సాక్షి, అనంతపురం : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన టీడీపీ-కాంగ్రెస్ మైత్రి ఆంధ్రప్రదేశ్‌లోనూ కొనసాగుతుంది. ఇప్పటికే టీడీపీ, జనసేన బంధం తేటతెల్లం కాగా ...తాజాగా టీడీపీ-కాంగ్రెస్ బంధం కూడా మరోసారి బయటపడింది. తెలంగాణలో ఏర్పడిన ఆ రెండు పార్టీల బంధం...ఏపీలోనూ పునరావృతమైంది. అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నుంచి పోటీ చేస్తున్న పీసీసీ చీఫ్ రఘువీరా రెడ్డిని గెలిపించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదని స్థానికేతరుడైన ఓ డమ్మీ అభ్యర్థిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బరిలోకి దించారు.
అంతటితోనే ఆగకుండా...రఘువీరా రెడ్డిని గెలిపించాల్సిందిగా తమ పార్టీ శ్రేణులకు సంకేతాలు ఇవ్వడంతో కార్యకర్తలు షాక్‌కు గురయ్యారు. స్వార్థ రాజకీయాల కోసం సొంత పార్టీ అభ్యర్థినే ఓడించమని చెప్పడం ఏమిటని వాడివేడి చర్చ నడుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి, అభ్యర్థిగా తాను ప్రకటించిన అమిలినేని సురేంద్రను కాదనుకున్న చంద్రబాబు...అనూహ్యంగా ఉరవకొండకు చెందిన ఉమా మహేశ్వరరావు అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. రాహుల్ గాంధీ సూచనలతోనే రఘువీరాను గెలిపించేందుకే స్థానికేతరుడైన ఉమా మహేశ్వరరావుకు చంద్రబాబు టికెట్ ఇచ్చారని సాక్షాత్తు టీడీపీ వర్గాలే చెప్తున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థికి ఎలా సహకరించాలని స్థానిక టీడీపీ నేతలు పట్టుకుంటున్నారు. మరోవైపు టీడీపీ-కాంగ్రెస్ అంతర్గత పొత్తుపై అనంతపురంలో చర్చనీయాంశంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment