
సాక్షి, అమరావతి: రాష్టవిభజన జరిగి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టి ఈ నెల 8తో నాలుగేళ్లు పూర్తవుతోంది. విభజనతో నష్టపోయిన రాష్ట్ర ప్రజలను తొలి రోజు సంతకాల నుంచి సీఎం చంద్రబాబు మోసగిస్తూనే ఉన్నారు. వ్యవసాయ, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీతో పాటు ఎన్నికల్లో 600లకు పైగా హామీలు ఇచ్చి ఆ హామీల్లో ఏవీ అమలు చేయకుండా ప్రజలను నాలుగేళ్లుగా వంచిస్తున్నారు. దీక్షలంటూ దగా చేస్తున్నారు. విభజన తేదీ అయిన జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు నవనిర్మాణ దీక్ష అంటూ రోజుకోరకమైన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతోంది.
ఈ ఏడాది నవనిర్మాణ దీక్ష తొలిరోజు విభజన చట్టం అమలు తీరు అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. నాలుగేళ్లుగా విభజన చట్టాన్ని అమలు చేయించడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు ప్రభుత్వం ఈ ఎన్నికల ఏడాదిలో తన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో భాగస్వామిగా ఉంటూ కేంద్ర ప్రభుత్వంలో నాలుగేళ్లు అధికారాన్ని పంచుకుంది. ఆ పార్టీకి చెందిన ఇద్దరు కేంద్ర మంత్రి పదవుల్లో ఉన్నా విభజన చట్టం అమలు విషయంలో ఏనాడూ ప్రయత్నాలు చేయలేదు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని ఇతర కీలక అంశాలను స్వార్థ ప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు తాకట్టు పెట్టారు. ముఖ్యంగా పదో షెడ్యూల్‌లోని సంస్థల విభజనను నాలుగేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం గాలికి వదిలేసింది. సుప్రీంకోర్టు అనుకూలంగా తీర్పు వెలువరించినా ఆ సంస్థల విభజన పూర్తి చేయించలేకపోయింది.
హోదాపై ఊసరవెల్లిలా రంగులు..
రాష్ట్రానికి ప్రత్యేక హోదా హామీ విషయంలో చంద్రబాబు పలుమార్లు మాటమార్చారు. హోదాకు అనుకూలంగా 13వ ఆర్థిక సంఘం కార్యాచరణ చేపట్టిన విషయం తెలిసిందే. చంద్రబాబు అధికారం చేపట్టాక ఏడు నెలల పాటు ఆ సంఘం ఉనికిలోనే ఉంది. ఆ సమయంలో హోదాను సీఎం పట్టించుకోలేదు. ఆతర్వాత కేంద్రం ప్యాకేజీ ఇస్తానంటే ఒప్పుకున్నారు. హోదాపై ఆయన మాటలు మార్చిన విధానాన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. దగాపడ్డ రాష్ట్రానికి హోదా సంజీవని అని నమ్మిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆ హోదా సాధనకు పలు రూపాల్లో ఉద్యమాలు చేశారు. చివరకు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టడమే కాకుండా తమ ఎంపీలతో రాజీనామా కూడా చేయించారు. వివిధ రకాలుగా ఒత్తిడి పెంచడంతో చంద్రబాబు యూటర్న్ తీసుకుని ఇప్పుడు హోదా రాగం తీస్తున్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరాన్ని తామే నిర్మిస్తామని తీసుకుని కాంట్రాక్టు పనులను తమ వారికి ఇప్పించి చంద్రబాబు భారీగా కమీషన్లు దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్రాజెక్టు పనుల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందనే ఆరోపణల నేపథ్యంలో కేంద్రం ఆ పనులపై దృష్టి పెట్టింది. దీంతో ఇపుడు కేంద్రం అడ్డుపడుతోందంటూ ప్రచారం చేస్తున్నారు.
టెన్త్ షెడ్యూల్ మాటేలేదు..
రాష్ట్ర విభజన చట్టంలోని పదో షెడ్యూల్‌లో ఉన్న 142 సంస్థలకు సంబంధించిన స్థిరచరాస్తుల విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్రానికి అనుకూలంగా తీర్పునిచ్చినా ఆ తీర్పును చంద్రబాబు అమలు చేయించలేదు. తమ భూభాగంలో ఉన్న ఆ సంస్థల నగదు, ఆస్తులన్నీ తమకే చెందుతాయని తెలంగాణ ప్రభుత్వం వాటన్నిటినీ స్వాధీనం చేసుకున్నా.. ప్రశ్నించాల్సిన చంద్రబాబు ఓటుకు కోట్లులో అడ్డంగా దొరికిపోయి అమరావతి వచ్చేశారనే విమర్శలు ఉన్నాయి. 58–42 నిష్పత్తిలో ఏపీ, తెలంగాణ ఆ సంస్థల ఆస్తులను, నగదును పంచుకోవాలని, అవి విభజించుకోలేకపోతే కేంద్రమే విభజన చేయాలని ఉన్నత విద్యామండలి కేసులో 2016లోనే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఆ సంస్థలన్నీ తెలంగాణకే చెందుతాయని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశాలు ఇచ్చినా చంద్రబాబు ప్రశ్నించే ధైర్యం చేయలేదు. ఈ వ్యవహారంలో సుప్రీంకోర్టులో ధిక్కరణ పిటిషన్ వేసేందుకు కూడా ఉన్నత విద్యామండలికి చాలాకాలం అనుమతి ఇవ్వలేదు. టెన్త్ షెడ్యూల్ సంస్థలకు సంబంధించి రాష్ట్రానికి రావలసిన వాటా రూ. 25 వేల కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు నివేదిక ఇచ్చినా చంద్రబాబు నిమ్మకునీరెత్తినట్లే ఉన్నారు.
రాజధానిలో తాత్కాలిక భవనాలతో సరి
రాజధాని నిర్మాణానికి కేంద్రం సహకరిస్తుందని విభజన చట్టంలో పేర్కొన్నారు. కేంద్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న నాలుగేళ్లు కేంద్రం నుంచి సరైన సాయం లేకపోయినా ఎంతో వస్తోందని ప్రజలను మభ్యపెట్టారు. కేంద్రం రూ. 2500 కోట్లు ఇస్తే దాన్ని కేవలం తాత్కాలిక భవనాలకు వెచ్చించారు. వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ సాధించడంలో విఫలమయ్యారు. రెవెన్యూ లోటు విషయంలో కేంద్రం లెక్కలకు, రాష్ట్రం లెక్కలకూ పొంతనే ఉండటంలేదు. జాతీయ విద్యా సంస్థల ఏర్పాటు అయితే ప్రహారీ స్థాయి కూడా దాటలేదు.
రాష్ట్ర ప్రభుత్వం నిష్క్రియాపరత్వం వల్ల ఇప్పటికే ఏర్పాటైన విద్యాసంస్థలు అద్దెభవనాల్లో కాలం వెళ్లదీస్తున్నాయి. కమీషన్లు రావని భోగాపురం ఎయిర్‌పోర్టు కాంట్రాక్టును చంద్రబాబు ప్రభుత్వం రద్దుచేసిందనే ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు అధికారం చేపట్టిన నాలుగేళ్ల తర్వాత కూడా రాష్ట్రం పరిస్థితి ఎక్కడవేసిన గొంగడి అక్కడే అన్నట్లు ఉంది. విభజన హామీలను అమలు చేయించడంలో పూర్తిగా విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు.. నాలుగేళ్ల తర్వాత కూడా నవనిర్మాణదీక్ష అంటూ తమను మోసగించడానికి ప్రయత్నిస్తుండటంపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీక్ష పేరిట డ్రామాలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment