
దీంతో ఇద్దరి మధ్య ముసుగు తొలగింది
ఇది బాబు చరిత్రలో పెద్ద మచ్చ
గత ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ఉపసంహరణ సరికాదు
కేసు కొనసాగుతుంది.. బాబును పార్టీ చేసే పరిస్థితి వస్తుంది
పన్ను ఎగవేతదారులకు కేంద్రంగా మార్గదర్శి ఫైనాన్స్
రామోజీ వ్యాపారాలన్నీ ప్రజల డబ్బుతో చేసినవే
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ధ్వజం
సాక్షి, రాజమహేంద్రవరం: ఆర్థిక అవకతవకలు, అక్రమాలకు అడ్డాగా నిలిచిన మార్గదర్శికి చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యక్షంగా ఉపకారం చేయడం దారుణమని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిపడ్డారు. దీంతో మార్గదర్శి, చంద్రబాబు ముసుగు తొలగిందన్నారు. బాబు చరిత్రలో ఇది అతిపెద్ద మచ్చగా నిలిచిపోవడం ఖాయమని చెప్పారు. గత ప్రభుత్వం మార్గదర్శిపై దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలోకి రాగానే మార్గదర్శిని కాపాడతానన్నారని గుర్తు చేశారు.
ఆయన అన్నట్లే ఇప్పుడు కాపాడుతున్నారని ఆరోపించారు. ఇది చంద్రబాబు ప్రభుత్వం చేసిన అతిపెద్ద తప్పన్నారు. డిపాజిట్లపై ఫ్యూచర్ సబ్‌్రస్కిప్షన్ ఉండకూడదని నిబంధన ఉన్నా.. మార్గదర్శి దీన్ని కొనసాగించిందన్నారు. చంద్రబాబు మార్గదర్శిపై అఫిడవిట్ ఉపసంహరించుకున్నా కేసు ఆగదని.. ఆయనను ఇందులో పార్టీ చేసే పరిస్థితి వస్తుందన్నారు. రాజమహేంద్రవరంలో సోమవారం ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ఏమన్నారంటే..
చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరకకుండా చేస్తారు..
సీఎం చంద్రబాబు ఏం చేసినా చట్టానికి దొరక్కుండా చేస్తారు.. కానీ మార్గదర్శికి బహిరంగంగా సాయం చేసి తన ముసుగు తొలగించారు. గత ప్రభుత్వ హయాంలో ఫ్యూచర్ సబ్‌్రస్కిప్షన్ పేరుతో మార్గదర్శి సేకరిస్తున్న డిపాజిట్లు చట్టవిరుద్ధమని దాని బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.1,051 కోట్లను అటాచ్ చేశారు. ఇది అన్యాయమని అప్పట్లో మార్గదర్శి కోర్టుకు వెళ్లలేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక.. గత ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌ను ఉపసంహరించుకునేలా చేసింది. అటాచ్ చేసిన ఆ నగదు మొత్తాన్ని వెనక్కు ఇచ్చేయాలని ప్రభుత్వం చెప్పడం దారుణం. సెపె్టంబర్ 11న మార్గదర్శి ఫైనాన్షియర్స్ కేసు వాయిదాకు వస్తున్న సమయంలో ఇలా చేయడం తగదు. అక్కడ కూడా ఏదో చేయబోతున్నారని అర్థమవుతోంది.
మార్గదర్శి చేసింది తప్పేనని రిజర్వ్ బ్యాంక్ చెప్పింది..
మార్గదర్శి చేసింది తప్పేనని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ తెలంగాణ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఫండమెంటల్ యాక్ట్ 1982 ప్రకారం.. చిట్‌ఫండ్ వ్యాపారి ఇతర వ్యాపారాలు చేయకూడదనే నిబంధన ఉంది. రామోజీరావు అన్ని వ్యాపారాలు, ఆయన సామ్రాజ్య విస్తరణ మొత్తం ప్రజల నుంచి వసూలు చేసిన డబ్బుతో నడుస్తున్నవే. గత ప్రభుత్వ హయాంలో మార్గదర్శి చిట్‌ఫండ్ బ్రాంచ్‌లను మూసేశారు. దీంతో వారి ఖాతాలన్నింటినీ తెలంగాణలోని ఇతర బ్రాంచ్‌లకు మార్గదర్శి తరలించింది. చంద్రబాబు రాగానే ఎట్టి పరిస్థితుల్లో తమ సంస్థను వ్యతిరేకించరని తెలుసు. ఇలాంటి పనులు చేసే ముందు ప్రజలు ఏమనుకుంటారోనని సీఎం ఆలోచించాలి. మార్గదర్శిలో ఉన్న మొత్తం డబ్బులో 70 శాతం అన్ అకౌంటబుల్. దీన్ని ఖచి్చతంగా నిరూపిస్తా. పన్ను ఎగవేతదారులకు మార్గదర్శి ఫైనాన్స్ కేంద్రంగా నిలిచింది.
దేశంలోనే ధనిక సీఎం చంద్రబాబు
తమకు రూ.900 కోట్ల ఆస్తులు ఉన్నట్లు చంద్రబాబు 2024 ఎన్నికల అఫిడవిట్‌లో ప్రకటించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారమే రూ.900 కోట్లు ఉంటే బహిరంగ మార్కెట్‌లో ఈ మొత్తం రూ.వేల కోట్లు ఉంటుంది. చంద్రబాబు భార్య భువనేశ్వరి మాత్రం రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ వద్ద తమ ఆస్తి రూ.25 వేల కోట్లు ఉన్నట్లు ప్రకటించారు. ఎక్కడి నుంచి అంత ఆస్తి వచి్చందని ఎవరైనా ప్రశి్నంచారా? చట్టబద్ధంగా ఆయన అక్రమాలు చేసినట్లు ఎవరైనా ఫిర్యాదు చేశారా? ఐపీఎస్ అధికారులపై కేసులు పెట్టిన సందర్భాలు గతంలో లేవు. పీఎస్సార్ ఆంజనేయులు మంచి అధికారి. ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో పనిచేసిన వారిపై కక్ష సాధింపు చర్యలకు దిగడం సరికాదు.