
ఇక్కడ నిర్మాణదీక్షలు.. అక్కడ ఇళ్ల నిర్మాణాలు
- విభజన లేఖ ఇచ్చిన చంద్రబాబే దీక్ష చేయడం సిగ్గుచేటు
- ఏపీలో దొంగ దీక్షలు చేస్తూ తెలంగాణలో ఇల్లు కడతారా?
- ఏపీ సీఎం వైఖరిపై వైఎస్సార్‌సీపీ నేత వెల్లంపల్లి మండిపాటు
విజయవాడ: గతంలో రాష్ట్రాన్ని విభజించాలంటూ కేంద్రానికి లేఖలు రాసి, విభజనకు కారకుడైన చంద్రబాబు నాయుడు.. ఇవాళ నవ నిర్మాణ దీక్షల పేరుతో నాటకాలు చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. శుక్రవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. చంద్రబాబు చేస్తున్నది నవనిర్మాణ దీక్షకాదూ.. నయ వంచన దీక్ష అని మండిపడ్డారు.
‘విభజనకు లేఖ ఇచ్చిన ఆయనే ఇవాళ డ్రామాలాడుతున్నారు. గడిచిన మూడేళ్ల కాలంలో ఏ నిర్మాణాలు చేపట్టారో చెప్పుకోలేని స్థితిలో రాష్ట్రప్రభుత్వం ఉంది. అయితే చంద్రబాబు మాత్రం పక్కరాష్ట్రం(తెలంగాణలో) చాలా దీక్షగా రూ.100 కోట్లతో ఇల్లు కట్టుకున్నారు. ఇదీ.. ఆయన తీరు!’ అని వెల్లంపల్లి వ్యాఖ్యానించారు. మహిళలపై వేధింపులు, అరాచకాలు, అప్పులు, అవినీతిలో చంద్రబాబు నంబర్ వన్‌గా నిలుస్తారని వెల్లంపల్లి విమర్శించారు.