మాట్లాడుతున్న వైఎస్‌ఆర్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి
కడప కార్పొరేషన్: తెలంగాణ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకోవడానికి హరికృష్ణ మృతదేహం పక్కనుండగానే శవరాజ కీయం చేసింది చంద్రబాబేనని వైఎస్‌ఆర్‌సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం కడపలోని వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ గురించి చర్చించడానికి వస్తున్నామంటూ కేసీఆర్ ఫోన్ చేసిన మీదట కేటీఆర్ బృందం వైఎస్ జగన్‌తో భేటీ అయిందన్నారు. రాష్ట్రానికి మేలు చేసే ప్రత్యేక హోదా, విభజన హామీలు అమలు కోసం పక్క రాష్ట్రం మద్దతు ఇస్తామంటే తీసుకోకుండా ఎలా ఉంటామని ప్రశ్నించారు. ఏపీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పోటీ చేస్తేనే పొత్తు ప్రసక్తి వస్తుందని, మన రాష్ట్రంలో టీఆర్‌ఎస్ లేదు కాబట్టి అలాంటి అవకాశమే లేదన్నారు. ఏపీలో 175 స్థానాల్లో వైఎస్‌ఆర్‌సీపీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. టీడీపీతో పొత్తుకు కేటీఆర్ తిరస్కరించడం వల్లే చంద్రబాబు అక్కసుతో ఎల్లో మీడియా ద్వారా వైఎస్‌ఆర్‌సీపీపై బురదజల్లుతున్నారని «ధ్వజమెత్తారు. రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్‌తో, అందుకు మద్దతిచ్చిన బీజేపీలతో దోస్తీ చేసిన చంద్రబాబు ఆ తప్పిదాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నిం చారు. నాలుగేళ్లు ప్రత్యేక హోదా మాటెత్తకుండా హోదా ఏమన్నా సంజీవనా, దానితో అన్నీ జరిగిపోతాయా అంటూ మాట్లాడి ప్యాకేజీకి అంగీకరించారన్నారు.
ప్యాకేజీ ఇచ్చినందుకు ప్రధాని మోదీతో సహా అందరినీ సన్మానించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు హోదాను పక్కనబెట్టి ప్యాకేజీకి అంగీకరించడం వల్లే ఈ రోజు హోదా కోసం అన్ని పార్టీల మద్దతు కూడగట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేసీఆర్ వైఎస్ జగన్‌ను కలవకముందే ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారన్నారు. లోక్‌సభలో రాష్ట్రాల సంఖ్యాబలం పెరిగినప్పుడే ఆయా రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని, మన రాష్ట్రంలో ఉన్న 25మంది ఎంపీలకు తెలంగాణలోని 17 మంది కలిస్తే ఆ బలం 42కు పెరిగి కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు. ఈ మేరకు ప్రత్యేక హోదాకు ఏ ప్రాంతీయ పార్టీలు, కూటములు మద్దతు పలికినా వైఎస్‌ఆర్‌సీపీ ఆహ్వానించి అభినందిస్తుందన్నారు.విభజన హామీల విషయంలో ఆడి తప్పిన బీజేపీపై చివరి ఏడాదిలో చంద్రబాబు, రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్‌తో కలసి యుద్ధం చేస్తానడటం హాస్యాస్పదమన్నారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు ప్రయత్నించి సాక్షాత్తు అసెంబ్లీలోనే తెలుగువారు కలిసి ఉంటే బాగుంటుందని చెప్పిన సీఎం, నేడు విపరీతార్థాలు తీయడం దారుణమన్నారు. కేటీఆర్‌తో జరిగిన సమావేశం ఎన్నికల్లో మద్దతు కోసం కాదని, ఫెడరల్ ఫ్రంట్‌లో చేరుతున్నామని జగన్ ప్రకటించలేదన్నారు. కేంద్రంలో రెండు జాతీయ పార్టీలు రాష్ట్రానికి అన్యాయం చేసిన నేపథ్యంలో ఫెడరల్ ఫ్రంట్ వల్ల ప్రత్యేక హోదా డిమాండ్‌కు మద్దతు లభిస్తుందన్నది వైఎస్ జగన్ అభిప్రాయమన్నారు.
దీన్ని చిలువలు పలువలు చేసి ప్రచారం చేయడంలో అర్థం లేదన్నారు. జిల్లా అధికార ప్రతినిధి రాజేంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా విషయంలో మొదటి నుంచి ఒకే మాటపై ఉన్న పార్టీ వైఎస్‌ఆర్‌సీపీయేనన్నారు. ప్రత్యేక రాష్ట్రంలో గొంగళి పురుగును కూడా ముద్దు పెట్టుకుంటానని కేసీఆర్ ప్రకటించినట్లుగా, ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ఆర్‌సీపీ ఎవరితోనైనా కలుస్తుందన్నారు. హోదా అంశాన్ని కాంగ్రెస్ చట్టంలో పెట్టి ఉంటే న్యాయస్థానాల ద్వారా పోరాటం చేసే వీలుండేదన్నారు. చంద్రబాబు ఏ ఆట ఆడితే దాన్ని ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక హోదాకు ఏ పార్టీ మద్దతు ఇచ్చినా తమ పార్టీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. యూత్ వింగ్ జిల్లా అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు కారణమైన రెండు ప్రధాన జాతీయ పార్టీలతో కలిసింది చంద్రబాబేనన్నారు. తెలం గాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబు వైఎస్‌ఆర్‌సీపీపై బురజల్లడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment