అమిత్‌షా 21వ శతాబ్దపు గోబెల్స్
♦ సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం
♦ ఫాసిస్టు చర్యలకు పాల్పడుతున్న మోదీ, సంఘ్ దీనిపై పోరుకు సెక్యులర్లు కలసిరావాలి
♦ ముగిసిన సీపీఐ జాతీయ కార్యవర్గ సమావేశాలు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా 21 వ శతాబ్దపు గోబెల్స్ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి ధ్వజమెత్తారు. ఒక అబద్ధాన్ని పదే పదే, కొన్ని వందలసార్లు చెప్పి ప్రజలను నమ్మించడంలో అభినవ గోబెల్స్‌గా అమిత్‌షా మారారని విమర్శించారు. హెచ్‌సీయూలో రోహిత్ ఆత్మహత్య, జేఎన్‌యూలో కన్హయ్యపై దేశద్రోహం కేసు ఇలా యూనివర్శిటీలపై బీజేపీ ప్రభుత్వం, సంఘ్ పరివార్ కలిసి అసాధారణ దాడికి దిగుతున్నాయన్నారు. వామపక్ష, ప్రజాతంత్ర భావాలు కలవారు, బీసీ, ఎస్సీ వర్గాలు కలసి ఈ ఫాసిస్టు దాడులను ఎదుర్కోవాలని పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన పిలుపునిచ్చారు.
మంగళవారం రెండు రోజుల జాతీయ కార్యవర్గ భేటీ ముగింపు సందర్భంగా హైదరాబాద్‌లోని మఖ్దూంభవన్‌లో పార్టీ నాయకులు షమీమ్ ఫైజీ, కె.నారాయణ, అతుల్‌కుమార్ అంజన్, అమర్‌జిత్‌కౌర్, చాడ వెంకటరెడ్డిలతో కలసి సుధాకరరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.వర్సిటీలపై బీజేపీ దాడులను మానుకోవాలని, కన్హయ్యపై ఉన్న కేసులను ఎత్తివేయాలని, కాషాయీకరణ ప్రయత్నాలను మానుకోవాలని.. లేనిపక్షంలో తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో బీజేపీ వైఫల్యం నేపథ్యంలో ప్రజలకు దూరమై, వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలవుతోందన్నారు.
ఈ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఫాసిస్ట్ పద్ధతుల్లో భౌతికదాడులకు సంఘ్ పరివార్, బీజేపీ తెర తీశాయని తీవ్రస్థాయిలో ఆరోపించారు. కేంద్ర కార్మిక సంఘాల హెచ్చరికల ఫలితంగానే ఈపీఎఫ్‌పై పన్ను వేయాలనే ఆలోచనను కేంద్రం విరమించుకుందని, ఇది కార్మిక సంఘాల విజయమని అభివర్ణించారు. యూనివర్సిటీల్లో ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పడకుండా ఏబీవీపీని నియంత్రించేలా బీజేపీ చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య.. విశ్వవిద్యాలయాల్లో ఉద్యమాలు కాదు చదువుకోవాలని చెబుతున్నారని, విద్యార్థి సంఘ నాయకుడిగానే ఆయన ఎదిగిన విషయాన్ని మరిచిపోయారా అని ప్రశ్నించారు. వర్సిటీలపై సంఘ్ పరివార్, బీజేపీ దాడులను, వాటి వెనుక ఉన్న మతోన్మాద రాజకీయాలను ఎండగడుతూ పార్టీ శాఖలు విస్తృతస్థాయిలో ప్రచార కార్యక్రమాలు, నిరసనలను చేపట్టాలని పిలుపునిస్తూ చేసిన తీర్మానాన్ని కార్యవర్గం ఆమోదించింది. ఏప్రిల్‌లో ‘ప్రజల వద్దకు పక్షం(15 రోజులు) రోజులు’ కార్యక్రమాన్ని చేపట్టి, సైద్ధాంతిక, రాజకీయ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించింది.
బెంగాల్‌లో కాంగ్రెస్‌తో పొత్తు లేదు...
పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో వామపక్ష కూటమిగానే పోటీచేస్తామని కాంగ్రెస్‌తో ఎలాంటి పొత్తు ఉండదని సురవరం ఒక ప్రశ్నకు బదులిచ్చారు. తమ పార్టీ లెఫ్ట్‌ఫ్రంట్ కూట మితో కలసి బెంగాల్‌లో 16 సీట్లకు, కేరళలో 29 లేదా 30 సీట్లలో, అసోంలో 18 సీట్లకు, తమిళనాడులో 65 స్థానాల్లో, పాండిచ్చేరిలో 12 సీట్లకు పోటీ చేయనున్నట్లు తెలిపారు.