
అప్పులు చేసి ఇస్తున్నాం
పెన్షన్, రేషన్ కార్డుల కోసం రెండు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి మరీ లంచాలు ఇవ్వాల్సి వస్తోందని, సచివాలయానికి వచ్చి ఫిర్యాదు
కుటుంబ ఆస్థి తగాదాల కోసం పోలీసులను ఆశ్రయిస్తే లంచం తీసుకొని వారి ఎదుటి పక్షానికి వత్తాసు పలుకుతున్నారని, చివరికి వడ్డీకి అప్పు తెచ్చి రూ.500 లంచం ఇస్తే కానీ పెన్షన్ రాలేదంటూ పొద్దుటూరు నుంచి వచ్చిన శ్రీరంగ ప్రసాద్ చెప్పారు. రేషన్ కార్డులో భార్యపేరు తప్పుగా ఉందంటే ఎమ్మార్వో రూ.1,000 లంచం అడిగారని, 1100కి ఫిర్యాదు చేస్తే డబ్బులు వెనక్కి తిరిగిచ్చారే కానీ పని కాలేదని కృష్ణా జిల్లాకు చెందిన భూపతి శివశంకరరావు ఫిర్యాదు చేశారు.
ఆళ్లగడ్డ నుంచి వచ్చిన వెంకట నారాయణ కథ అయితే మరీ దారుణం. తండ్రి చనిపోతే తల్లికి వితంతు పెన్షన్ కోసం కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పని కావడం లేదని, నాన్న చనిపోయాడనడానికి ఆధారాలు కావాలంటూ వేధిస్తున్నారని, రెండు రోజులుగా మిమ్నల్ని కలుద్దామన్నా కుదరడం లేదని, చివరికి ఊరికి వెళ్లడానికి డబ్బులు లేకపోతే రాత్రంతా విజయవాడ బస్టాండ్‌లోనే పడుకున్నా అంటూ గద్గద స్వరంతో చెప్పడంతో అందరి కళ్లలో నీళ్లు తిరిగాయి. వెంకటనారాయణకు వెంటనే రూ.25 వేలు ఆర్థిక సాయం అందించారు. తాను ఎంత కష్టపడుతున్నా కొంతమంది అవినీతి అధికారుల వల్ల ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని చెప్పారు. జూన్‌లోగా లంచాలు తీసుకున్న వారందరూ ఆ మొత్తాలను వెనక్కి ఇచ్చేయాలని, జూలై నుంచి అవినితీ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.