అమలాపురంలో నవ నిర్మాణ దీక్ష సభలో ప్రసంగిస్తున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో శాసన మండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు చినరాజప్ప, కళావెంకట్రావు తదితరులు
తూర్పుగోదావరి, అమలాపురం: నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్య మంత్రిగా ప్రమాణం చేసిన నాలుగేళ్ల తరువాత చంద్రబాబునాయుడు కోనసీమ కేంద్రమైన అమలాపురంలో నిర్వహించిన నవనిర్మాణ దీక్షకు ప్రజాస్పం దన అంతంత మాత్రంగానే కనిపించిం ది. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన బాబు పర్యటన సందర్భంగా రచ్చబండ, విద్యార్థులతో ముఖాముఖి, దళితవాడ పర్యటన, నవ నిర్మాణదీక్ష బహిరంగ సభల్లో చంద్రబాబు చేసిన ప్రసంగాలు ఆకట్టుకోలేకపోయాయి. పైగా స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, అధికారులు పర్యటన షెడ్యూలు ఖరారు, చేసిన ఏర్పాట్లపై చంద్రబాబే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేయడం విశేషం.
సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఆలస్యంగా మొదలై.. ఆలస్యంగానే ముగుస్తుంది. కానీ అమలాపురంలో మంగళవారం బాబు పర్యటన పది నిమిషాలు ఆలస్యంగా మొదలై.. నిర్ణీత షెడ్యూలు ప్రకారం ముగిసింది. ఉదయం 10.15 నుంచి సాయంత్రం 5.30 వరకు అంటే 7.15 గంటలపాటు చంద్రబాబు అమలాపురం మున్సిపాలిటీ, రూరల్ మండలాల్లోనే గడిపారు. సమనస, రంగాపురం, వన్నెచింతలపూడిలో జరిగిన కార్యక్రమాలకు స్థానికుల హాజరు అంతంత మాత్రమే. పైగా బాబు పర్యటించిన దారి చాలా ఇరుకుగా ఉండడం, భారీ భద్రత, అందుకు తగ్గట్టుగా పెద్ద కాన్వాయి కావడంతో బందోబస్తుకు వచ్చిన పోలీసులు సైతం ఇబ్బంది పడ్డారు. రంగాపురంలో వీరభద్రుని ఆలయం నుంచి శివాలయం వరకు నడుచుకుని వెళ్లే సమయంలో స్వల్ప తోపులాట చోటు చేసుకుంది.
‘మీకు ఆర్గనైజేషన్ చేయడంరావడం లేదు’
రంగాపురం గ్రామదర్శిని ఏర్పాట్లపై చంద్రబాబు బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ‘మీరు చాలా ఉత్సాహంగా వచ్చారు. మీరు ప్రశాంతంగా ఉంటేనేను చెప్పేది అర్థమవుతుంది. కానీ అలా లేదు.. ఆర్గనైజేషన్ బాగుంటే ఇటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. ఎండలో మీరు ఇబ్బంది పడుతున్నారు’ అని బాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీకు ఆర్గనైజేషన్ చేయడం కూడా రావడం లేదు అని అక్కడ ప్రజాప్రతినిధులను ఉద్దేశించి అన్నారు. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో నిర్వహించే బహిరంగ సభకు జనం పెద్ద ఎత్తున వస్తారన్న అంచనాలు తప్పాయి. రంగులు వేయడం, రోడ్లు వేయడం, ఫ్లెక్స్‌లు కట్టడం వంటి ఆర్భాటాలు చేశారు తప్ప అమలాపురం నియోజకవర్గ టీడీపీ నేతలు జనాన్ని తరలించే విషయంలో పూర్తిగా విఫలమయ్యారు. చివరకు పార్టీ కార్యకర్తలు, నాయకుల హాజరు కూడా పెద్దగా లేదు. సభకు వచ్చినవారిలో మూడొంతుల మంది డ్వాక్రా మహిళలు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులే ఉన్నారు.
సభలో నేతల ప్రసంగాలకు చప్పట్లు కరువయ్యాయి. నాయకులు సైతం ప్రభుత్వం సాధించిన విషయాలను తక్కువగా చెప్పి... జగన్‌పై విమర్శలు ఎక్కువ చేశారు. చంద్రబాబు ప్రసంగం సైతం చప్పగా సాగింది. ఏకంగా 1.02 గంటల పాటు ఒకసారి, లబ్ధిదారులకు కార్లు, ఆటోలు పంపిణీ సమయంలో మరో 15 నిమషాలు చంద్రబాబు ప్రసంగించారు. తాను ఎంతో చేశానని, మరోసారి అవకాశం ఇవ్వాలని, 25 ఎంపీ స్థానాలు గెలిపించాలని చంద్రబాబు పదేపదే కోరినా జనం నుంచి పెద్దగా స్పందన లేదు. కర్ణాటకలో బీజేపీని ఓడించింది మనమే కదా తమ్ముళ్లూ అని ఒకసారి, 2019లో బీజేపీని ఓడించి కేంద్రంలో చక్రం తిప్పేది మనమే అని ఒకసారి ప్రసంగం మధ్యలో ఆపి చప్పట్ల కోసం ఎదురుచూశారు. ఈ రెండు సందర్భాల్లోనూ కార్యకర్తల నుంచి స్పందన లేకపోవడంతో చప్పట్లు కొట్టండి అని అడిగి మరీ కొట్టించుకున్నారు. బీజేపీ, వైఎస్సార్ సీపీ కలిసి పనిచేస్తున్నాయా? అని బాబు ప్రశ్నించి చేతులు ఎత్తమన్నా పెద్దగా ఎవరూ చేతులు ఎత్తలేదు. తొలి ప్రసంగం ముగిసిన తరువాత మంత్రి రాజప్ప గుర్తు చేయడంతో చంద్రబాబు అమలాపురం అభివృద్ధికి రూ.25 కోట్లు ఇస్తామన్నారు. అలాగే కోటిపల్లి– ముక్తేశ్వరం వంతెన అంశం పరిశీలిస్తానన్నారు. అంతకుమించి ఈ ప్రాంతానికి చేసేదేమీ చెప్పలేదు.
సాగుసమ్మె ప్రస్తావన
గతంలో కోనసీమ రైతులు సాగుసమ్మె చేస్తే జాతీయ స్థాయి నుంచి నేతలను తీసుకువచ్చానని, వారి కష్టాలు చూసే రుణమాఫీ చేశానన్న బాబు ఇప్పుడు మరోసారి రైతులు సాగుసమ్మెకు సిద్ధమవుతున్న విషయంపై స్పందించలేదు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం స్వామినాథన్ సిఫారసులు అమలు చేయడం లేదన్న బాబు, తాను బోనస్‌గా క్వింటాల్‌కు రూ.200 ఇస్తానన్న విషయాన్ని మరిచారు. ఏతా వాతా బాబూ పర్యటన వల్ల సమనసలో అధ్వానంగా ఉన్న రహదారి ఆధునీకరణకు నోచుకుంది. అలాగే చింతలపూడి (సమనస)లాకులు, ఎర్రవంతెన–నల్లవంతెన రోడ్డు రైలింగ్‌కు కొత్తరంగులు పడ్డాయికాని పెద్దగా ప్రయోజనం లేదని నియోజకవర్గ వాసులు చెప్పుకుంటుండడం కొసమెరుపు.
అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అధ్యక్షతన జరిగిన నవ నిర్మాణదీక్ష సభలో ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, మంత్రులు యనమల రామకృష్ణుడు, నక్కా ఆనందబాబు, సుజయ కృష్ణ రంగారావు, ఎంపీలు పండుల రవీంద్రబాబు, తోట నరసింహం, ఎమ్మెల్సీ కె.రవికిరణ్‌వర్మ, జెడ్పీ చైర్మన్ జ్యోతుల నవీన్, ఎమ్మెల్యేలు గొల్లపల్లి సూర్యారావు, పులపర్తి నారాయణమూర్తి, దాట్ల బుచ్చిబాబు, తోట త్రిమూర్తులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment