జనం సొమ్ముతో గురివింద విందు! | Ruling ordering re trial of Margadarshi Illegal Deposits case | Sakshi
Sakshi News home page

జనం సొమ్ముతో గురివింద విందు!

Published Wed, Apr 10 2024 5:11 AM | Last Updated on Wed, Apr 10 2024 5:11 AM

Ruling ordering re trial of Margadarshi Illegal Deposits case - Sakshi

పండిన రామోజీ పాపాలు

‘మార్గదర్శి’ అక్రమ డిపాజిట్ల నిగ్గు తేలాల్సిందేనన్న సుప్రీంకోర్టు

కేసు పునర్విచారణకు ఆదేశిస్తూ తీర్పు

పత్రికా స్వేచ్ఛ ముసుగులో తప్పించుకోలేరని స్పష్టీకరణ

బెడిసికొట్టిన రాజగురువు పన్నాగం

45 ఎస్‌ నిబంధనను ఉల్లంఘించి రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ

కేసులు విచారణలో ఉండగానే మరో రూ.2వేల కోట్లు..

డిపాజిటర్ల ప్రయోజనాల కోసం సీఎం జగన్‌ కీలక నిర్ణయం

ఉండవల్లి పిటిషన్‌లో ఇంప్లీడ్‌ అయిన రాష్ట్ర ప్రభుత్వం.. ‘మార్గదర్శి’వి అక్రమ డిపాజిట్లే.. రామోజీ ఆర్థిక నేరస్తుడేనన్న ఆర్‌బీఐ

ఆ కేసు కొట్టివేత చెల్లదని తీర్పునిచ్చిన అత్యున్నత న్యాయస్థానం

కేసు విచారణను ఆరు నెలల్లో పూర్తి చేయాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం

సాక్షి, అమరావతి: ఆర్థిక అక్రమాల ఉగ్రవాది ‘ఈనాడు’ రామోజీ పాపాలు పండాయి!  చట్టా­లంటే లెక్క లేకుండా దశాబ్దాలుగా సాగిస్తున్న ఆర్థిక అక్రమాలకు చెక్‌ పడింది. వ్యవస్థలను మేనేజ్‌ చేసి తప్పించుకునే ఎత్తుగడలు ఎల్లకాలం సాగవని రుజుౖ­వెంది. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌బీఐ) నిబంధనలకు విరు­ద్ధంగా సాగించిన అక్రమ డిపాజిట్ల దందా రామోజీ మెడకు చుట్టుకుంది.

టీడీపీ హయాంలో చంద్రబాబు అండదండలతో ‘రమణ’ మంత్రంతో కనికట్టు చేసి అక్రమ డిపాజిట్ల కేసు నుంచి  తప్పించుకున్నా చట్టం నుంచి తప్పించు­కోలేక పోయారు. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమ డిపాజిట్ల కేసును కొట్టివేయడానికి వీల్లేదని, ఆ కేసును సమగ్రంగా విచారించాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఈనాడు పేరుతో పత్రికా స్వేచ్ఛ ముసుగులో ఈ కేసు నుంచి తప్పిం­చుకునేందుకు రామోజీ చేసిన ప్రయత్నాలన్నీ సుప్రీంకోర్టు క్రియాశీలత ముందు వీగిపోయాయి.

ఈనాడు అంటే ఆఫ్టరాల్‌ ఒక పేపర్‌ మాత్రమేనని న్యాయస్థానం వ్యాఖ్యా­నించడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈనాడుకు వ్యతిరేకంగా ఉందన్న రామోజీ మొసలి కన్నీళ్లను కొట్టిపారేస్తూ సుప్రీంకోర్టు విప్లవాత్మకమైన తీర్పును విస్పష్టంగా వెలువ­రించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమ డిపాజిట్ల దందా పూర్వాపరాలు ఇవిగో...

రూ.2,600 కోట్ల అక్రమ డిపాజిట్ల సేకరణ..
నిర్భీతిగా నిబంధనల ఉల్లంఘన చట్టాలకు తాను అతీతం అన్నట్టుగా భావించే రామోజీరావు మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పేరిట బరితెగించి ఆర్థిక అక్రమాలకు పాల్పడ్డారు. ఆర్బీఐ చట్టం 45 ఎస్‌ ప్రకారం ఇన్‌కార్పొరేటెడ్‌ కంపెనీలు మాత్రమే ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించాలి. అంతేగానీ ఇన్‌కార్పొరేటెడ్‌ కంపెనీలు కాని వ్యక్తులు, సంస్థలు, హిందూ అవిభక్త కుటుంబాలు(హెచ్‌యూఎఫ్‌)లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించకూడదు.

ఈ నిబంధనను రామోజీ నిర్భీతిగా ఉల్లంఘించి అక్రమంగా డిపాజిట్లు సేకరించారు. 2006లో అప్పటి ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ఫిర్యాదుతో సీఐడీ దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ పేరిట రామోజీరావు 1997 నుంచి 2006 వరకు యథేచ్ఛగా అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు గుర్తించడంతో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసు నమోదు చేసింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ 2006లో సమర్పించిన అఫిడవిట్‌ ప్రకారమే అప్పటికి రూ.2,610.38 కోట్లు అక్రమ డిపాజిట్లు సేకరించినట్లు వెల్లడైంది.

హెచ్‌యూఎఫ్‌గా తాము డిపాజిట్లు సేకరించవచ్చంటూ రామోజీ చేసిన వితండవాదాన్ని ఆర్బీఐ అప్పట్లోనే సమ్మతించలేదు. సెక్షన్‌ 45ఎస్‌ ప్రకారం హెచ్‌యూఎఫ్‌లు ప్రజల నుంచి డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. తన ఆర్థిక అక్రమాల వ్యవహారం బట్టబయలు కావడంతో రామోజీ అనివార్యంగా తప్పిదాలను అంగీకరించారు. డిపాజిట్‌దారులకు వారి డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని, మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ను మూసి వేస్తామని ప్రకటించారు. 

అక్రమ డిపాజిట్ల వివరాలు వెల్లడించం..
2006 నాటికే 32,385 మంది నుంచి రూ.2,610.38 కోట్లు డిపాజిట్లుగా సేకరించామని పేర్కొన్న రామోజీరావు 2008లో కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో తాము  ఇంకా చెల్లించాల్సిన డిపాజిట్లు రూ.1,864.10 కోట్లు అని వెల్లడించారు. మరి మిగతా రూ.746.28 కోట్ల డిపాజిట్లు ఏమయ్యాయో ఆయన వెల్లడించలేదు. మరోవైపు తాము సేకరించిన డిపాజిట్లను పూర్తిగా చెల్లించేశామని 2012 తరువాత రామోజీ తాపీగా ప్రకటించారు.

దీనిపై ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. డిపాజిట్లు ఎవరెవరి నుంచి ఎంతెంత సేకరించారు..? ఎవరెవరికి ఎంతెంత డిపాజిట్లు ఏయే తేదీల్లో చెల్లించారు...? నగదు రూపంలో చెల్లించారా? చెక్కుల రూపంలో చెల్లించారా? అనే వివరాలు వెల్లడించేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ వాస్తవాలు ఏమిటో వెలికి తీసేందుకు ప్రయత్నించాల్సి ఉండగా... నాడు అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వంగానీ, ఆ తరువాత చంద్రబాబు సారథ్యంలోని టీడీపీ సర్కారుగానీ ఉద్దేశపూర్వకంగానే మౌనం దాల్చాయి.

తద్వారా రామోజీరావు ఆర్థిక అక్రమాలకు పరోక్షంగా వత్తాసు పలికాయి. దాంతో రామోజీరావు తాను సేకరించిన అక్రమ డిపాజిట్ల వివరాలు చెపాల్సిన అవసరం లేదంటూ వితండవాదాన్ని వినిపించారు. తమకు ఎలాంటి క్రిమినల్‌ లయబులిటీ లేదని వాదిస్తూ వచ్చారు. ఈ క్రమంలో 2018 డిసెంబర్‌ 21న (ఉమ్మడి హైకోర్టు చివరి పనిదినాన)  మార్గదర్శి ఫైనాన్సియర్స్‌పై కేసును ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. డిపాజిటర్ల ప్రయోజనాల కోసం ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేయాల్సిన నాటి చంద్రబాబు సర్కారు ఏమీ పట్టనట్లు మౌనంగా ఉండిపోయింది. తద్వారా రామోజీ ఆర్థిక అక్రమాలకు చంద్రబాబు దన్నుగా నిలిచారు. 

అక్రమ డిపాజిట్లే... ఆర్థిక నేరస్తుడే: ఆర్బీఐ స్పష్టీకరణ
ఆర్బీఐ చట్టం సెక్షన్‌ 45 ఎస్‌ను ఉల్లంఘిస్తూ మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమ డిపాజిట్లు వసూలు చేసినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి సోదాహరణంగా వివరించింది. ఆ డిపాజిట్లను ఎవరెవరికి తిరిగి చెల్లించారో.. ఎంతెంత చొప్పున చెల్లించారో వివరాలు వెల్లడించాల్సిందేనని వాదించింది.  ఈ కేసు న్యాయస్థానంలో విచారణలో ఉండగానే మరో రూ.2 వేల కోట్ల వరకు అక్రమ డిపాజిట్లు సేకరించారని సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చింది.

ఈ కేసులో పార్టీ పర్సన్‌ ఇన్‌చార్జ్‌గా ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ సెక్షన్‌ 45 ఎస్‌ కింద హెచ్‌యూఎఫ్‌ సంస్థలు డిపాజిట్లు సేకరించవచ్చా? లేదా? అన్నదానిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తరఫు న్యాయవాది రమేశ్‌బాబు తన వాదనలు వినిపిస్తూ ‘ఆర్బీఐ చట్టంలోని సెక్షన్‌ 45 ఎస్‌ ప్రకారం ఇన్‌కార్పొరేటెడ్‌ కంపెనీలు మినహా ఇతర సంస్థలు, వ్యక్తులు డిపాజిట్లు సేకరించకూడదు.

హెచ్‌యూఎఫ్‌ కూడా డిపాజిట్లు సేకరించడానికి వీల్లేదు. కాబట్టి హెచ్‌యూఎఫ్‌ పేరిట మార్గదర్శి ఫైనాన్షియర్స్‌ డిపాజిట్లను సేకరించడం అక్రమమే, చట్ట విరుద్ధమే. రామోజీ ఆర్థిక నేరస్తుడే ’అని విస్పష్టంగా తేల్చి చెప్పారు. దీంతో ఈ కేసులో రిజర్వు బ్యాంక్‌ను కూడా పార్టీగా చేర్చి సుప్రీంకోర్టు విచారణను కొనసాగించింది.

కేసును నిలబెట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్‌­సీపీ ప్రభుత్వం ఈ కేసు విషయంలో డిపాజిట్‌దారుల ప్రయోజనాలను కాపాడుతూ బాధ్యతాయుతంగా వ్యవహరించింది. మార్గదర్శి ఫైనాన్సియర్స్‌కు వ్యతిరేకంగా ఉండవల్లి అరుణ్‌కుమార్‌ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌లో ఏపీ ప్రభుత్వం ఇంప్లీడ్‌ అయ్యింది. దీంతో ఈ కేసు నీరుగారిపోకుండా చూడగలిగింది. ఈ నేపథ్యంలో మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ వసూలు చేసిన అక్రమ డిపాజిట్లు వివరాలను సమర్పించాలని సుప్రీంకోర్టు గత ఏడాది ఆదేశించింది. 

‘ఈనాడు’కు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం
ఎప్పటి మాదిరిగానే పత్రికా స్వేచ్ఛ ముసుగులో తన అక్రమాలను కప్పిపుచ్చు­కునేందుకు రామోజీ వేసిన ఎత్తుగడను సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. ఈనాడు పత్రికకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకం కాబట్టే ఈ కేసు విషయంలో ఇంత పట్టుబ­డుతోందని రామోజీ తరపున ప్రముఖ న్యాయ­వాదులు ముకుల్‌ రోహత్గీ, లూథ్రా, అభిషేక్‌మను సింఘ్వీలు వాదించినా ఫలితం లేకపోయింది. ఈ అంశానికి, అక్రమ డిపా­జిట్లకు సంబంధం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.

ఈనాడు పత్రికకు వ్యతిరేకంగా ఉండొద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించలేం అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు వ్యాఖ్యా­నించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక ఎన్నికలు ఉన్నందునే ఈ కేసుపై ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోందన్న రామోజీ తరపు న్యాయవాదుల వాదనలతో అత్యు­న్నత న్యాయస్థానం సమ్మతించలేదు. ‘ఎన్నికలు ఉంటే ఈనాడుకు ఏమైంది? ఈనాడు ఏమీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు కదా..? ఈనాడు కేవలం ఓ పత్రికే కదా..? ఎన్నికలతో ఏం సంబంధం?’ అని న్యాయ­స్థానం వ్యాఖ్యానించడం గమనార్హం.

దీంతో ఉండవల్లి అరుణ్‌ కుమార్‌పైకి నెపాన్ని నెట్టివేసేందుకు రామోజీ తరపు న్యాయ­వాదులు విఫలయత్నం చేశారు. ఉండవల్లి ఓ రాజకీయ నేత అని పేర్కొంటూ గతంలో హైకోర్టు తీర్పుపై వ్యతిరేక వ్యాఖ్యలు చేశారంటూ తెలుగులో ఉన్న వీడియో రికార్డులు తర్జుమా చేసి మరీ వినిపించారు. అయితే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించవచ్చని, అదేమీ తప్పు కాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. న్యాయస్థానాల తీర్పులపై విశ్లేషణలు జరగాలనే తాము కోరుకుంటా­మని తెలిపింది.

ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ లాంటి చదువుకున్న వ్యక్తులు విశ్లేషిస్తే మరింత మంచిదని కూడా వ్యాఖ్యానించింది. మేమే హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేస్తున్నాం కదా...? అంటే న్యాయస్థానాల తీర్పుపై విశ్లేషించినట్లే కదా? అని ప్రశ్నించింది. దాంతో తప్పించుకునేందుకు రామోజీ వేసిన అన్ని ఎత్తుగడలు బెడిసికొట్టాయి. అక్రమ డిపాజిట్ల కేసును తెలంగాణ హైకోర్టు ఆరు నెలల్లో విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

యావజ్జీవ ఖైదు...రెండింతల జరిమానా!
మార్గదర్శి ఫైనాన్సియర్స్‌ అక్రమ డిపాజిట్ల కేసులో నేరం నిరూపితమైతే రామోజీరావుకు రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్ష వరకు పడే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేశారు. దీంతోపాటు ఆయన సేకరించిన అక్రమ డిపాజిట్లు రూ.2,600 కోట్లకు రెట్టింపు జరిమానా విధించవచ్చన్నారు. దీన్నిబట్టి రామోజీకి రెండేళ్ల నుంచి యావజ్జీవ జైలు శిక్షతో పాటు రూ.5,200 కోట్ల జరిమానా చెల్లించాలని తీర్పు వెలువడే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement