నవనిర్మాణ దీక్షలో పాల్గొన్న ఐదో వార్డు కౌన్సిలర్ వెంకటరావు తెల్ల చొక్కా వ్యక్తి
పార్వతీపురం టౌన్ : టీడీపీ చేపడుతున్న నవనిర్మాణ దీక్షలు వేధింపుల దీక్షలుగా మారుతున్నాయి. దీక్షలకు జనాన్ని తీసుకురావాలని ప్రజాప్రతినిధులు అంగన్‌వాడీ, వెలుగు, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ఉద్యోగులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు.
జనాలను తీసుకురాని సిబ్బందిపై దుర్భాషలాడుతున్నారు. ఇందులో భాగంగా పార్వతీపురం పురపాలక సంఘంలోని 5వ వార్డులో సోమవారం జరిగిన నవనిర్మాణ దీక్ష వేదిక సాక్షిగా అదే వార్డుకు చెందిన ఓ అంగన్‌వాడీ కార్యకర్తపై అసభ్యకరంగా మాట్లాడిన వార్డు కౌన్సిలర్ చొక్కాపు వెంకటరావును కార్యకర్త భర్త కొట్టిన సంఘటన సమావేశానికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
సమావేశంలో కౌన్సిలర్ వెంకటరావు మాట్లాడడానికి సిద్ధపడుతుండగా, బాధితురాలైన అంగన్‌వాడీ కార్యకర్త భర్త కలుగజేసుకుని మహిళలంటే అంత చులకనా నీకు.. ఎంతకాలం వేధింపులకు గురి చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకున్నాడు.
దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో టీడీపీ నాయకులు కలుగజేసుకుని కార్యకర్త భర్తను అక్కడ నుంచి పంపించివేశారు. అంతకుముందు జనాలను తీసుకురావడంలో విఫలమైందని ఆరోపిస్తూ సదరు కౌన్సిలర్ వెంటకరావు అంగన్‌వాడీ కార్యకర్తను దుర్భాషలాడారు. దీంతో బాధితురాలు ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్లిపోయింది.
రాజీ ప్రయత్నాలు
జరిగిన విషయంపై అంగన్‌వాడీ కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఎలాగైనా ఇరువర్గాలను రాజీ కుదర్చి ఫిర్యాదును ఉపసంహరించుకునేలా చేయడానికి టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.
నలిగిపోతున్న ఉద్యోగులు...
నవనిర్మాణ దీక్షలకు జనాన్ని తీసుకువచ్చే విషయంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, బీఎల్‌ఓలు, వెలుగు సిబ్బంది నలిగిపోతున్నారు. మండుతున్న ఎండలో పెడుతున్న సమావేశాలకు జనం తీసుకురావడం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే అధికార పార్టీ నాయకులు ఎక్కడ మండిపడతారోననే ఉద్దేశంతో సిబ్బంది ఏదో ఒక రకంగా ప్రజలను తీసుకువస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment