టీడీపీ నాయకులపై విమర్శలు చేస్తున్న జనసేన నేత బాలసుబ్రహ్యణ్యం
ఒంగోలు టౌన్: అంగన్‌వాడీ కార్యకర్తల సాక్షిగా టీడీపీ, జనసేన నేతల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. చంద్రబాబు సీఎం అయ్యాక అంగన్‌వాడీల సమస్యలు పరిష్కారం అవుతాయని టీడీపీ నేతలు పేర్కొనగా.. జనసేన నాయకులు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. టీడీపీ నాయకులు ముందుగానే చంద్రబాబు సీఎం అని ప్రకటించడాన్ని తప్పుబట్టారు.
పవన్‌కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని జనసేన నాయకులు, కార్యకర్తలు కోరుకుంటున్నారని స్పష్టంచేశారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా కలెక్టరేట్ ఎదుట సోమవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేస్తున్న అంగన్‌వాడీలకు మద్దతు తెలిపేందుకు టీడీపీ ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ సోమవారం దీక్షా శిబిరం వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా బాలాజీ ప్రసంగిస్తూ.. రానున్న ఎన్నికల తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఖాయమని, అంగన్‌వాడీల సమస్యలను ఆయన దృష్టికి తీసుకుని వెళతానని చెప్పారు.
చంద్రబాబే ముఖ్యమంత్రి అని ఎలా చెబుతారు?
ఆ తరువాత జనసేన నాయకుడు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికల తరువాత చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని టీడీపీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ చెప్పడాన్ని తప్పుపట్టారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని ఇప్పుడే ఎలా చెబుతారని, ఎన్నికల తరువాత కూటమిలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే వారే ముఖ్యమంత్రి అవుతారని స్పష్టంచేశారు.
2014లో పవన్ కళ్యాణ్ మద్దతుతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు చాలా తప్పులు చేశారని, ఇప్పుడు కూడా ఆయన అలాగే తప్పులు చేస్తే పవన్ కళ్యాణ్ సహించరని హెచ్చరించారు. కాగా.. అంగన్‌వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి ఈదర అన్నపూర్ణమ్మ కూడా నూకసాని బాలాజీ వ్యాఖ్యలపై గట్టి కౌంటర్ ఇచ్చారు.
అంగన్‌వాడీలకు ఎంత జీతం ఇస్తారో అంకెలతో సహా టీడీపీ మేనిఫెస్టోలో పేర్కొనాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అంగన్‌వాడీ కార్యకర్తలను గుర్రాలతో తొక్కించడం తాము మరిచిపోలేదని కొందరు అంగన్‌వాడీలు చెప్పుకోవడం కనిపించింది.
జనసేనలో ఆధిపత్య పోరు
ఇదే సందర్భంలో జనసేన పార్టీలో ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. అంగన్‌వాడీలకు మద్దతు ఇవ్వడానికి వచ్చిన జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్ మధ్య పోరు మరోసారి రచ్చకెక్కింది. తొలుత జనసేన తరఫున ప్రసంగించడానికి అరుణకు మైకు ఇచ్చారు. అయితే.. ఆమె నుంచి మైకు లాక్కుని రియాజ్‌ను ప్రసంగించాల్సిందిగా కొందరు కార్యకర్తలు కోరారు. రియాజ్ ప్రసంగించిన తరువాత తన అనుచరులతో కలిసి వెళ్లిపోయారు. కాగా.. ఇటీవల ఒంగోలు గద్దలగుంటలో జరిగిన కార్యక్రమంలోనూ రియాజ్, అరుణ వర్గాల మధ్య వివాదం జరిగింది.
Comments
Please login to add a commentAdd a comment