వేర్‌ ఈజ్‌ పోలీస్‌ ప్రభుత్వం? | Chandrababu Govt Support Hindupuram Gang Rape Accused | Sakshi
Sakshi News home page

వేర్‌ ఈజ్‌ పోలీస్‌ ప్రభుత్వం?

Published Tue, Oct 15 2024 4:53 AM | Last Updated on Tue, Oct 15 2024 4:53 AM

Chandrababu Govt Support Hindupuram Gang Rape Accused

హిందూపురం సామూహిక అత్యాచార నిందితులకు ప్రభుత్వ అండ!

కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు

మూడు రోజులైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయని పోలీసులు

ఆరుగురు అత్యాచారానికి పాల్పడినట్లు చెబుతున్న సీసీ కెమెరాల ఫుటేజి

వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఈ ముఠా నాయకుడిని వదిలేయడంపై అనుమానాలు

బాధితులను పరామర్శించేందుకు కూడా అనుమతించని పోలీసులు

చంద్రబాబు ప్రభుత్వ తీరుపై సర్వత్రా ఆగ్రహం

సాక్షి, అమరావతి/ సాక్షి, పుట్టపర్తి: చంద్రబాబు రెడ్‌ బుక్‌ రాజ్యాంగ అరాచకం రాష్ట్రంలో విశృంఖలంగా సాగిపోతోంది. అమా­య­కులను వేధింపులకు గురిచేస్తూ, నేరగాళ్లకు అండగా నిలుస్తూ చంద్రబాబు ప్రభుత్వం పాలన సాగి­స్తోంది. గత 4 నెలల్లో రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న అరాచ­కాలే ఇందుకు నిద­ర్శనం. తాజాగా దసరా రోజున శ్రీ సత్య­సాయి జిల్లా హిందూ­పురం నియోజ­కవర్గంలోని నల్ల బొమ్మ­న­­పల్లిలో అత్త, కోడలిపై సామూ­హిక అత్యాచా­రానికి పాల్పడిన ఆగంతకులకు టీడీపీ సర్కార్‌ కొమ్ముకాస్తూ.. కేసును పక్క­దారి పట్టించేందుకూ ప్రయత్నిస్తోంది. 

ఇందులో భాగంగానే దారుణం జరిగి మూడు రోజులైనా పోలీసులు ఇంతవరకు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయలేదు. పైపెచ్చు ఈ ముఠాక నాయకుడైన యువకుడిని ఇంతవరకు అరెస్టు చేయలేదు. టీడీపీ నేతలు పెంచి పోషిస్తున్న ఈ నేరగాళ్ల ముఠాకు పొట్ట కూటి కోసం పొరుగు రాష్ట్రం నుంచి వచ్చిన కుటుంబం బలైపోయింది. ఓ పేపర్‌ మిల్లులో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న తండ్రి, కొడుకుపై వారి ఇంటి ఎదుటే దాడి చేశారు. అడ్డుకునేందుకు వచ్చిన వాచ్‌మేన్‌ భార్య, కోడలిని బలవంతంగా ఇంట్లోకి ఎత్తుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. 

ఆత్తా కోడళ్లను బలవంతంగా ఎత్తుకుపోతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పైగా, ఈ కేసును తప్పుదారి పట్టించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు నిందుతలకు ప్రభుత్వ వత్తాసును స్పష్టంచేస్తున్నాయి. ఆరుగురు నిందితులు అత్యాచారానికి పాల్పడ్డారని సీసీ టీవీ రికార్డులు స్పష్టంగా చెబుతున్నాయి. 

వారిలో అయిదుగురిని మాత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. కానీ ఆ ముఠాకు నాయకుడిగా ఉన్న యువకుడిని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. చంద్రబాబు ప్రభుత్వం తీరు పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసలీ రాష్ట్రంలో పోలీసులున్నారా.. ప్రభుత్వముందా అంటూ ప్రజలు, విపక్షాలు, ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు ప్రశ్నిస్తున్నాయి.

బాధితులను పరామర్శించేందుకు అనుమతినివ్వని పోలీసులు అత్యాచార బాధితులను కలిసేందుకు ప్రతిపక్ష నేతలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం అనుమతించడంలేదు. బాధితులను పరామర్శించేందుకు వైఎస్సార్‌సీపీ నేతలు ప్రయత్నించినా పోలీసులు సమ్మతించలేదు. బాధితులను కలిసేందుకు ఎవరినీ అనుమతించడంలేదని పోలీసులు చెబుతున్నారు. 

బాధితులపై ఒత్తిడి తెచ్చి, నిజాలకు పాతరేసి, కేసును పక్కదారి పట్టించాలన్న ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఇతరులెవ్వరూ బాధితులను కలిసేందుకు అనుమతించడంలేదు. ప్రతిపక్ష నేతలు, మహిళా సంఘాల ప్రతినిధులు బాధితులను కలసి మాట్లాడితే వారు వాస్తవాలు వెల్లడించే అవకాశం ఉన్నందునే ఎవర్నీ అనుమతించడం లేదన్నది సుస్పష్టం.

రాష్ట్రమంతా ఇదే దారుణకాండ
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రవ్యాపంగా మహిళలు, యువతులపై అత్యాచారాలకు అడ్డూ అదుపు లేకుండాపోతోంది. నంద్యాల జిల్లా ముచ్చిమర్రులో ఓ  బాలికను అపహరించి అత్యాచారం చేసి హత్య చేశారు. ఇది జరిగి నాలుగు నెలలైనా ఆ చిన్నారి మృతదేహాన్ని కూడా ఆమె తల్లిదండ్రులకు అప్పగించలేకపోయారు. 

ఇక పుంగనూరులో ఇటీవల ఓ ముస్లిం బాలికను అపహరించి హత్య చేశారు. తమ బిడ్డను ఎవరో అపహరించుకుపోయారని ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా అయిదు రోజులు పోలీసులు కాలయాపన చేశారు తప్ప, ఆ చిన్నారిని రక్షించే ప్రయత్నం చేయలేదు. నిత్యం బాలికలు, మహిళలపై లైంగిక దాడులు, అరాచకాలతో రాష్ట్రం అల్లకల్లోలమవుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడమేలేదు.

వేర్‌ ఈజ్‌ ఎమ్మెల్యే బాలకృష్ణ
నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో విలన్‌ ఓ మహిళా అధికారిని ఆమె కుమారుడి ఎదుటే అత్యాచారం చేస్తారు. ఆ సినిమాలో హీరో పాత్రధారి బాలకృష్ణ ఆ విలన్‌ను చంపి శిక్షిస్తాడు. అంతేకాదు.. మహిళల ఔన్యత్యాన్ని కీర్తిస్తూ భారీ డైలాగులు చెబుతారు.. కట్‌ చేస్తే.. అదే హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరుసగా మూడోసారి ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఆగంతకులు అత్త, కోడలిపై వారి ఇంట్లోనే సామూహికంగా అత్యాచారానికి పాల్పడ్డారు. 

తన నియోజకవర్గంలోనే జరిగిన ఈ ఘోరంపై ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందించనే లేదు. కనీసం పోలీసులతో మాట్లాడి నిందితులను వెంటన అరెస్ట్‌ చేయమని ఆదేశించనూ లేదు. బాధిత కుటుంబాన్ని పరామర్శించనూ లేదు. సినిమా షూటింగ్‌లతో కాలక్షేపం చేస్తున్నారు. అందుకే హిందూపూర్‌ ప్రజలే కాదు.. యావత్‌ రాష్ట్రం ‘వేర్‌ ఈజ్‌ పోలీస్‌.. వేర్‌ ఈజ్‌ ప్రభుత్వం.. వేర్‌ ఈజ్‌ బాలకృష్ణ’ అని ప్రశ్నిస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement