17 లక్షల కోట్లు.. అవన్నీ రాకపోవచ్చు | May not get all of the 17 lakh crores says chandrababu | Sakshi
Sakshi News home page

17 లక్షల కోట్లు.. అవన్నీ రాకపోవచ్చు

Published Sat, Jun 3 2017 1:09 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM

17 లక్షల కోట్లు.. అవన్నీ రాకపోవచ్చు - Sakshi

17 లక్షల కోట్లు.. అవన్నీ రాకపోవచ్చు

ఎంఓయూలపై నవ నిర్మాణ దీక్షలో సీఎం చంద్రబాబు 
- ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తుపెట్టుకున్నాం..
మోదీ ప్రచారంతో ప్రజల నమ్మకాన్ని పొందాము..
జూన్‌ 2 ఏపీకి చీకటి రోజు.. అందుకే నిర్మాణ దీక్ష  
పెన్షన్లలోనూ అవినీతి.. అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతా..
మాట వినని ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించిన సీఎం
 
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు ఇటీవల కుదుర్చుకున్న రూ.17 లక్షల కోట్ల విలువైన ఎంఓయూల్లో అన్నీ రాకపోవచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. వచ్చిన వాటితోనే రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం నవ నిర్మాణ దీక్ష సభలో ప్రతిజ్ఞ చేయించిన అనంతరం సీఎం మాట్లాడారు. దేశానికి మోదీ, రాష్ట్రానికి టీడీపీ అవసరం అని గుర్తించి గత ఎన్నికలకు ముందే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, మోదీతో రాష్ట్రంలో సభలు నిర్వహించి ప్రజల నమ్మకాన్ని పొందామని అన్నారు. తన తెలివి, అనుభవం, కష్టం మీ కోసం ఉపయోగిస్తానని, కాంగ్రెస్‌పై కసిగా పని చేద్దామని పిలుపునివ్వడంతో ప్రజలు పట్టం కట్టారన్నారు.

గతంలో ఆరున్నరేళ్లు 29 మంది ఎంపీలను ఇచ్చి వాజ్‌పాయ్‌ నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చామని గుర్తు చేశారు. 2009 నుంచి 2014 వరకు ఎక్కువ ఎంపీ సీట్లు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్రానికి ద్రోహం చేసిందన్నారు. జూన్‌ 2 ఇటలీకి స్వాతంత్య్రం వచ్చిన రోజు అని, తెలంగాణ ఏర్పడిన రోజు అని, ఈ రోజున వారు పండుగ చేసుకుంటే ఏపీకి చీకటి రోజు కావడంతో దీక్షను కొనసాగిస్తున్నామని చెప్పారు. ఈ నెల 3 నుంచి 7 వరకు విజయవాడ ఎ కన్వెన్షన్‌ సెంటర్‌లో పలు అంశాలపై చర్చగోష్టులు కొనసాగిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోను కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు. ఈ నెల 8న కాకినాడలో మహా సంకల్ప సభ నిర్వహిస్తామని ప్రకటించారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ మొదలు తాజా విభజన వరకు జరిగిన పరిణామాలను ముఖ్యమంత్రి వివరించారు. కష్టకాలంలో సైతం అభివృద్ధి సూచికలో 5వ స్థానంలో ఉన్నామని, తలసరి ఆదాయం రూ.1.62 లక్షలు సాధించామన్నారు. 
 
హోదాకు సమానమైన ప్యాకేజీకి అంగీకారం
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని, హోదాలో ఉండేవన్నీ ప్యాకేజీలో ఇస్తామంటేనే అంగీకరించానని ముఖ్యమంత్రి చెప్పారు. పోలవరం ముంపు మండలాలు విలీనం చేయకపోతే తనకు పదవి అవసరం లేదని, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనని తాను నిర్మొహమాటంగా చెప్పడంతోనే కేంద్రం ఆర్డినెన్స్‌ ఇచ్చిందన్నారు. కేంద్రం ఇస్తామన్న 11 జాతీయ విద్యా సంస్థల్లో 9 వచ్చాయని, రూ.24 వేల కోట్ల రుణమాఫీ చేశామన్నారు. పోలవరం, అమరావతి తనకు రెండు కళ్లు అన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేసి నదుల అనుసంధానంతో రాష్ట్రాన్ని కరువు రహితంగా తీర్చిదిద్దుతానన్నారు. ఏపీని ఇండస్ట్రియల్‌ హబ్‌గా, రాయలసీమను హార్టికల్చర్‌ హబ్‌గా చేస్తానన్నారు. అవినీతికి పాల్పడిన ప్రభుత్వ ఉద్యోగిని డబ్బు వెనక్కు ఇవ్వాలని తొలుత హెచ్చరిస్తామని, మాట వినకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. పెన్షన్‌లలోనూ అవినీతి జరుగుతోందని, పెన్షన్‌కు డబ్బులు వసూలు చేస్తున్న ఒక అధికారిని హెచ్చరించగా అతను పది మందికి డబ్బులు తిరిగి వెనక్కు ఇవ్వడం తనను ఆశ్చర్యపరచిందన్నారు.

రాష్ట్రాన్ని అవినీతి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతానన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబును ఏపీఎన్‌జీఓ సంఘం అధ్యక్షుడు పి.అశోక్‌బాబు, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి, సచివాలయ ఉద్యోగుల సంఘం కార్యదర్శి సీహెచ్‌ మురళీకృష్ణ సత్కరించారు. అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్, శాసన మండలి మాజీ చైర్మన్‌ చక్రపాణి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్, మంత్రులు నారా లోకేశ్, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్ర, కామినేని శ్రీనివాస్, మహిళా కమిషన్‌ అధ్యక్షురాలు నన్నపనేని రాజకుమారి, నగర మేయర్‌ కోనేరు శ్రీధర్, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
 
జనం లేక వెలవెల 
నవనిర్మాణ దీక్ష జనం లేక వెలవెలబోయింది. ఏకంగా 50 వేల మంది దీక్షకు హాజరు కానున్నట్టు ప్రభుత్వం అంచనా వేసింది. కనీసం 2 వేల మంది కూడా రాకపోవడంతో సీఎం, మంత్రులు కంగుతిన్నారు. వేదికకు మూడు వైపులా రోడ్డుపై పెద్ద ఎత్తున వేసిన కుర్చీలు ఖాళీగా ఉండటంతో సభ ప్రారంభానికి ముందే ట్రక్కుల్లో వెనక్కు పంపించారు. వేదికకు రెండు వైపులా ఉన్న వారిని ఎదురుగా ఒకచోట ఉండేలా చూడాలని డీజీపీని సీఎం ఆదేశించారు. అయినా కుర్చీలు నిండక నిర్వాహకులు డీలాపడ్డారు. సభకు ముందు బందరు రోడ్డులో  నిర్వహించిన ర్యాలీలోనూ జనం లేరు. కాగా, జాతీయ రహదారిపై సభలు జరపకూడదన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిత్యం రద్దీగా ఉండే బెంజి సర్కిల్‌లో సభ జరపడంపై విమర్శలు వచ్చాయి. వాహనాలను వేర్వేరు మార్గాల్లో మళ్లించడం వల్ల ప్రయాణికులు  ఇబ్బందులు పడ్డారు. సభకు వచ్చిన అరకొర జనం కూడా ఉక్కపోత భరించలేక మధ్యలోనే వెనుదిరిగారు.  
 
ముఖ్యమంత్రి తడబాటు
ఈ రోజు ఈ ప్రభుత్వంలో ఉద్యోగస్తులు కూడా భాగస్వాములు. టీచర్లు కూడా భాగస్వాములు. వాళ్లకు కూడా న్యాయం జరగాలి. అదే సమయంలో అందరూ కలసి నీతిలేక.. అంటూ ముఖ్యమంత్రి తడబడి, వెంటనే సవరించుకుంటూ.. అవినీతి లేని ప్రభుత్వం కోసం పని చేయాల్సి ఉందన్నారు. చంద్రబాబు తడబాటుపై సభికులు చర్చించుకున్నారు. 2022 నాటికి రాష్ట్రాన్ని దేశంలో మూడు అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా, 2029 నాటికి దేశంలో అత్యుత్తమ రాష్ట్రంగా, 2050 నాటికి ప్రపంచంలో అత్యున్నత ప్రమాణాలు కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా నిర్దేశించుకున్నామని ప్రతిజ్ఞ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement