
ఏపీ నంబర్ వన్
2050 నాటికి ప్రపంచంలో మనమే అగ్రగామి
నవ నిర్మాణ దీక్ష ముగింపులో సీఎం చంద్రబాబు
సాక్షి ప్రతినిధి, కాకినాడ : ‘మీ తలరాతలు మారుస్తా.. మీ తలసరి ఆదాయాన్ని పెంచుతా.. ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్‌ను అగ్రస్థానంలో నిలబెడతా.. 2050 నాటికి రాష్ట్రంలో ప్రతి ఒక్కరి తలసరి ఆదాయం కోటి ఏడు లక్షల రూపాయలను అందించి తెలుగోడి సత్తా చూపిస్తా’నని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కృష్ణా జిల్లా విజయవాడ బెంజ్ సర్కిల్‌లో చంద్రబాబు ప్రారంభించిన నవ నిర్మాణ దీక్షను తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో గురువారం ముగించారు. సభకు హాజరైన జనంతో మహా సంకల్ప దీక్ష పేరుతో సీఎం ప్రతిజ్ఞ చేయించారు.
అదే సందర్భంలో పొగరహిత వంట ఇంధన వినియోగ రాష్ట్రంగా ప్రకటించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2022 నాటికి దేశంలోని మూడు రాష్ట్రాల్లో ఏపీని ఒకటిగా చేసి తలసరి ఆదాయాన్ని మూడు లక్షలకు పెంచుతానన్న చంద్రబాబు.. 2029 నాటికి దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా చేసి తలసరి ఆదాయాన్ని రూ.10 లక్షలకు తీసుకు వెళతానన్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తూ 2050 నాటికి ప్రపంచంలోనే ఏపీని ముందుకు తీసుకుపోయి తలసరి ఆదాయాన్ని కోటి ఏడు లక్షలకు పెంచుతానని మాట ఇస్తున్నానన్నారు.
రాబోయే వెయ్యి, రెండువేల ఏళ్ల వరకు చరిత్రలో నిలిచిపోయేలా అమరావతి రాజధానిని నిర్మిస్తున్నానని చెప్పుకొచ్చారు. ఇందుకోసం చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌ను ఒక వినూత్నమైన కార్యక్రమంగా అభివర్ణించారు. ఒక్క పైసా తీసుకోకుండా 33 వేల 500 ఎకరాలను అప్పజెప్పి రూ.40 వేల కోట్ల ఆస్తిని రాష్ట్రానికి సమకూర్చారన్నారు. అందుకే అమరావతిని ప్రపంచ స్థాయి గ్రీన్‌ఫీల్డ్ సిటీని చేసి చూపిస్తానని చెప్పారు.
అమ్మకు వందనం పథకం...
అ అంటే అమ్మ, ఆమెను ఎంతో గౌరవించాలనే ఉద్ధేశంతో తల్లులకు పాదాభివందనం చేసేలా ‘అమ్మకు వందనం’ అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సీఎం ప్రకటించారు. ఈ పథకం ద్వారా అమ్మకు బడి పిల్లలతో వందనం చేయించే ప్రక్రియ చేపడుతున్నామని చెప్పారు.
2018కల్లా కాఫర్ డ్యాం పూర్తి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా చేపట్టిన కాఫర్ డ్యామ్ పనులను 2018 నాటికి పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం కాఫర్‌డ్యాం పనులకు శంకుస్థాపన చేశారు. ఇందులో భాగంగా ఈ పనులు చేపట్టే జెట్ గ్రౌండింగ్ యంత్రాన్ని ప్రారంభించారు. అక్కడ నిర్మించే ఐకానిక్ బ్రిడ్జికీ శంకుస్థాపన చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాఫర్ డ్యాంను వందేళ్లపాటు వరదల్ని తట్టుకునే సామ ర్థ్యంతో నిర్మించేందుకు చర్యలు తీసుకున్నట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి 70 శాతం మట్టిపనులు పూర్తయ్యాయని, మిగిలిన పనుల్నీ అనుకున్న సమయంకంటే ముందే పూర్తి చేస్తామని తెలిపారు. 2018కి మొదటిదశ పనులు పూర్తవుతాయని, 2019కి ప్రాజెక్టును పూర్తి చేయడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. కాగా, పట్టిసీమద్వారా ఈ సీజన్‌లో 100 టీఎంసీల నీటిని కృష్ణాడెల్టాకు మళ్లిస్తామని ఆయన పేర్కొన్నారు. పురుషోత్తమపట్నం ఎత్తిపోతలను ఆగస్టు 15న ప్రారంభిస్తామని, చింతలపూడి ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులు వేగవంతం చేస్తామని చెప్పారు.