అవకాశవాద రాజకీయాల్లో చంద్రబాబు దిట్ట అని, గత ఎన్నికల్లో గెలిచేందుకు, తనపై కేసులు లేకుండా చేసుకునేందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు.
సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి
సాక్షి, అమరావతి: అవకాశవాద రాజకీయాల్లో చంద్రబాబు దిట్ట అని, గత ఎన్నికల్లో గెలిచేందుకు, తనపై కేసులు లేకుండా చేసుకునేందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. తాను సంతకం చేయడం వల్లే తెలంగాణ వచ్చిందని హైదరాబాద్‌లో చెప్పిన చంద్రబాబు విజయవాడ నవ నిర్మాణ దీక్షలో మాత్రం నవ్యాంధ్రకు జూన్ 2న బ్లాక్‌డేగా చెప్పడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.
రాజ్యసభ సభ్యుడు డి.రాజా, రాష్ట్ర పార్టీ కార్యదర్శి కె.రామకృష్ణలతో కలసి సురవరం విజయవాడ దాసరి భవన్‌లో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ఏర్పాటు చేసిన సభకు ఎవరూ వెళ్లవద్దని చెప్పడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమన్నారు.ఇప్పటికైనా కల్లబొల్లి మాటలను కట్టిపెట్టి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఏపీకి ప్రత్యేక హోదాను కల్పించేందుకు పార్లమెంటు బయటా, వెలుపలా ఒత్తిడి పెంచాలని హితవు పలికారు.
17 పార్టీల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి..
రాష్ట్రపతి ఎన్నికల విషయమై ఇటీవల 17 రాజకీయ పార్టీలు సమావేశమై చర్చించినట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు డి.రాజా చెప్పారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడే లౌకిక సెక్యూలర్ భావాలు కలిగిన వ్యక్తిని రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ నిలుపుతామని వెల్లడించారు.