సాక్షి, రాజమహేంద్రవరం: టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంపై అంతులేని నిర్లక్ష్యం నెలకొందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ప్రజలను బస్సుల్లో తీసుకు వెళ్లి మరీ భజనలు చేయించడం పైనే చంద్రబాబు దృష్టి పెట్టారు తప్ప.. చేసిందేమీ లేదని విమర్శించారు. రాజమహేంద్రవరంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టు 70:30 నిష్పత్తిలో నిర్మించాల్సి ఉన్నప్పటికీ కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు. ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొంది, నేటికి పదేళ్లు పూర్తయిందన్నారు.
ఈ బిల్లు ఆమోదం పొందిన వ్యవహారం పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. బిల్లు ఆమోదం విషయంలో లోక్‌సభ ప్రచురించిన డాక్యుమెంట్ ఆధారంగా తాను కోర్టును ఆశ్రయించానని చెప్పారు. బిల్లు ఆమోదం తప్పని తనకు మద్దతుగా సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిందని అన్నారు. ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పటి మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం ప్రకటించిందని గుర్తుచేశారు. 2015 డిసెంబర్ నాటికి నీతిఆయోగ్ తయారు చేసిన నివేదిక ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు రామచంద్రరావు కోరినప్పటికీ కేంద్రం నిరాకరించిందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.17 వేల కోట్లు అడిగితే రూ. 4 వేల కోట్లు తగ్గించి ఇచ్చిందని, ట్యాక్స్ ఇన్‌సెంటివ్‌లు కూడా ఇవ్వలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు 89 ఆస్తులను 58:42 నిష్పత్తిలో పంచుకోవాల్సిందిగా తొమ్మిదో షెడ్యూల్‌లో పెట్టారని, దీనిపై ఇంతవరకూ ఎటువంటి సమాధానమూ ఇవ్వలేదని అన్నారు. కొట్టుకు చావండని రాష్ట్రాలను కేంద్ర ప్రభుత్వం వదిలేసిందని దుయ్యబట్టారు. ఏ ఇన్‌స్టిట్యూట్ కట్టాలన్నా కేంద్రం నిధులు మంజూరు చేయడం లేదన్నారు.
తెలంగాణ, ఆంధ్రా మధ్య తేలాల్సిన ఆస్తుల విలువ రూ. 1.46 లక్షల కోట్లు ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన రాజ్యాంగబద్ధమా, కాదా అనే విషయంపై పార్లమెంటులో చర్చ జరగాలన్నారు. రాష్ట్రపునర్విభజనపై సుప్రీంకోర్టులో వేసిన కేసును అడ్వాన్స్ చేయిస్తే కేంద్ర ప్రభుత్వం కచ్చితంగా అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉంటుందని ఉండవల్లి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment