భయపడ్డ బీజేపీ నాయకత్వం! | CM Chandrababu Comments on BJP Govt | Sakshi
Sakshi News home page

భయపడ్డ బీజేపీ నాయకత్వం!

Published Thu, Jun 7 2018 2:52 AM | Last Updated on Fri, Mar 29 2019 9:04 PM

CM Chandrababu Comments on BJP Govt - Sakshi

సాక్షి ప్రతినిధి, కడప: ప్రధాని నరేంద్రమోది నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి విరుచుకుపడ్డారు. తప్పుడు నిర్ణయాలతో నాలుగేళ్లలో తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న బీజేపీ నాయకత్వం ఇప్పుడు భయపడుతోందని వ్యాఖ్యానించారు. అందుకే నాలుగేళ్లుగా పక్కన పెట్టిన సీనియర్‌ నేతలు అద్వానీ, మురళీమనోహార్‌ జోషిలను అడుక్కునే పరిస్థితి వచ్చిందని సీఎం ఎద్దేవా చేశారు. బుధవారం సీఎం వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు రూరల్‌ మండలంలో గ్రామదర్శిని, కడపలో నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి ఒక్కొక్కరి అకౌంట్‌కు రూ.15లక్షలు జమ చేస్తామని ఎన్నికల్లో ప్రకటించిన ప్రధాని నరేంద్రమోదీ ఏం చేశారన్నారు. ఏ తమ్ముళ్లు ఒక్క రూపాయి అయినా మీ అకౌంట్‌లో వేశారా అని ప్రశ్నించారు.

కడపలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పాలని విభజన చట్టంలో ఉన్నా ఎందుకు అమలు చేయడంలేదని సీఎం ప్రశ్నించారు. విడిపోయి కట్టబట్టలతో మిగిలిన రాష్ట్రానికి జాతీయ పార్టీ అండ కావాలని ఆ రోజు బీజేపీతో జట్టుకట్టామన్నారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన హామీలేవీ అమలు చేయకపోయినా నాలుగేళ్లు ఓపిక పట్టామని, చివరికి విభజన చట్టంలో ఉన్న వాటినీ అమలుచేయకపోవడంతో విడిపోయామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేసిన బీజేపీని ఓడించమని తాను కర్ణాటకలోని తెలుగువారికి పిలుపు ఇవ్వడంలో వల్లే అక్కడ ఆ పార్టీ ఓడిపోయిందని చెప్పారు. రాష్ట్రానికి ప్రకటించిన 11 యూనివర్శిటీల కోసం రూ.11వేల కోట్లు విలువచేసే భూములిస్తే ఏమాత్రం పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం దగా చేసినా మన తెలివితేటలతో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతోందని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో రూ.16లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు 2,444 ఎంఓయూలు చేసుకున్నాం. తద్వారా 30లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని పునరుద్ఘాటించారు. 

కేంద్రంతో లాలూచీ పడే రాజీనామాలు
కేంద్ర ప్రభుత్వంతో వైఎస్సార్‌సీపీ లాలూచీపడిందని అందులో భాగంగానే ఎంపీలతో రాజీనామా చేయించారని చంద్రబాబు మరోసారి ఆరోపించారు. సంవత్సరంలోపు ఎన్నికలు రావని తెలుసు కాబట్టే రాజీనామాలు చేశారన్నారు. ఏప్రిల్‌ 3న రాజీనామా చేసుంటే ఇప్పటికే ఎన్నికలు వచ్చేవని, మే 29న ఆమోదించినా ఎన్నికలు వచ్చేవన్నారు. ఈరోజు మళ్లీ స్పీకర్‌ వద్దకు వెళ్లారని, వారికి చేతకాకపోతే చేతకాదని చెప్పాలి తప్పితే  రాజీనామాలు ఆమోదించకపోవడానికి తాను కారణమని ఎలా చెబుతారని, అక్కడ నామాట వినే పరిస్థితి ఉందా అని ప్రశ్నించారు. 

హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో రాష్ట్రానికి 44వ స్థానం
సాక్షి, అమరావతి: హ్యాపీనెస్‌ ఇండెక్స్‌లో (ఆనంద సూచిక) రాష్ట్రం ర్యాంకు గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం పెరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నవ నిర్మాణ దీక్ష నిర్వహణపై జిల్లా కలెక్టర్లు, అధికారులు, ప్రజాప్రతినిధులతో బుధవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. యునైటెడ్‌ నేషన్స్‌ సాధికారత సర్వే ఆనంద సూచికలో రాష్ట్రానికి ప్రపంచంలో 44వ ర్యాంకు వచ్చిందని, రాష్ట్రంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో ఉందని ప్లానింగ్‌ కార్యదర్శి సంజయ్‌గుప్తా చెప్పగా దానిపై చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రం ఆనంద ఆంధ్రప్రదేశ్‌గా రూపొందాలన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement