రాజమహేంద్రవరం: పార్లమెంటు తలుపులు మూసివేసి విభజన చట్టాన్ని మనపై బలవంతంగా రుద్దారన్న అంశాన్ని రాష్ట్రంలో కాకుండా లోక్‌సభలో చేపట్టేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎంపీలతో తీర్మానం ప్రవేశపెట్టించాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సూచించారు. మూడేళ్ల తర్వాతైనా చంద్రబాబు ఈ విషయంపై మాట్లాడడాన్ని స్వాగతిస్తూ దీనిపై నవ నిర్మాణ దీక్ష ప్రజలు కాదు, చంద్రబాబు చేపట్టాలని కోరారు.
శనివారం తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ చట్టాన్ని చట్టబద్ధంగా చేసేందుకు మళ్లీ పార్లమెంట్‌లో ఆమోదించాలని పేర్కొన్నారు. ఇప్పడు చట్టంలో ఏమీ లేవని చెబుతున్నారో అవన్నీ చేర్చవచ్చన్నారు. తప్పును సరిదిద్దకపోతే ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమ పార్టీ ఎంపీలతో రానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తీర్మానం ప్రవేశపెట్టించి రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నిలదీయాలని సూచించారు.
2015లో ఇదే విషయమై తాను రాష్ట్రపతికి లేఖ అందజేశానని పేర్కొన్నారు. సంఖ్యా బలం లేకుండా చేసిన చట్టం చెల్లదని, ఈ విషయమై సుప్రీంలో తాను వేసిన పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకోసం సమాచారమంతా సేకరించానని పేర్కొన్నారు. తీర్మానం ప్రవేశపెడితే ఈ సమాచారం ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు అందజేస్తానని తెలిపారు. మోదీ అంటే భయం లేకపోతే తీర్మానం ప్రవేశపెట్టించాలన్నారు. అందుకు మద్దతు తెలపకుండా ప్రతిపక్షం కూడా తప్పించుకోలేదన్నారు.
బీజేపీ, మోదీ, కేసీఆర్‌కు భయపడడానికి ప్రధాన కారణమైన ఓటుకు నోటు కేసులో జరిగింది ఒప్పుకోవాలని చంద్రబాబుకు సూచించారు. తెలంగాణలో మీ పార్టీని, అనుచరులను కాపాడుకోవడానికి చేస్తున్న ఈ ప్రయత్నమే రాష్ట్రానికి గ్రహణంలా పట్టి పీడిస్తోందని ఆరోపించారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై దీక్ష చేయాల్సింది ప్రజలు కాదని చంద్రబాబు దీక్షకు పూనుకోవాలని సూచించారు.