ఏపీ సీఎం నారా చంద్రబాబు, ఏపీసీసీ అధ్యక్షులు ఎన్ రఘువీరా రెడ్డి
విజయవాడ: ఏపీసీసీ అధ్యక్షులు ఎన్ రఘువీరా రెడ్డి, గురువారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి లేఖ సంధించారు. 2018 సంవత్సరంలో ఎంబీబీస్ సీట్ల వెబ్ కౌన్సిలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని, దానిని వెంటనే సరిదిద్దాలని లేఖలో పేర్కొన్నారు. గతంలో మాదిరిగా జోన్‌ని ఒక యూనిట్‌గా తీసుకుని కాకుండా కాలేజీని ఒక యూనిట్‌గా తీసుకుని కౌన్సిలింగ్ నిర్వహించారని, దాని వల్ల బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్య నభ్యసించే అవకాశాన్ని కోల్పోతున్నారని తెలిపారు.
ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఉన్న జీఓ నెంబర్ 550పై స్టేని ఎత్తి వేయించకుండా, ఆ మేరకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేయకుండా సంవత్సరకాలంగా మీ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దేనికి సంకేతం.. ఇది నిర్లక్ష్యమా లేక ఉద్దేశ పూర్వకమా అని ప్రశ్నించారు. బడుగు, బలహీన వర్గాల చాంఫియన్‌గా పదే పదే తమను తాము అభివర్ణించుకునే మీకిది తగునా అని సూటిగా అడిగారు.
వివక్షకు గురై తీవ్రంగా నష్టపోయిన ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ విద్యార్థులకు తక్షణమే న్యాయం చేయడానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామని, జీఓ నెంబర్ 550 మీద హైకోర్టు ఇచ్చిన స్టేని వెకేట్ చేయించడానికి ప్రభుత్వం వెంటనే పూనుకోవాలని కోరారు. బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని లేఖ ద్వారా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment