మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యలు
ఉండవల్లికి పెన్‌డ్రైవ్ ఇచ్చే విషయంలో తగిన సమయంలో ఆదేశాలిస్తాం
మార్గదర్శిపై మాట్లాడకుండా గ్యాగ్ ఆర్డర్ ఈ దశలో ఇవ్వలేం
స్పష్టం చేసిన హైకోర్టు ధర్మాసనం
ఉండవల్లి మీడియాతో మాట్లాడుతున్నారన్న సిద్దార్థ లూథ్రా
తీవ్రంగా స్పందించిన అరుణ్ కుమార్
అవాస్తవాలతో లూథ్రా కోర్టును తప్పుదోవ పట్టిస్తుంటారని వెల్లడి
తదుపరి విచారణ గురువారానికి వాయిదా
సాక్షి, అమరావతి/సాక్షి, హైదరాబాద్: చందాదారుల వివరాలను అందించే విషయంలో నిజాయితీగా ఉండాలని మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను ఉద్దేశించి తెలంగాణ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి విషయాల్లో పారదర్శకంగా ఉంటే అందరికీ మంచిదని మార్గదర్శికి స్పష్టం చేసింది. ఉండవల్లి అరుణ్ కుమార్ కోరిన విధంగా ఆయనకు పెన్‌డ్రైవ్‌లో చందాదారుల వివరాలను అందచేసే విషయంలో తగిన సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపింది.
ఈ కేసు గురించి మీడియా ముందు మాట్లాడకుండా అరుణ్ కుమార్‌ను నియంత్రిస్తూ గ్యాగ్ ఆర్డర్ జారీ చేయాలన్న మార్గదర్శి అభ్యర్థనను హైకోర్టు తిరస్కరించింది. ఎలాంటి విచారణ చేపట్టకుండా ఈ దశలో అలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేసింది. ఒకవేళ ఆయన మాట్లాడిన మాటలు పరువు నష్టం కలిగించేవిగా ఉన్నాయనుకుంటే తగిన విధంగా ముందుకెళ్లొచ్చునని మార్గదర్శికి స్పష్టం చేసింది. తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తిరిగి విచారణ మొదలుపెట్టిన హైకోర్టు
చట్ట నిబంధనలకు విరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించిన మార్గదర్శి ఫైనాన్సియర్స్, దాని హెచ్‌యూఎఫ్ కర్త రామోజీ రావుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ కేసులో అధీకృత అధికారి నాంపల్లి కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. ఈ ఫిర్యాదును కొట్టేస్తూ 2018 డిసెంబర్ 31న ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తేలప్రోలు రజని తీర్పునిచ్చారు. ఈ తీర్పును సవాలు చేస్తూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీళ్లు దాఖలు చేశాయి. హైకోర్టు తీర్పులోని కొంత భాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రామోజీ, మార్గదర్శి కూడా వేర్వేరుగా అప్పీళ్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లన్నింటిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. హైకోర్టు తీర్పును రద్దు చేసింది.
ఈ వ్యవహారంపై తిరిగి విచారణ చేపట్టాలని, ఉండవల్లి, ఏపీ సర్కార్ సహా అందరి వాదనలు వినాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది. డిపాజిట్ల సేకరణలో వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టంచేసింది. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్ సుజోయ్ పాల్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. తాను నగరంలో లేనందున విచారణను గురువారానికి వాయిదా వేయాలని ఆర్‌బీఐ తరఫున సీనియర్ న్యాయవాది లక్ష్మీనారాయణన్ రవిచందర్ ధర్మాసనాన్ని కోరారు.
ఇందుకు ఉండవల్లి అరుణ్ కుమార్, మార్గదర్శి తరపున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కూడా అంగీకరించారు. ఏ రోజైనా ఇబ్బంది లేదని, తన అభ్యర్థన మాత్రం పెన్‌డ్రైవ్ గురించేనని అరుణ్ కుమార్ చెప్పారు. తదుపరి విచారణకన్నా ముందే పెన్‌డ్రైవ్‌ను అందజేస్తే, కోర్టుకు సహకరించడం సులభంగా ఉంటుందని చెప్పారు. దీనిపై వాదనలు వినే సమయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం తెలిపింది. గురువారం అరుణ్ కుమార్‌కు మంచి రోజని లూథ్రా వ్యాఖ్యానించగా.. అవునని, ఆ రోజున తాను స్వయంగా కోర్టు ముందు హాజరవుతానని, మీ ఉపన్యాసం వింటానని ఉండవల్లి చెప్పారు.
చందాదారులు ఎవరో ఇప్పటికీ గుర్తించని మార్గదర్శి
ఈ సమయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ స్పందిస్తూ.. చందారులందరికీ డిపాజిట్లు చెల్లించలేదని మార్గదర్శే అంగీకరించిందని «తెలిపారు. గత 10–15 సంవత్సరాలుగా ఎస్క్రో ఖాతాలో ఉన్న రూ.5.30 కోట్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయన్నారు. ఈ మొత్తాలు ఎవరివో మార్గదర్శి ఇప్పటివరకు గుర్తించలేకపోయిందని తెలిపారు. అందుకే ఈ విషయంలో కోర్టుకు సహకరించదలిచానని, ఓ అవకాశం ఇవ్వాలని కోరారు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో ముందుకు రావడంలేదన్నారు. వాదనల సమయంలో అన్ని విషయాలపైనా అవసరాన్ని బట్టి తగిన ఆదేశాలు ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఉండవల్లి పత్రికా ముఖంగా స్టేట్‌మెంట్లు ఇవ్వకుండా సలహా ఇవ్వాలని లూథ్రా కోరారు.
గ్యాగ్ ఆర్డర్ కోసం అనుబంధ పిటిషన్ వేస్తామన్నారు. దీనిపై ఉండవల్లి తీవ్రంగా స్పందించారు. అవాస్తవాలతో మీరు (లూథ్రా) కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని ఘాటుగా చెప్పారు. ఈరోజు (సోమవారం) మార్గదర్శి కోర్టు ముందుంచిన 240 పేజీల కేసు వివరాల్లో దాదాపు 100 పేజీలు తన గురించే ఉన్నాయన్నారు. తాను మార్గదర్శిపై మాట్లాడిన విషయాలపై పత్రికల్లో వచ్చిన కథనాలను తర్జుమా చేసి కోర్టు ముందుంచారని, ఆ తర్జుమాలు చాలా అధ్వానంగా ఉన్నాయని అన్నారు. పత్రికల్లో ఏదో రాస్తే తనకు ఆపాదిస్తున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు. గత 90 రోజుల్లో మీడియాతో మాట్లాడినట్లు ఏవైనా కథనాలు ఉంటే కోర్టు ముందుంచాలన్నారు. ఇది సంచలన కేసు అని, మీడియాకు ప్రతిదీ తెలుసునని చెప్పారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. గురువారం వాదనలు వింటామని, ఆ రోజుకి మీ మీ శక్తిని దాచిపెట్టుకోవాలంటూ వ్యాఖ్యానించింది.
‘సన్‌లైట్ ఈజ్ ది బెస్ట్ డిస్‌ఇన్‌ఫెక్టెడ్’ (పారదర్శకంగా, నిజాయితీగా ఉండటం, వాస్తవాలను బహిర్గతం చేయడం) – మార్గదర్శిని ఉద్దేశించి ధర్మాసనం చెప్పిన యూఎస్ సుప్రీంకోర్టు జడ్జి లూయిస్ బ్రాండీస్ కొటేషన్
Comments
Please login to add a commentAdd a comment