ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత సి. రామచంద్రయ్య మండిపడ్డారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ సీనియర్ నేత సి. రామచంద్రయ్య మండిపడ్డారు. రేవంత్ రెడ్డి కేసులో చంద్రబాబు మౌనంగా ఉండటమే తప్పు చేశాడనటానికి నిదర్శనయని అన్నారు. చంద్రబాబు చేపట్టేది నవ నిర్మాణ దీక్ష కాదు.. నయ వంచన దీక్ష అంటూ ఆయన విమర్శించారు. రేవంత్ ఎపిసోడ్కు చంద్రబాబే కుట్రదారు అనడానికి ఆధారాలున్నాయని ఆయన అన్నారు. రేవంత్ కేసుపై విచారణ నిష్పక్షపాతంగా జరగాలంటే సీఎం పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలి.
అదే విధంగా పార్టీ అధ్యక్ష పదవికి కూడా చంద్రబాబు రాజీనామా చేయాలని రామచంద్రయ్య డిమాండ్ చేశారు. అవినీతి, రాజకీయ కుట్రల వల్ల రాష్ట్రాన్ని రెండుగా విభజన చేయించటం చంద్రబాబు దివాలాకోరు రాజకీయానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. రాష్ట్రాన్ని విభజించాలంటూ లేఖ ఇచ్చిన చంద్రబాబు కుట్రలో భాగస్వామ్యం అని ఒప్పుకుంటారా అని రామచంద్రయ్య ప్రశ్నించారు. అదే విధంగా ప్రభుత్వ వైఫల్యాలకు కారణాలేంటో చెప్పాలని చంద్రబాబును ఈ సందర్భంగా రామచంద్రయ్య డిమాండ్ చేశారు.