దేవుడు ఆదేశించాడు..నేను చేస్తున్నా
- భగవంతుడే రాజధాని, పోలవరం కట్టమన్నాడు
- నవ నిర్మాణ దీక్ష రెండోరోజు సదస్సులో చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధి చేయమని భగవంతుడు తనను ఆదేశించాడని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఒక రాజధానిని కట్టమని, ఒక పోలవరం ప్రాజెక్టును కట్టమని దేవుడు తనను ఆదేశించాడని అన్నారు. అందుకే తాను కష్టపడుతున్నానని చెప్పుకొచ్చారు. నవ నిర్మాణ దీక్షల రెండోరోజు శనివారం విజయవాడలోని ‘ఏ’ కన్వెన్షన్ హాలులో విభజన చట్టం హామీల అమలుపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. మూడేళ్ల క్రితం కాంగ్రెస్ అడ్డంగా మన పొట్ట కొట్టిందని అన్నారు.
ఈ మూడేళ్లలో రాష్ట్రం దేశంలోని మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగా అభివృద్ధి చెందినా ఆదాయం మాత్రం బాగా తక్కువగా ఉందని చెప్పారు. బాధాకరంగా జరిగిన విభజన వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. చేయాల్సిన నష్టమంతా చేసి ఇంకా గాయం మానక ముందే దాని మీద కారం చల్లడానికే రాహుల్‌గాంధీ వస్తున్నాడన్నారు. మన పొట్టకొట్టిన కాంగ్రెస్‌ను శాశ్వతంగా భూస్థాపితం చేయాలని, వారికి ఎవరూ సహకరించకూడదని, ఆ పార్టీ మీటింగ్‌కు వెళితే రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించినట్లేనని చెప్పారు.
కేంద్రం నుంచి వచ్చింది రూ.3,980 కోట్లే ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.3,980 కోట్లు వచ్చాయని చంద్రబాబు చెప్పారు. రాజధానికి 1,500 కోట్లు, వెనుకబడిన జిల్లాలకు రూ.1,050 కోట్లు, విజయవాడ, గుంటూరు డ్రెయిన్లకు వెయ్యి కోట్లు ఇచ్చారన్నారు. 14వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, దానికి సమానమైన ప్యాకేజీ ఇస్తామనడంతో ఒప్పుకున్నానన్నారు. పోలవరం కాఫర్ డ్యామ్‌కు ఈ నెల 8వ తేదీన శంకుస్థాపన చేస్తున్నట్లు తెలిపారు.