
చంద్రబాబుది నయవంచన దీక్ష
సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్నది నవ నిర్మాణ దీక్ష కాదని, నయవంచన దీక్ష అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి విమర్శించారు.
► రెండేళ్ల పాలనలో చేసిన మంచి పని లేదు
► మూడేళ్లలో ఏం చేస్తారో చెప్పే సత్తా లేదు
► వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి
రాజంపేట: సీఎం చంద్రబాబునాయుడు చేస్తున్నది నవ నిర్మాణ దీక్ష కాదని, నయవంచన దీక్ష అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథరెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లడారు. రాష్ట్రాన్ని విభజించటానికి నాలుగు సార్లు లేఖలు ఇచ్చి, విభజనకు అనుకూలంగా లోక్‌సభలో తొలి ఓటు తమ పార్టీదే అని తెలుగుదేశం లీడర్‌తో ప్రకటింప చేశారని ఆరోపించారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఇప్పుడు నవ నిర్మాణ దీక్ష చేస్తున్నానంటున్నారని ఎద్దేవా చేశారు. అవినీతి, కుట్ర రాజకీయాల మీద ప్రజలు ధ్వజం ఎత్తాలని చేస్తున్న నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ ప్రకారం.. ప్రజల తొలి లక్ష్యం టీడీపీ ప్రభుత్వమే కావాలన్నారు.
కృష్ణా, గోదావర జలాలను అమ్మేశారు:
నోటుకు ఓటు కేసు నుంచి బయట పడేందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృష్ణా, గోదావరి జలాలను అమ్మేశారని ఆరోపించారు. రాష్ట్రంలో పరిపాలన లేదని, రెండేళ్లలో చేసిన మంచి పని లేదని విమర్శించారు. మూడేళ్లలో ఏం పూర్తి చేస్తారో చెప్ప గల సత్తా బాబుకు లేదన్నారు. కానీ విజన్ 2050 అంటూ ప్రజలను మభ్య పెడుతున్నారని అన్నారు. ప్రజల మనసులోని భావననే అనంతపురం జిల్లాలో వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహనరెడ్డి చెప్పారని గుర్తు చేశారు. గతంలో మాజీ సీఎం నందమూరి తారకరామరావుపై హైదరాబాద్ వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులతో దాడి చేసిన విషయాన్ని ప్రజలు ఇంకా మరిచిపోలేదన్నారు. ఇలాంటి సంస్కృతి చంద్రబాబుకు ఉందని దుయ్యబట్టారు.