దీక్షల పేరిట ఇంకా మోసం చేస్తున్నారు: రఘువీరా
విజయవాడ : ప్రత్యేక హోదా, విభజన హామీ చట్టాల అమలు కోసం ఆందోళన చేస్తున్న వారి దీక్షను భగ్నం చేయడం దారుణమని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. ప్రత్యేక హోదా, విభజన అంశాల అమలు కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్న నిరాహార దీక్షలను ఆయన విరమింపజేశారు. చంద్రబాబు హస్తం భస్మాసుర హస్తమన్నారు. నవ నిర్మాణ దీక్షల పేరిట చంద్రబాబు కోట్లాది రూపాయలు నాశనం చేస్తున్నారని, నవ నిర్మాణ దీక్షల కోసం పిల్లలను తీసుకువచ్చి హింసిస్తున్న చంద్రబాబు ఒక శాడిస్టు అని విమర్శించారు. రోడ్లను బ్లాక్ చేసి ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించారన్నారు.
జూన్ 4న కాంగ్రెస్ ఆధ్వర్యంలో జరగనున్న సభ ద్వారా ప్రత్యేక హోదా అంశం అవసరాన్ని పాలకులకు తెలియజేస్తామని, ఇక మీదట తాము కూడా పోరాటాలను రోడ్డు మీద చేస్తామని చెప్పారు. మూడేళ్లు గడుస్తున్నా చంద్రబాబు నవ నిర్మాణ దీక్షలు చేయటం దారుణమని ప్రత్యేక హోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ అన్నారు. విభజన హామీల అమలుకు కమిటీని వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చంద్రబాబు దీక్షల పేరిట ఇంకా ఏపీ ప్రజలను మోసం చేయటం దారుణమన్నారు.