ఎమ్మెల్యే ప్రసంగిస్తున్న సమయంలో ఖాళీగా ఉన్న కుర్చీలు ,ఎవరూ బయటకు వెళ్లకుండా గేట్లు వేస్తున్న వ్యక్తి
ఒంగోలు టౌన్: నవ నిర్మాణ దీక్షను నిర్బంధ దీక్షగా మార్చేశారు. నవ నిర్మాణ దీక్షలో భాగంగా మంగళవారం స్థానిక రామనగర్‌లోని మున్సిపల్ హైస్కూల్‌లో కార్యక్రమ ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు కార్యక్రమం ప్రారంభవుతుందని, అందులో భాగంగా అర్హులైన వారికి సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేస్తామని చెప్పడంతో అనేకమంది వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులను రప్పించారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి నారాయణతో పాటు జిల్లాకు చెందిన మరో మంత్రి శిద్దా రాఘవరావు వస్తున్నారంటూ వారిని బలవంతంగా కూర్చోబెట్టారు. నిముషాలు గంటలుగా మారిన ఇద్దరు మంత్రుల ఆచూకీ లేదు. చివరకు మంత్రులు నవ నిర్మాణ దీక్షకు హాజరు కావడంలేదని తేలింది. దీంతో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌రావు వస్తున్నారంటూ కార్యక్రమానికి వచ్చిన వారిని మరోసారి బలవంతంగా కూర్చోపెట్టారు. సమీపంలోనే నివాసముంటున్న శాసనసభ్యుడు దామచర్ల సాయంత్రం 5.30గంటల సమయంలో తీరికగా వచ్చారు.
ఎర్రటి ఎండలో మధ్యాహ్నం నుంచి ఎదురుచూసిన వృద్ధులు అన్ని గంటలు షామియానా కింద కూర్చోలేక పైకి లేచ్చారు. నవ నిర్మాణ దీక్షలో శాసనసభ్యుడు పాల్గొన్న అనంతరం ఆయనతో కార్యక్రమాలు నిర్వహించి ఉంటే వచ్చిన కొద్దిమంది అలాగే ఉండేవారు. అయితే తెలుగుదేశం పార్టీకి చెందిన నాయకులు వరుసపెట్టి ప్రసంగాలు చేస్తుండటంతో అప్పటికే సత్తువ కోల్పోయి ఉన్న వృద్ధులు, వితంతువులు ఇక కూర్చోవడం తమవల్ల కాదంటూ బయటకు వెళ్లేందుకు గుంపులుగా లేచారు. ఇది గమనించిన వేదికపై ఉన్న నగరపాలక సంస్థ అధికారులు వారిని కూర్చోపెట్టాలంటూ తమ సిబ్బందిని ఆదేశించారు. ‘ఇక్కడే ఉంటే ప్రాణాలు పోతాయంటూ’ పలువురు వృద్ధులు వారితో వాదనకు దిగుతూ అక్కడ నుంచి బయటకు వెళ్లారు. ఉన్న కొద్దిపాటి మంది వారిని అనుసరిస్తూ బయటకు వెళ్లేందుకు లేవడంతో మున్సిపల్ హైస్కూల్ గేట్లను మూసివేశారు. ఎవరూ బయటకు వెళ్లకుండా అక్కడ ఒక వ్యక్తిని ఉంచారు.
అయినా కొంతమంది మహిళలు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, నగర పాలక సంస్థలో ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని పంపించి మహిళలు ఎవరూ బయటకు వెళ్లకుండా చూడాలని సూచించారు. ఇప్పటివరకు తాము ఓపికతో ఉన్నామని, ఇక తమవల్ల కాదంటూ ఒక మహిళ తన ఇద్దరు పిల్లలతో బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా, ఔట్ సోర్సింగ్ మహిళా ఉద్యోగిని ఆమెతో వాదన పెట్టుకొంది. చివరకు ఆ మహిళ తన ఇద్దరు చిన్న బిడ్డలను తీసుకొని బయటకు వెళ్లింది. నవ నిర్మాణ దీక్షకు హాజరైన వారు ఒకరొకరుగా బయటకు వెళుతుండటంతో ఏం చేయాలో పాలుపోని నగర పాలక సంస్థ అధికారులకు చివరకు ఆ స్కూల్‌లో ఉన్న విద్యార్థులను బలవంతంగా కూర్చోపెట్టారు.
ఇంత జరుగుతున్నా శాసనసభ్యుడు దామచర్ల ఆంజనేయులు మాత్రం తమ పార్టీ నాయకులు చేసే ప్రసంగాలను వింటూ కూర్చున్నారు తప్పితే, ముందుగా ఆయన ప్రసంగం చేసి ఉంటే నవ నిర్మాణ దీక్ష నిర్బంధ దీక్షగా మారి ఉండేది కాదని పలువురు వ్యాఖ్యానించడం గమనార్హం. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల అభివృద్ధి కార్యక్రమాలను వివరించి 830 మందికి సామాజిక భద్రత పింఛన్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ ఇన్‌చార్జి కమిషనర్ బ్రహ్మయ్య, మున్సిపల్ ఇంజినీర్ సుందరరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment