
చంద్రబాబుకు టీడీపీ ప్రజా ప్రతినిధులు ఝలక్!
విజయవాడ: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రారంభించిన నవ నిర్మాణ దీక్ష అట్టర్ ఫ్లాప్ కావడంపై ఆయన చాలా సీరియస్‌గా ఉన్నారు. రాష్ట్ర విభజనతో అన్యాయమైపోయిన ఏపీ రాష్ట్ర పునర్ నిర్మాణమే లక్ష్యంగా వారం రోజులుపాటు జరగనున్న ఈ దీక్ష తొలిరోజున పలువురు టీడీపీ ప్రజా ప్రతినిధులు గైర్హాజరై అధినేత చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. నవ నిర్మాణ దీక్షకు టీడీపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, ఇద్దరు ఎంపీలు గైర్హాజరు కావడంపై చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దీక్షకు పార్టీ నేతలే హాజరు కాకపోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేపటినుంచి జరిగే కార్యక్రమాల్లో పాల్గొనకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని టీడీపీ ప్రజా ప్రతినిధులను చంద్రబాబు హెచ్చరించారు. తొలి రోజున జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీని చీకటి దినంగా అభివర్ణించిన విషయం తెలిసిందే. పార్టీ నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. దీక్ష కోసం జనాల నుంచి విశేష స్పందన వస్తుందని భావించి దీక్షా ప్రాంగణం వద్ద భారీగా కుర్చీలు వేయగా తొలిరోజు దీక్ష ముగిసే సమయానికి కూడా కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. చంద్రబాబు ప్రసంగం దాదాపు గంటన్నర సేపు సాగడంతో ఎండ వేడిమికి తట్టుకోలేక మహిళలు అక్కడి నుంచి వెళ్లిపోయారు.