ఆంధ్రాకి న్యాయం చేసి తెలంగాణ ఇవ్వమన్నా
విజయవాడ: రాష్ట్రాన్ని విభజించదలచుకుంటే ఆంధ్రాకి న్యాయం చేసి తెలంగాణ ఇవ్వమని యూపీఏ సర్కార్కు విజ్ఞప్తి చేశానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడు తెలిపారు. తన విజ్ఞప్తిని పక్కన పెట్టి యూపీఏ ప్రభుత్వం ఏక పక్షంగా రాష్ట్రాన్ని విడగొట్టారని ఆయన ఆరోపించారు. మంగళవారం బెంజి సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో చంద్రబాబు ప్రసంగించారు. ఓట్లు కావాలని.. సీట్లు గెలవాలని సోనియాగాంధీ భావించారు. అందుకోసమే హేతుబద్దత లేకుండా రాష్ట్రాన్ని విభజించారని ఆరోపించారు. విభజనపై జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ ఏర్పాటు చేసి... ఆ నివేదికను పక్కన పెట్టి మరీ రాష్ట్రాన్ని విభజించారని విమర్శించారు. సోనియా గాంధీకి డబ్బుపై మమకారం ఎక్కువని... అందుకే 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని దోపిడి చేయించారని చంద్రబాబు ఆరోపించారు.
అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగంతోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సాకారమైందని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగువారి కోసమే ఆంధ్రప్రదేశ్ను ఏర్పాటు చేశారన్నారు. తెలుగుజాతి ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటింది ఎన్టీఆర్ అని చంద్రబాబు స్పష్టం చేశారు. అంతకుముందు ఏలూరు రోడ్డు నుంచి బెంజిసర్కిల్ వరకు చంద్రబాబు పాదయాత్ర నిర్వహించారు.