
తండ్రి నేరం చేసినా.. కుమారుడిని జైలుకు ఎలా పంపుతారంటూ ధర్మాసనానికి నివేదన
అవకతవకలకు రామోజీనే బాధ్యుడు.. కుటుంబ సభ్యులకు దాంతో ఏం సంబంధమని వితండ వాదన.. దీంతో నేరం చేసినట్లు పరోక్షంగా అంగీకారం
18 ఏళ్లుగా సెక్షన్ 45 (ఎస్) తమకు వర్తించదని వాదించిన రామోజీ
తాము తప్పే చేయలేదని దశాబ్దాలుగా వాదించి ఒక్కసారిగా ప్లేటు ఫిరాయించిన మార్గదర్శి
రామోజీ లేరు కాబట్టి క్రిమినల్ ప్రొసీడింగ్స్ చెల్లవంటూ తాజాగా వాదనలు.. మరణాన్ని అడ్డుపెట్టుకుని కేసు నుంచి బయటపడే యత్నాలు
చట్టవిరుద్ధ పనులకు బాధ్యత వహించాలని గుర్తు చేసిన హైకోర్టు.. క్రిమినల్ ప్రొసీడింగ్స్‌కొనసాగించాల్సిందేనంటున్న ఆర్‌బీఐ
తదుపరి విచారణ 28కి వాయిదా వేసిన తెలంగాణ హైకోర్టు
సాక్షి, అమరావతి: చట్టవిరుద్ధంగా డిపాజిట్ల స్వీకరణ విషయంలో గత 18 సంవత్సరాలుగా న్యాయస్థానాల సాక్షిగా అడ్డగోలుగా అబద్ధాలు వల్లెవేస్తూ వచ్చిన మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్ ఎట్టకేలకు న్యాయస్థానం ఎదుట నిజం అంగీకరించక తప్పలేదు. ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్ వాస్తవాన్ని తెలంగాణ హైకోర్టు ముందుంచింది. తమ హెచ్‌యూఎఫ్ కర్త అయిన రామోజీరావు చేసిన డిపాజిట్ల స్వీకరణకు ఆయన కుమారుడిని (ప్రస్తుత కర్త) బాధ్యుడిని చేయరాదంటూ వాదిస్తోంది.
తండ్రి చేసిన నేరానికి కుమారుడిని శిక్షిస్తారా? అంటూ ప్రశ్నిస్తోంది. ఒకవేళ తండ్రి నేరం చేసినా కుమారుడిని జైలుకు పంపించడం ఎంత వరకు సమంజసమని నిలదీస్తోంది. తద్వారా రామోజీరావు చట్టవిరుద్ధంగా ప్రజల నుంచి డిపాజిట్లు వసూలు చేశారన్న నిజాన్ని హైకోర్టు ముందు పరోక్షంగా అంగీకరించినట్లయింది. రామోజీరావు మరణాన్ని అడ్డుపెట్టుకుని ఈ కేసు నుంచి బయటపడేందుకు మార్గదర్శి ఫైనాన్షియర్స్‌తో పాటు రామోజీ స్థానంలో హెచ్‌యూఎఫ్ కర్తగా వ్యవహరిస్తున్న ఆయన కుమారుడు ప్రయత్నిస్తున్నారు.
అందులో భాగంగానే డిపాజిట్ల స్వీకరణ విషయంలో రామోజీ చేసిన నేరానికి తమను బాధ్యులుగా చేయడం తగదంటూ గట్టిగా వాదిస్తున్నారు. తండ్రి చేసిన నేరానికి కుమారుడిని బాధ్యుడిగా చేయరాదంటూ ‘వైకేరియస్ లయబిలిటీ’ సిద్ధాంతాన్ని తెరపైకి తీసుకొచ్చారు. హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ పాల్పడిన అక్రమాలు, అవకతవకలకు దాని కర్త అయిన రామోజీరావు మాత్రమే బాధ్యుడవుతారని చెప్పడం ద్వారా కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
అంతేకాక కొత్త కర్త (కిరణ్) నియామకంతో మార్గదర్శి హెచ్‌యూఎఫ్ పునరుద్ధరించినట్లయిందని, అందువల్ల తమను ప్రాసిక్యూట్ చేయడానికి వీల్లేదంటూ కొత్త వాదనను కూడా తెరపైకి తెచ్చింది. అయితే హైకోర్టు మాత్రం మార్గదర్శి వాదనకు భిన్నంగా స్పందించింది. చట్టవిరుద్ధ పనులకు బాధ్యత వహించాల్సిందే కదా..! (సివిల్ లయబిలిటీ) అని మార్గదర్శి ఫైనాన్షియర్స్‌కి తేల్చి చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం.
ఇదే సమయంలో రామోజీ చేసిన నేరానికి మార్గదర్శి ఫైనాన్షియర్స్ హెచ్‌యూఎఫ్ బాధ్యత వహించాల్సిందేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తేల్చి చెప్పింది. చట్టవిరుద్ధంగా డిపాజిట్లు వసూలు చేసినందుకు క్రిమినల్ ప్రొసీడింగ్స్ ఎదురోవాల్సిందేనంటూ రాతపూర్వకంగా హైకోర్టుకు నివేదించింది. రామోజీ, మార్గదర్శి ఫైనాన్షియర్స్ ఇన్నేళ్లుగా కోర్టుల ముందు చెబుతూ వస్తున్నవన్నీ అసత్యాలు, అవాస్తవాలేనని కూడా హైకోర్టుకు వివరించింది.
విచారణ 28కి వాయిదా...
సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మార్గదర్శి ఫైనాన్సియర్స్ కేసుపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై జస్టిస్ పి.శ్యామ్‌కోషి, జస్టిస్ కె.సుజన ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా మార్గదర్శి తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తూ.. మార్గదర్శి హెచ్‌యూఎఫ్ కర్త రామోజీరావు మరణించినందున ఆయన కుటుంబ సభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ చెల్లవని నివేదించారు.
ఆర్‌బీఐ చట్ట నిబంధనలను రామోజీరావు ఉల్లంఘించారంటూ మార్గదర్శి హెచ్‌యూఎఫ్ ప్రస్తుత కర్త అయిన రామోజీరావు కుమారుడు కిరణ్‌ను ఎలా శిక్షిస్తారని ప్రశ్నించారు. తండ్రి నేరం చేసినా కుమారుడిని జైలుకు పంపించడం సమంజసం కాదని పదేపదే ధర్మాసనానికి నివేదించారు. చట్టప్రకారం కిరణ్, ఇతర కుటుంబ సభ్యులపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ సాధ్యం కాదని పేర్కొన్నారు.
హిందూ అవిభాజ్య కుటుంబం (హెచ్‌యూఎఫ్) కింద మార్గదర్శి ఫైనాన్షియర్స్ కార్యకలాపాలు చేపట్టినందున కర్త రామోజీరావు మాత్రమే అవకతవకలకు బాధ్యుడవుతాడని, ఇతర కుటుంబ సభ్యులకు వాటితో సంబంధం ఉండదంటూ గంటకు పైగా సాగిన వాదనల్లో ఆయన హైకోర్టుకు నివేదించారు. మార్గదర్శి ఫైనాన్షియర్స్ తన కార్యకలాపాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో అది చేసిన తప్పులకు బాధ్యత వహించాలి కదా? అని హైకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
కోర్టు సమయం పూర్తి కావడంతో తదుపరి విచారణ తొలుత 21కి వాయిదా పడింది. తర్వాత మార్గదర్శి తరఫు మరో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వ్యక్తిగత కారణాలతో 21న విచారణకు హాజరుకావడం సాధ్యం కాదని, మరో తేదీని ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల 28కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment