‘మద్దతు ఇచ్చేది లేదు..’
హైదరాబాద్: రాష్ట్రపతి అభ్యర్ది ఎంపికలో బీజేపీ ప్రభుత్వానిది కుటిల రాజకీయ నీతి అని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శించారు. ప్రతిపక్షాలతో చర్చల పేరుతో కాలయాపన చేస్తూ ఏక పక్షంగా అభ్యర్దిని ప్రకటించిందని అన్నారు. దేశ వ్యాప్తంగా దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందన్నారు. దళితున్ని రాష్ట్రపతి అభ్యర్దిగా ప్రకటించి, దళిత వర్గంలో తమ పార్టీపై ఉన్న వ్యతిరేకతను తగ్గించుకోవాలనే నీచమైన ఎత్తుగడ వేసిందని అన్నారు.
మంగళవారం ఆయన రాష్ట్ర పార్టీ కార్యాలయం మఖ్ధుం భవన్‌లో జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. గో సంరక్షణ పేరుతో సంఘ్ పరివార్ శక్తులు దళితులు, మైనార్టీలపై దాడులు చేస్తున్నాయని తెలపారు. అయినా ప్రభుత్వం తరుపున ఎలాంటి నియంత్రణ చర్యలు చేపట్టకపోవటంపై బీజేపీ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. దళిత మోర్చా అధ్యక్షునిగా పని చేసి ప్రస్తుత బీజేపీ రాష్ట్రపతి అభ్యర్ది రామ్‌నాథ్ కోవింద్ కూడా ఏనాడు సంఘ్ పరివార్ దాడులను ఖండించలేదని అన్నారు. అలాంటి వారికి వామపక్షాలుగా తాము మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేశారు.