
నెలరోజుల్లో రావాల్సిందే
- నవనిర్మాణదీక్ష రెండవ రోజు కార్యక్రమంలో సీఎం
- ఎవ్వరికీ మినహాయింపుల్లేవ్
- అమరావతి నుంచే పాలన జరగాలి
సాక్షి, అమరావతి: ‘‘తాత్కాలిక సచివాలయం నెలరోజుల్లో పూర్తవుతుంది. ఎవ్వరికీ మినహాయింపుల్లేవు. తప్పకుండా అమరావతికి రావాల్సిందే. ఇక్కడి నుంచే పాలన జరగాలి. తప్పదు. అత్యవసర పరిస్థితుల్లో ఒకరిద్దరికి మినహాయింపు ఉంటుంది’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్యోగుల గురించి తేల్చిచెప్పారు. రాష్ట్రం విభజన జరిగి రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా విజయవాడ ఏ-1 కన్వెన్షన్ ప్రాంగణంలో శుక్రవారం చేపట్టిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమంలో భాగంగా సీఎం చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో ఆస్తులు, అప్పుల పంపకంలో హేతుబద్ధంగా జరగలేదన్నారు.
ఆదాయం వచ్చే ఆస్తులపై తెలంగాణకు హక్కు కల్పించారని ఆక్షేపించారు. రాయితీతోపాటు రైల్వే జోన్, ట్రైబల్ యూనివర్సిటీ, మెట్రో, దుగరాజపట్నం, కడపలో స్టీల్‌ప్లాంట్ ఇస్తామని ఇచ్చిన హామీని కేంద్రం నెరవేర్చలేదని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి రూ.700 కోట్లు ఇచ్చినట్లు తెలిపారు. పోలవరం నిర్మాణం కోసం ఇప్పటివరకు కేంద్రం రూ.850 కోట్లు ఇస్తే.. రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల వరకు ఖర్చుచేసినట్లు వివరించారు.
అనంతపురంలో అనవసర కార్యక్రమం
రాష్ట్రమంతా నవనిర్మాణ దీక్ష చేస్తుంటే ప్రతిపక్ష నాయకుడు అనంతపురంలో అనవసర కార్యక్రమం చేపట్టి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. పరిటాల రవిని హత్యచేసినప్పుడు కూడా తాను అదుపు తప్పలేదని చెప్పుకొచ్చారు.కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పింది తానేనని, అందులో భాగంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.వెయ్యికోట్లు ఇచ్చిన ఘనత తమదేనని చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 25 కేసులు పెట్టినా.. నిప్పులాంటి వాడినని నిరూపించుకున్నట్లు చెప్పుకొచ్చారు.