనీ జెడ్పీ హైస్కూల్‌లో మధ్యాహ్నానికే కుర్చీలు ఎత్తేసిన దృశ్యం
కడప కార్పొరేషన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమం కడప నగరంలో నవ్వులపాలయ్యింది. జనం లేక ఆ సభలు వెలవెలబోయాయి. కడప నగరపాలక సంస్థ పరిధిలో 21 ప్రాంతాల్లో నవనిర్మాణ దీక్ష వేదికలు ఏర్పాటు చేశారు. 44వ డివిజన్ చెమ్ముమియ్యాపేటలో కలెక్టర్ హరికిరణ్ పాల్గొనగా మిగతా ప్రాంతాల్లో కార్పొరేషన్‌కు చెందిన నోడల్ ఆఫీసర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అయితే ఒక్క సభకూ పట్టుమని పదిమంది ప్రజలు రాకపోవడంతో అధికారులు ఆశ్చర్యపోయారు.
ఖాళీ కుర్చీలు వేసి, వాటిముందు అధికారులు కూర్చున్నారు. సభలకు వచ్చిన వారికి 2వ తేది ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం–విభజన హామీల అమలు అనే అంశంపై చర్చ చేపట్టి, ర్యాలీలు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటలు, పాటలు, నృత్యాలు నిర్వహించి బహుమతులు అందజేయాల్సి ఉంది. అయితే పాఠశాలలకు సెలవులు కావడంతో విద్యార్థులుగానీ, ఇటు తల్లిదండ్రులు గానీ ఈ కార్యక్రమాలకు హాజరు కాలేదు. దీంతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణపై అధికారులకు అర్థం కాక తలలు పట్టుకున్నారు. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉండగా, జనం లేకపోవడంతో వేచి చూసి చూసి అధికారులు మధ్యాహ్నానికే చాప చుట్టేశారు.
బాడుగ వృథా
అన్ని డివిజన్లలో తప్పనిసరిగా నవనిర్మాణ దీక్ష నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో అధికారులు ఆ మేరకు ఏర్పాట్లు చేశారు. 21 ప్రాంతాల్లో వేదికలు, కుర్చీలు, షామియానాలు, ఇతర ఖర్చులు భరించి ఏర్పాటు చేశారు. మొదటిరోజే జనం రాకపోవడంతో వాటికి బాడుగ వృథా అయ్యే పరిస్థితి ఏర్పడింది.
ముఖం చాటేసిన టీడీపీ కార్పొరేటర్లు
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అటు వైఎస్‌ఆర్‌సీపీ కార్పొరేటర్లు, ఇటు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు ముఖం చాటేశారు. కొన్ని చోట్ల ప్రజాప్రతినిధులు కానివారు వేదికలు ఎక్కినా జనం లేకపోవడంతో వారు కూడా మెల్లగా జారుకున్నారు. కడప నగరపాలక సంస్థ, ఒక రెండు, మూడు శాఖల అధికారులు మినహా తక్కిన అధికారులు, సిబ్బంది కూడా అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. 4,5,6, 9,10 డివిజన్లలో నిర్వహించిన సభల్లో జనం లేక 11 గంటలకే అన్నీ కుర్చీలు ఎత్తేశారు. ఈ రెండు డివిజన్లలోనూ టీడీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తుండడం గమనార్హం. మొత్తంపైన ప్రతిచోటా నవనిర్మాణ దీక్ష అభాసుపాలైంది.
Comments
Please login to add a commentAdd a comment