
ప్రకాశం టీడీపీలో వర్గ విబేధాలు
చంద్రబాబు సర్కారు ఈ నెల 2 నుంచి 8 వరకు తలపెట్టిన నవనిర్మాణ సభలకు ఆ పార్టీ వర్గ విభేదాల సెగ తప్పలేదు.
► పోటాపోటీగా తమ్ముళ్ల నవ నిర్మాణ సభలు
► అద్దంకిలో కరణం వర్సెస్ గొట్టిపాటి
► గిద్దలూరులో అన్నా వర్సెస్ ముత్తుముల
► కందుకూరులో హాజరు కాని నేతలు
► కొత్త నేతలపై పాత నేతల ఎదురుదాడి
► కొనసాగుతున్న విమర్శలు
ఒంగోలు: చంద్రబాబు సర్కారు ఈ నెల 2 నుంచి 8 వరకు తలపెట్టిన నవనిర్మాణ సభలకు ఆ పార్టీ వర్గ విభేదాల సెగ తప్పలేదు. అందరూ కలిసి నవనిర్మాణ కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి పిలుపివ్వడంతో కొత్తగా చేరిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జులు పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నారు. ఒకరు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మరొకరు హాజరుకావడం లేదు. వారి అనుచరవర్గం సైతం ఇదే పంథాలో నడుస్తోంది.
తలోదారైన తమ్ముళ్లు జిల్లాలోని గిద్దలూరు, అద్దంకి నియోజకవర్గాల పరిధిలో నేతలు పోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, కందుకూరు నియోజకవర్గంలో శనివారం జరిగిన కార్యక్రమానికి ఇద్దరు నేతలు హాజరుకాలేదు. అద్దంకిలో మొదలైన విభేదాల పరంపర మిగిలిన నియోజకవర్గాలకు చుట్టుకుంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ అధికార పార్టీలో చేరిన వెంటనే కరణం బలరాం ఐదు మండలాల పరిధిలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు ఎమ్మెల్యే గొట్టిపాటి వర్గం హాజరుకాలేదు. పైగా కరణం గొట్టిపాటిపై బహిరంగ విమర్శలకు దిగి రాష్ట్రస్థాయిలో దుమారం రేపారు. ఇక గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అధికార పార్టీలో చేరడాన్ని ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అన్నా రాంబాబు అంగీకరించే పరిస్థితి లేదు. ఈ నెల 2న అన్నా రాంబాబు గిద్దలూరులో భారీ బలసమీకరణ చేసి నవనిర్మాణ ర్యాలీ, సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి అనుచరులు హాజరుకాలేదు.
ఈ సందర్భంగా కార్యకర్తలకు అన్యాయం జరిగితే కట్టె పట్టుకొని రోడ్డుపైకి వస్తానంటూ అన్నా హెచ్చరికలు జారీ చేసిన విషయం విదితమే. ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం గిద్దలూరులో జరిగిన నవనిర్మాణ సభకు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి హాజరైన అన్నా వర్గం మాత్రం హాజరు కాలేదు. పాత టీడీపీ నేతలు సభకు రాకపోవడం, ఎమ్మెల్యే వెంట అనుచరులు కూడా సభకు వెళ్లకపోవడంతో నవనిర్మాణ æసభ వెలవెలబోయింది. ఇక కందుకూరులో శనివారం జరిగిన నవనిర్మాణసభకు కొత్తగా పార్టీలో చేరిన పోతుల రామారావు హాజరు కాకపోగా, నియోజకవర్గ ఇన్‌చార్జి దివి శివరాం మాత్రమే హాజరయ్యారు. మూడు నియోజకవర్గాల్లో కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను పాత నేతలెవ్వరూ స్వాగతించిన పాపానపోలేదు. దీంతో వర్గ విభేదాలు సమసిపోయే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో నవనిర్మాణ దీక్షల్లో ఇరువర్గాల నేతలు కలిసి పాల్గొనే అవకాశం కనిపించటం లేదు.
ఈ నెల 2 నుంచి 8 వరకు ప్రభుత్వం నవనిర్మాణ æదీక్షలను చేపడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2న నవనిర్మాణ æదీక్ష ప్రతిజ్ఞతో ప్రారంభమయ్యే ఈ సభలు అశాస్త్రీయ రాష్ట్ర విభజన–దాని ప్రభావం, ఇబ్బందులపై నియోజకవర్గాల్లో సదస్సులు, 4న ప్రతికూల పరిస్థితుల్లో ప్రభుత్వం సాధించిన విజయాలు, 5న వ్యవసాయ అనుబంధ రంగాల్లో సాధించిన ప్రగతి, 6న పరిశ్రమలు, సేవా రంగంలో ప్రగతి, 7న రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలు, 8వ తేదీన ముగింపు సభలు నిర్వహించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ప్రభుత్వ ఖర్చుతో అధికారుల నేతృత్వంలో నవనిర్మాణ సభలు నిర్వహించాలని చెప్పినా.. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు విరివిగా హాజరై ప్రభుత్వ కార్యక్రమాలను ప్రచారం చేసుకోవడమే ప్రధాన ఉద్దేశం. అధికార వర్గాలతో పాటు శాసనసభ్యులు మొదలుకొని మిగిలిన ప్రజాప్రతినిధులు సభలకు హాజరుకావాలని పిలుపునిచ్చినా తమ్ముళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.