
సాక్షి, విజయవాడ : ఏపీ ఎన్జీవో ఉద్యోగ సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు మరో ఏడాదిలో రిటైరవుతున్నారని, కాబట్టి ప్రజాసేవలోకి (రాజకీయాల్లోకి) రమ్మని ఆయనను ఆహ్వానిస్తున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్‌లో చేపట్టిన నవనిర్మాణ దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తిరుమల ఆలయంలో వజ్రం పోయిందంటున్నారని, ఈ విషయంలో సీబీఐ విచారణ పేరుతో అప్రతిష్టపాలు చేయాలనుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. సాక్షాత్తు వేంకటేశ్వరస్వామిని కూడా తానే కాపాడతానని అన్నారు. సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా బీజేపీలో ఉన్నట్టే మాట్లాడుతున్నారని అన్నారు. ప్రధాని మోదీ, అమిత్ షా ఎవరు చెప్తే వాళ్లే సీఎం అవుతారని అంటున్నారని, ఇలా బీజేపీ రకరకాలుగా అందరినీ నడిపిస్తోందని విమర్శించారు. ఇవన్నీ చూస్తుంటే హీరో శివాజీ చెప్పిన ఆపరేషన్ గరుడ నిజమని అనిపిస్తోందని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు తమపై కుట్ర చేస్తున్నారని, కుట్రలో భాగంగానే పవన్ కల్యాణ్ తనపై విమర్శలు చేస్తున్నారని చంద్రబాబు అన్నారు. ‘ఇన్నాళ్లు నేను పవన్ కల్యాణ్‌కు మంచిగా కనిపించాను. కేంద్రంతో విభేదించగానే పవన్‌కు చెడ్డగా కనిపిస్తున్నాను.పవన్ కల్యాణ్‌ను ఉత్తరాంధ్ర పంపి అక్కడ రెచ్చగొడుతున్నారు. నాడు రాష్ట్ర విభజన సమయంలో పవన్ కళ్యాణ్ బయటకు వచ్చాడా? అప్పుడేమీ మాట్లాడలేదు. మోదీకి సహకరించాలని 2014లో మాతో వచ్చారు’ అని అన్నారు. బీజేపీ రమణ దీక్షితులను వాడుకుంటోందని ఆరోపించారు.