‘ ప్రజలను పక్కదారి పట్టించేందుకే మత రాజకీయాలు’
హైదరాబాద్: బీజేపీ నాయకులు ప్రజల సమస్యలను పక్కన పెట్టి మతాల మధ్య చిచ్చు పెట్టే అంశాలను తెరపైకి తెస్తున్నారని దేశంలో ప్రజాస్వామ్యాన్ని, లౌకికవాదాన్ని కాపాడుకునేందుకు నిరంతరం పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీసీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. బుధవారం పెద్ద అంబర్‌పేట్ నగర పంచాయతీ రావి నారాయణ కాలనీలో బాలవికాస్ సంస్థ ఏర్పాటు చేసిన నీటి శుద్ధి ప్లాంట్‌ను, సీసీ రోడ్డు నిర్మాణం పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... దేశంలో సమస్యలే లేనట్లు అయోధ్యలో రామమందిరం నిర్మిస్తాం, గోవధను నిషేధిస్తాం అంటూ బీజేపి నాయకులు ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని అరోపించారు. రామ మందిర నిర్మాణానికి అడ్డొస్తే తల నరుకుతానంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ హైదరాబాద్‌లో కూర్చుని ప్రకటన చేయడం తగదని చెప్పారు. చట్టాన్ని ఉల్లంఘించి రామాలయ నిర్మాణాన్ని చేపడితే న్యామూర్తులు, చట్టం అడ్డు వస్తుందని వారిని ఆయన నరక గలడా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ ధర్నా చౌక్‌ను ఎత్తివేయడం వల్ల ప్రజలు, ప్రతిపక్షాల ఆగ్రహాన్ని అణచి వేయలేరని అన్నారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో విద్య, వైద్యం వ్యాపారంగా మారాయని, దీనిపై పోరాటాలు చేయాల్సి వస్తోందని తెలిపారు.